Aa Okkati Adakku Review: అల్ల‌రోడు త‌న తండ్రి క్లాసిక్ టైటిల్‌తో హిట్ కొట్టాడా?

May 3, 2024

ఆ ఒకటీ అడక్కు

ఆ ఒకటీ అడక్కు

  • Cast : నరేష్, ఫరియా అబ్దుల్లా, జామీ లీవర్, హర్ష చెముడు, హరితేజ, వెన్నెల కిశోర్, అరియనా గ్లోరీ, రాజా తదితరులు
  • Director : మల్లి అంకం
  • Producer : రాజీవ్ చిలక
  • Banner : చిలక ప్రొడక్షన్స్
  • Music : గోపి సుందర్

2 / 5

ఇవివి సత్యనారాయణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన విజయవంతమైన సినిమాల్లో ‘ఆ ఒక్కటీ అడక్కుస ఒక‌టి, ఇప్పుడు 32 ఏళ్ల త‌ర్వాత‌ అతని తనయుడు అల్లరి నరేష్ అదే పేరుతో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవు తుండ‌గా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

గణపతి అలియాస్ గణ (అల్లరి నరేష్) సబ్ రిజిస్టార్ ఆఫీస్ ఉద్యోగి. తన చేతుల మీద వందల పెళ్ళిళ్ళు చేస్తాడు కానీ తనకు మాత్రం పెళ్లి సెట్‌కాదు. ఇక త‌న తమ్ముడు (రవికృష్ణ)కి మేనమామ కూతురు దేవి (జేమీ లివర్)తో పెళ్లి జరుగుతుంది. ఇంట్లో వాళ్లంతా గణ కోసం ఎన్నో సంబంధాలు చూస్తారు. కానీ, గణ వయసు ఎక్కువనో.. తమ్ముడుకి ముందు పెళ్లి అయిందనో రకరకాల కారణాలు చెప్పి పిల్లను ఇవ్వడానికి నిరాకరిస్తుంటారు. దీంతో చేసేదేమీ లేక ఆఖరి ప్రయత్నంగా హ్యాపీ మ్యాట్రిమోనీలో చేరతాడు. వాళ్ళు చూపించిన‌ మ్యాచ్ లో భాగంగా సిద్ది( ఫారియా అబ్దుల్లా)ని చూస్తాడు. తొలి చూపులోనే నచ్చేస్తుంది. అయితే తనకి ఇంకా తొమ్మిది ఆప్షన్స్ వున్నాయని, అవ‌న్నీ చూశాక‌ అప్పుడే డిసైడ్ చేసుకొంటాన‌ని చెబుతుంది. ఈ క్రమంలోనే జబ్బు పడిన తన తల్లిని సంతోష పెట్టేందుకు ఓసారి సిద్ధిని తన ప్రియురాలిగా ఇంటికి తీసుకెళ్లి పరిచయం చేస్తాడు. కట్‌ చేస్తే.. ఆ మరుసటి రోజే సిద్ధి గురించి ఓ వార్త బయటకొస్తుంది. హ్యాపీ మ్యాట్రిమోనీలో తన పేరు నమోదు చేసుకుని అబ్బాయిల దగ్గర డబ్బులు కొట్టేసే ఖిలాడీ లేడీ అంటూ వార్తల్లోకి ఎక్కుతుంది. మరి ఆ తర్వాత ఏమైంది? నిజంగా సిద్ధి నేపథ్యమేంటి? ఆమె పని చేస్తున్న మ్యాట్రిమోనీ సంస్థ పెళ్లి కాని కుర్రాళ్లను ఎలా మోసం చేస్తోంది? వాళ్ల ఆగడాల్ని గణ ఎలా ఆటకట్టించాడు? సిద్ధి గురించి నిజం తెలిశాక తనేం చేశాడు? తదితర విషయాలు తెరపై చూడాల్సిందే!

పెళ్లి అనేది అందరూ కనెక్ట్ చేసుకునే టాపిక్. అందుకే రొమాంటిక్ కామెడీలు దాదాపు పెళ్లి, ప్రేమలు చుట్టూనే తిరుగుతాయి. ఆ ఒక్కటీ అడక్కు కోసం కొత్త దర్శకుడు మల్లి అంకం ఎత్తుకున్న ‘పెళ్లి’ పాయింట్ బలమైనదే. పెళ్లి కాక ఇబ్బందులు పడుతున్న యువతీయువకులు మ్యాట్రిమోనీ సైట్లను ఆశ్రయించి ఎలా మోసపోతున్నారు? ఆ వివాహ వేదికల ద్వారా వాళ్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి? సదరు సంస్థలు వాళ్ల మనోభావాలతో ఎలా ఆడుకుంటున్నాయన్నది ఈ చిత్రంలో ప్రధానంగా చర్చించారు. నిజానికిది చాలా సీరియస్‌ ఇష్యూ. ఆ అంశాన్నే ఈ చిత్రంలో వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశారు. అయితే పాయింట్ లోని బలం తెరపై కనిపించినపుడే దాని ప్రభావం వుంటుంది.

గ‌ణ పెళ్లి చూపుల తంతుతో కథ మొదలౌతుంది. గణ కుటుంబ నేపథ్యం.. బావకు పెళ్లి చేయాలని తపన పడే మరదలిగా జెమీ లివర్‌ చేసే హంగామా.. ఈ క్రమంలో వచ్చే గణ పెళ్లి చూపుల ఎపిసోడ్‌.. అన్నీ సరదా సరదాగా సాగిపోతాయి. అయితే హీరో పాత్ర చుట్టూ నడిపిన సన్నివేశాలు ఇదివరకు చూసిన చాలా సినిమాల సీన్లని గుర్తుకు తెస్తాయి. సిద్ధి పాత్ర కథలోకి ప్రవేశించాక సినిమా కాస్త రొమాంటిక్‌గా మారుతుంది. ఇక హ్యాపీ మ్యాట్రిమోనీలో సభ్యుడిగా చేరాక గణకు ఎదురయ్యే అనుభవాలు ఓవైపు నవ్విస్తూనే ఆలోచింపజేయిస్తాయి. గుణ, సిద్ది పాత్రల మధ్య కెమిస్ట్రీ వర్క్ అయితే కథలో డ్రామా బిల్డ్ అయ్యేది. కానీ ఆ రెండు పాత్రలు కథలో లీనం కాలేదు. విరామానికి ముందు సిద్ధిలోని మరో కోణం ప్రేక్షకులకు పరిచయమవుతుంది. అది చూశాక గణ కూడా ఆమెతో చేతిలో మోసపోనున్నాడా? అన్న ఆసక్తి అందరిలోనూ మొదలవుతుంది. ద్వితీయార్ధంలో ఓవైపు గణ లవ్‌ట్రాక్‌ను చూపిస్తూనే.. మరోవైపు మ్యాట్రిమోనీ సైట్ల మాటున జరుగుతున్న మోసాల్ని బలంగా ఎత్తిచూపే ప్రయత్నం చేశారు దర్శకుడు. దీంతో కథ పూర్తిగా సీరియస్‌గా సాగుతున్న అనుభూతి కలుగుతుంది. దీంట్లో చూపించిన ఎన్నారై పెళ్లి కొడుకుల మోసాలు తెలిసిన వ్యవహారమే అయినా ఫేక్‌ పెళ్లి కూతురు అనే కాన్సెప్ట్‌ కాస్త కొత్తగా అనిపిస్తుంది. అలాగే దీని చుట్టూ నడిపిన కామెడీ ట్రాక్‌ అక్కడక్కడా నవ్వులు పూయించింది.

గణపతి వంటి ఫ్రస్టేషన్‌ పాత్రలు అల్లరి నరేష్‌కు కొట్టిన పిండి. అందుకే ఈ పాత్రను ఆయన తనదైన శైలిలో తేలికగా చేసుకుంటూ వెళ్లిపోయారు. కాకపోతే ఆయనలోని కామెడీని దర్శకుడు పూర్తిగా ఉపయోగించుకోలేకపోయారనిపిస్తుంది. ఫారియా నరేష్ హైట్ ని మ్యాచ్ చేసింది. ఈ కథలో ఆమేది కీలక పాత్రే. తన పాత్ర వరకూ చక్కగానే చేసింది. అయితే పాత్రని ఇంకా బలంగా తీర్చిదిద్దాల్సింది. జెమీ లివర్ టైమింగ్ బావుంది. తను చాలా యాక్టివ్ గా కనిపించింది. వెన్నెల కిశోర్ ది కాసేపు కనిపించి మాయమయ్యే పాత్ర. మురళీ శర్మ, అజయ్, అనీష్ కురువిల్ల, రాజీవ్ కనకాల, రఘు బాబు, గోపరాజు రమణ ఇలా ఎంతోమంది తారాగణం ఉన్నప్పటికీ ఎవరికీ చెప్పుకోదగ్గ సీన్స్ లేవు. గోపీ సుందర్ సంగీతం చప్పగా వినిపించింది. పాటలు రిజిస్టర్ కాలేదు, నేపధ్య సంగీతం సన్నివేశాలని ఇంకా రొటీన్ గా మార్చేసింది. కెమరాపనితనం ఫ‌ర్వాలేదు. ప్రొడక్షన్ డిజైన్ కథకు తగ్గట్టుగా వుంది. అబ్బూరి రవి మాటలు ప్రభావాన్ని చూపలేకపోయాయి. చాలా ఎమోషనల్ మాటలు రాశారు కానీ అవి మెసేజ్ లా మారిపోయాయి. దర్శకుడు కథ, కథనాన్ని రాసుకున్న విధానం బేసిక్ గా వుంది. అద్భుతంగా తీశారనే సన్నివేశాలు వెతికినా దొరకవు. ‘ఆ ఒక్కటీ అడక్కు’ ఈవీవీ క్లాసిక్ టైటిల్. ఇంత సాధారణమైన కంటెంట్ కి ఈ టైటిల్ పెట్టి పేరులోని మ్యాజిక్ ని తగ్గించినట్లయింది.

బాట‌మ్ లైన్‌: ఆ ఒక్క‌టి మిస్ అయింది

ట్రెండింగ్ వార్తలు