నేను రావ‌డంతోనే ప్ర‌మాదం జ‌రిగింద‌న‌డం పూర్తిగా అవాస్త‌వం – అల్లు అర్జున్‌

December 13, 2024

నేను రావ‌డంతోనే ప్ర‌మాదం జ‌రిగింద‌న‌డం పూర్తిగా అవాస్త‌వం – అల్లు అర్జున్‌

సంధ్యా థియేటర్ ఘటనలో అరెస్టయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. మహిళ మృతితో తనకు ఎలాంటి సంబంధం లేదని అల్లు అర్జున్ చెప్పారు. తాను రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందనడం పూర్తి అవాస్తమని ఐకాన్ స్టార్ చెప్పుకొచ్చారు. సినిమా విడుదల సందర్భంగా థియేటర్‌కు వెళ్లడం సహజమేనని, కానీ ఇలాంటి సంఘటన జరుగుతుందని తానూ ఊహించలేదని పోలీసులకు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. గతంలోనూ తాను ఎన్నో సినిమాలకు రిలీజ్ సమయంలో థియేటర్ల వద్దకు వెళ్లానని చెప్పారు అల్లు అర్జున్. ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదని ఆయన అన్నారు. గతంలో లాగే పుష్ప-2 సినిమా రిలీజ్ కోసం సంధ్యా థియేటర్ వెళ్లానని, అక్కడ జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతిచెందిన వార్త చాలాసేపటి తర్వాత వ్యక్తిగత సిబ్బంది ద్వారా తెలిసిందని పోలీసులకు ఆయన వివరించారు. ఈ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఐకాన్ స్టార్ పోలీసుల స్టేట్మెంట్‌లో చెప్పారు. కాగా, అల్లు అర్జున్ స్టేట్మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు.

అస‌లేం జ‌రిగింది. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా విడుద‌ల‌కి ఒక రోజు ముందే డిసెంబ‌రు 4 రాత్రి 9:30నిమిషాల‌కి సంధ్య థియేటర్ లో ప్రీమియర్ వేశారు. అదే రోజు చాలా థియేటర్లలో ప్రీమియర్లు వేశారు. అటు సింగిల్ స్క్రీన్ లు, ఇటు మల్టీ ప్లెక్స్ లు. ఎక్కడా ఎలాంటి తొక్కిసలాట జరగలేదు. కానీ సంధ్య థియేటర్ కి అల్లు అర్జున్ వ‌స్తున్నాడ‌ని తెలుసుకుని అభిమానులు భారీగా రావ‌డంతో తొక్కిస‌లాట జ‌రిగింది. అభిమాన నటుడు రావడంతో అతన్ని చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున ఎగబడ్డారు. దీంతో సినిమా చూసేందుకు కుటుంబంతో కలిసి వచ్చిన రేవతి అనే మహిళ ఈ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడి పరిస్థితీ విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్‌, సంధ్యా థియేటర్ యాజమాన్యంపై నమోదైంది. ఈ మేరకు ఇవాళ(శుక్రవారం) అల్లు అర్జున్ పోలీసులు అరెస్టు చేశారు.

అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చిన సమయంలో భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోనందుకు థియేటర్‌ యాజమాన్యంపైనా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు. మరోవైపు తనపై చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ హైకోర్టును అల్లు అర్జున్ ఆశ్రయించారు. కాగా, ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు కేసు విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు