May 3, 2024
రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ముని
చిత్రం తెలుగులో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు హారర్ చిత్రాల ఫ్రాంచైజీలకు శ్రీకారం చుట్టింది. దానిలో భాగంగానే కాంచన
, రాజుగారి గది
, హిట్
వంటి హారర్,థ్రిల్లర్ చిత్రాలు తమ ఫ్రాంచైజీలతో ప్రేక్షకులని అలరిస్తున్నాయి. కాంచన
తర్వాత మంచి విజయం సొంతం చేసుకున్న మరో తమిళ చిత్రం “ఆరణ్మనై”. ఈ సిరీస్‌లో ఇప్పటివరకూ మూడు చిత్రాలు వచ్చాయి. సూపర్‌స్టార్ రజనీకాంత్ అరుణాచలం
దర్శకుడు సుందర్.సి దర్శకత్వంలో వచ్చిన ఈ మూడు చిత్రాల్లో రెండు ఘన విజయాన్ని సొంతం చేసుకోగా “ఆరణ్మనై” మూడవ పార్ట్ మాత్రం ప్రేక్షకులని ఆకట్టుకోలేక పోయింది. అయినప్పటికీ ఆ ఫ్రాంచైజీలో మరో చిత్రంగా “ఆరణ్మనై-4” తెలుగులో “బాక్”గా విడుదలైంది. తమన్నా, రాశీఖన్నా వంటి గ్లామరస్ హీరోయిన్స్ ప్రేక్షకులని భయపెట్టడానికి సిద్ధమయ్యారు, మరి ఈ రోజు విడుదలైన ఈ చిత్రం విజయం సాధించిందో లేదో ఇప్పుడు చూద్దాం(Baak movie review in telugu)
శివ శంకర్(సుందర్.సి) ఓ లాయర్, అతని చెల్లెలు శివాని(తమన్నా) తమ ఇంట్లో వాళ్లని కాదని ప్రేమ వివాహం చేసుకుని వారికి దూరంగా వేరే ఇంట్లో ఉంటుంది. అనుకోకుండా ఒక రోజు శివాని ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ తర్వాత తన భర్త కూడా అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. మానసికంగా ఎంతో స్ట్రాంగ్ అయిన తన చెల్లెలు ఆత్మహత్య చేసుకోవడంపై శివ శంకర్‌కి అనుమానం మొదలై స్వయంగా తానే కారణాల్ని పరిశోదించడం మొదలుపెడతాడు. ఈ ఇన్వెస్టిగేషన్‌లో పలు ఆసక్తికరమైన అంశాలు బయటపడతాయి. ఇంతకీ శివ శంకర్ తన సోదరి మరణానికి కారణం కనిపెట్టాడా? తన సోదరికీ బాక్
అనే దుష్టశక్తికి సంభందం ఏంటి? తన చెల్లెలు మరణానికి కారణమైన వారిపై శివ శంకర్ ప్రతీకారం తీర్చుకున్నాడా లేదా అనేది మిగతా కథ.
సాధారణంగా నవ్విస్తూ భయపెట్టడమే ఇలాంటి సిరీస్‌ల లక్ష్యం..అయితే బాక్
అంటే ఎప్పటికప్పుడు తన ఆకారాన్ని మార్చుకునే ఓ దుష్టశక్తి అని..దీనిని అసామీ జానపథాల నుండి ప్రేరణ పొందామని చిత్ర యూనిట్ చెప్పడంతో సగటు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. అయితే ఇలాంటి దుష్టశక్తుల నేపథ్యంలో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయని తెలుసుకోవడానికి ప్రేక్షకులని ఎక్కువ సమయం పట్టదు. కొత్తదనం ఊహించి వెళ్లిన సగటు ప్రేక్షకులకి మొదట్లోనే నిరాశ ఎదురవుతుంది. కాంచన
సిరీస్ విజయానికి హారర్‌తో పాటు కామెడీ కూడా ప్రధాన కారణం. బాక్
లో చాలా మంది కమెడియన్స్ ఉన్నా కామెడీ మాత్రం మిస్ అయింది. ప్రతీకారం,సెంటిమెంట్ అనే రెండు కీలక అంశాలు కూడా ప్రేక్షకులని ఎంగేజ్ చేయలేవు. శివాని ఆత్మగా మారి ప్రతీకారం తీర్చుకునే సన్నివేశాలు ఇంకా బలంగా రాసుకునే వీలుంది. తన సోదరి మరణానికి కారణాలు అన్వేశించే సన్నివేశాలు ఇంట్రెస్ట్రింగ్ గా సాగుతాయి. అసలు తన సోదరిది హత్యా?, ఆత్యహత్యా? అనే విషయాల్ని బయటపెట్టే సన్నివేశాలు ఆడియన్స్‌లో కొంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయగలుగుతాయి కాని.. కథ సీరియస్ మోడ్‌లోకి వెళ్లిన ప్రతిసారి వచ్చే కామెడీ ప్రేక్షకులని కథ నుండి డీవియేట్ చేస్తుంది. కథ, కథనాలు అంత బలంగా లేకపోయినా ఈ సినిమాలో విజువల్స్ మాత్రం నెక్ట్స్ లెవల్‌లో ఉంటాయి. బాక్, శివానీ తలపడినప్పుడు ఇద్దరూ తమ శక్తియుక్తుల్ని ప్రదర్శించడం, ఆ నేపథ్యంలో వచ్చే విజువల్స్‌లో జంప్ స్కేర్ షాట్స్ & రోబోటిక్ షాట్ టెక్నాలజీని వినియోగించుకున్న తీరు ప్రశంసనీయం.
తమన్నా తన పిల్లల్ని కాపాడుకునే ఓ తల్లిగా చక్కగా నటించింది. ఆమె పాత్రలో సెంటిమెంట్ బాగా పండింది. ఆత్మగా కనిపిస్తూ చేసే హంగామా కూడా చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మాయ అనే ఓ వైద్యురాలిగా కీలక పాత్రలో కనిపిస్తుంది రాశీఖన్నా. ఇక సుందర్.సి నటన గురించి తెలిసిందే… కోవై సరళ, శ్రీనివాస్‌రెడ్డి, వెన్నెల కిశోర్ చేసే హంగామా అక్కడక్కడా నవ్విస్తుంది. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. హిప్ హాప్ తమిళ సంగీతం చిత్రానికి ప్రధానబలం. కిచ్చా విజువల్స్ కూడా ఆకట్టుకుంటాయి. కథ, కథనాలు ఆసక్తికరంగా లేకపోయినా, నిర్మాణ విలువలు, విజువల్ గ్రాండ్‌నెస్ సినిమాని ప్రత్యేకంగా మార్చేశాయి. పతాక సన్నివేశాలు సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఆఖరి పాటలో సిమ్రన్, ఖుష్బూ కలిసి చేసిన సందడి కూడా మెప్పిస్తుంది. హిప్ హాప్ (Hiphop Tamizha) తమిళ నేపధ్య సంగీతం బాగుంది. కొన్ని హారర్ ఎమోషన్స్ ను బాగా ఎలివేట్ చేశాడు. ప్రొడక్షన్ డిజైన్, కలరింగ్, డి.ఐ, సౌండ్ డిజైనింగ్ తదితర అంశాలన్నీట్లో బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు
టెక్నికల్ టీం. రైటర్ కమ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ సుందర్.సి క్లైమాక్స్ & ఇంటర్వెల్ బ్లాక్స్ ను రాసుకున్న, కంపోజ్ చేసుకున్న విధానం బాగుంది. ఈ రెండు మినహా మిగతా సినిమా మొత్తం ఒక టెంప్లేట్లో చాలా సాదాసీదాగా సాగింది. అందువల్ల మాస్ ఆడియన్స్ ను కూడా పూర్తిస్థాయిలో అలరించలేకపోయిందీ చిత్రం. సో, ఒక దర్శకుడిగా, కథకుడిగా సుందర్.సి ఆకట్టుకోలేకపోయాడనే చెప్పాలి.
బాటమ్‌లైన్: బాక్..గో బ్యాక్