August 25, 2022
‘దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదేనేమో!, గురువింద తన నలుపు ఎరుగదు…ఇదిగో ఇలానే నెటిజన్లు, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనసూయపై సోషల్‌మీడియాలో విరుచుకుపడుతున్నారు. ఇంతకు విషయం ఏంటంటే… విజయ్‌దేవరకొండ నటించిన ‘అర్జున్‌రెడ్డి’ ఈ ఆగస్టు 25తో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అయితే ఇదే తేదీన ‘లైగర్’ సినిమా కూడా విడుదలైంది. ‘అర్జున్‌రెడ్డి’ విజయ్‌దేవరకొండ కెరీర్‌కు స్టార్‌డమ్‌ను తీసుకువస్తే, ‘లైగర్’ సినిమా మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సమయంలోనే ‘అమ్మను అన్న ఉసురు ఊరికే పోదు..కర్మ. కొన్నిసార్లు రావడం లేటవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. మరొకరు బాధపడాలన్నది నా ఉద్దేశం కాదు. కానీ ఫేత్ రిస్టోర్డ్’ అని ట్వీట్ చేసింది అనసూయ.
అర్జున్‌రెడ్డి సినిమాలో విజయ్‌దేవరకొండ ఓ అభ్యంతరకరమైన డైలాగ్‌ను చెబుతాడు. తల్లి గురించి అలా మాట్లాడడం కరెక్ట్ కాదని అప్పట్లో అనసూయ ట్వీట్స్ చేసింది. దాంతో విజయ్ ఫ్యాన్స్ మండి పడ్డారు. అనసూయ చేసే షోలో అన్ని డబుల్‌మీనింగ్ డైలాగ్సే ఉంటాయని, ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా అనసూయ ఎలాంటి డ్రస్సులు వేసుకుంటుందో అందరికీ తెలుసు అని అనసూయపై సోషల్‌మీడియాలో దాడి చేశారు విజయ్ ఫ్యాన్స్. ఈ అంశాన్ని మనసులో పెట్టుకున్న అనసూయ ఇప్పుడు ‘లైగర్’ రిలీజ్ రోజున ఇలా విజయ్‌ను ఉద్దేశించి పరోక్షంగా ట్వీట్ చేశారని విజయ్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.
సోషల్ మీడియాలో విజయ్‌ఫ్యాన్స్ అనసూయను విపరీతంగా ట్రోల్ చేయడంతో అనసూయ ఈ విషయంపై కూడా మళ్లీ ట్వీట్స్ చేసింది ‘‘మీరు నన్ను అసభ్యపదజాలంతో దూషించడం, తిట్టడం, ఆడిపోసుకోవడం అనేవి మళ్లీ కర్మ రూపంలో మీ హీరోలకే తగులుతాయి. నన్ను తిట్టడం అనేది మీ సమస్య. మీ సమస్యలను గురించి ఆలోచించడం అనేది నా సమస్య కాదు’’ అని ట్వీట్స్ చేసింది. అసలే తమ అభిమాన హీరో సినిమాకి డిజాస్టర్ టాక్ రావడంతో బాధలో ఉన్న ఫ్యాన్స్‌కి అనసూయ ట్వీట్స్ మరింతగా బాధిస్తున్నాయి మరి..ఈ వివాదంపై ఎంత వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.