December 13, 2021
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమా కోసం అటు పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ అభిమానులు, రానా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా విడుదలచేస్తున్నట్లు గతంలోనే ప్రకటించారు.
జనవరి 7న ఆర్ ఆర్ ఆర్ విడుదలవుతుంది. ఆ సినిమా తర్వాత ఐదు రోజుల్లో జనవరి12 భీమ్లా నాయక్, వెంటనే బంగార్రాజు, జనవరి14న రాధేశ్యామ్ సినిమాలు విడుదల కానున్నాయి.
సాధారణంగా సంక్రాంతి సీజన్‌లో పెద్దహీరోల సినిమాలు రెండు మరో రెండు చిన్న హీరోల సినిమాలు లేదా డబ్బింగ్ సినిమాలు విడుదలవుతుంటాయి. అప్పుడు థియేటర్స్ సమస్య ఉండదు. కాని ఈ సారి సంక్రాంతి పోటీ భిన్నంగా కనిపిస్తోంది.
ఎందుకంటే ఆర్ ఆర్ ఆర్ దాదాపు 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ సినిమా..జనవరి7న రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని థియేటర్స్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ కలెక్షన్స్ రాబట్టాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫుల్ రన్‌లో కనీసం మూడు వారాలైనా సినిమా ఆడాల్సి ఉంటుంది. కాని జనవరి 12న భీమ్లా నాయక్ విడుదలైతే అందులో సగం థియేటర్స్ తగ్గుతాయి. వెంటనే బంగార్రాజు, రాధేశ్యామ్ సినిమాలు ఉండడంతో ఏ సినిమాకు హిట్ టాక్ వచ్చినా ఆర్ ఆర్ ఆర్ థియేటర్స్ సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది.
అందుకని భీమ్లా నాయక్ సినిమా వాయిదా వేసుకొమ్మని ఇండస్ట్రీ పెద్దలు నిర్మాతలను అడుగుతున్నారు. కాని అక్కడ తుది నిర్ణయం తీసుకోవాల్సింది పవన్ కళ్యాణ్ అని తెలుస్తోంది. రిలీజ్ డేట్స్ దగ్గర పడుతుండడంతో ఎలాగైనా భీమ్లా నాయక్ ను వాయిదా వేయించమని కోరుతూ రాధేశ్యామ్ నిర్మాత వంశీ, ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య వెళ్లి డైరెక్టర్ త్రివిక్రమ్ ను కలిసిట్టు తెలుస్తోంది. అయితే తన చేతుల్లో ఏం లేదని, తన ప్రయత్నం తాను చేస్తానని ఆయన చెప్పారట.
పవన్ కళ్యాణ విశాఖ పర్యటన ముగించుకుని ఈ రోజే తిరిగి హైదరాబాద్‌కు వచ్చారు. ఈ రోజు రాత్రో లేదా రేపో త్రివిక్రమ్ వెళ్లి పవన్‌కు పరిస్థితి వివరించే అవకాశం ఉంది. పవన్ ఒక్కడిని ఒప్పించగలిగితే భీమ్లా నాయక్ వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక వేళ భీమ్లా నాయక్ వాయిదా పడితే సమ్మర్ సినిమాలు డేట్లు మార్చుకునే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఈ రోజు వెంకటేష్ బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన ఎఫ్ 3 పోస్టర్‌లో రిలీజ్ డేట్ వేయలేదని తెలుస్తోంది.