సినీ ఎడిట‌ర్ గౌతమ్ రాజు ఇకలేరు..

July 6, 2022

సినీ ఎడిట‌ర్ గౌతమ్ రాజు ఇకలేరు..

ప్రముఖ సినీ ఎడిటర్‌ గౌతమ్‌ రాజు(68) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో తన తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత సమస్యల కారణంగా వారం రోజుల క్రితం నగరంలోని ప్రముఖ ఆస్పత్రిలో ఆయన్ను చేర్పించారు. వైద్యులు తీవ్రంగా కృషి చేసినప్పటికీ…ఈ రోజు తెల్లవారుజామున తిరిగి రాని లోకాలకు వెళ్లారు.

ఆయన మరణవార్తతో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. గౌతమ్‌ రాజు మృతిపై పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. మోతీనగర్‌లోని గౌతమ్ రాజు నివాసం వద్ద ఆయన పార్ధీవ దేహం ఉంది. పలువురు ప్రముఖులు అక్కడికి చేరుకొని నివాళులు అర్పిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.

చిరంజీవి న‌టించిన‌ ‘చట్టానికి కళ్లులేవు’(1981) సినిమాతో గౌతమ్‌రాజు ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టారు. ‘ఆది’ చిత్రానికి గాను ఉత్తమ ఎడిటర్‌గా నంది అవార్డును అందుకున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో 1000పైగా చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌రల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నారు.

చిరంజీవి,బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్‌కల్యాణ్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు నటించిన ఎన్నో సూప‌ర్‌హిట్‌ సినిమాలకు ఆయన ఎడిట‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వర్తించారు. ‘ఖైదీ నెంబర్‌ 150’, ‘గబ్బర్‌సింగ్‌’, ‘కిక్‌’, ‘రేసుగుర్రం’, ‘గోపాల గోపాల’ ‘అదుర్స్‌’, ‘బలుపు’, ‘రచ్చ’, ‘ఊసరవెల్లి’, ‘బద్రీనాథ్’, ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ ‘కాటమరాయుడు’ తదితర ప్రాజెక్ట్‌లతో ఆయన సినీ ప్రేక్షకుడి మది గెలుచుకున్నారు. మోహ‌న్‌బాబు న‌టించిన స‌న్ ఆఫ్ ఇండియా ఎడిట‌ర్‌గా ఆయ‌న చివ‌రి చిత్రం.

Related News

ట్రెండింగ్ వార్తలు