January 26, 2022
RGV: అతిలోక సుందరి శ్రీదేవి కుటుంబం నుండి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మహేశ్వరి. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించినప్పటికీ గులాబీ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఆ తరువాత ఎక్కువ సినిమాల్లో కనిపించక పోయినా.. అందరి మనసులో ఆమె అపురూప సౌందర్యం, అభినయం ఇప్పటికీ అలాగే దాగి ఉంది. తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఈ భామ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
రామ్ గోపాల్ వర్మపై సంచలన ఆరోపణలు
” దెయ్యం ” సినిమా షూటింగ్ మేడ్చల్ లోని వర్మ ఫామ్ హౌస్ లో జరిగిందని.. అక్కడి నుంచి మెయిన్ రోడ్డు 2 కిమీల దూరం ఉంటుందని నటి మహేశ్వరి చెప్పారు. అక్కడ శ్మశానం సెట్ వేశారని.. రాత్రి ఒంటి గంటకు ఎవరైనా మెయిన్ రోడ్డు వరకు ఒంటిరిగా వెళ్లి వస్తే.. రూ.50 వేలు ఇస్తానని రామ్ గోపాల్ వర్మ అన్నారని మహేశ్వరి చెప్పారు. దీంతో రామ్ గోపాల్ వర్మ చెప్పినట్లు మహేశ్వరి ఒంటిరిగా వెళ్లి వచ్చినప్పటికీ..రామ్ గోపాల్ వర్మ ఇంకా ఆ 50 వేలు ఇవ్వలేదని సంచలన ఆరోపణలు చేసింది.
మేఘాలలో తేలిపొమ్మన్నది పాట షూటింగ్ సమయంలో ప్రమాదం
గులాబీ సినిమా గురించి చెబుతూ మేఘాలలో తేలిపొమ్మన్నది పాట షూటింగ్ సమయంలో ప్రమాదం చోటు చేసుకుందని చెప్పింది. ఆ పాట షూటింగ్ కు ముందు తానెప్పుడూ బైక్ ఎక్కలేదని చెప్పింది. అంతేకాకుండా ఈ సాంగ్ లో బైక్ పై చాలా వేగంగా వెళ్లాలని జెడి చక్రవర్తి తో దర్శకుడు కృష్ణవంశీ చెప్పారని తెలిపింది. దాంతో తనకు భయం పెరిగిపోయిందని జెడి చక్రవర్తి చాలా స్పీడ్ గా బైక్ నడిపాడని పేర్కొంది. పాట షూటింగ్ చేసిన సందర్భంలో బైక్ స్కిడ్ అయిందని మహేశ్వరి తెలిపింది. దాంతో బైక్ ఒక్కసారి కాలువలోకి వెళ్లి పడిపోయిందని తనకు ఏమీ అర్థం కాలేదని అయితే అందులో ఒక చెట్టు ఉండడం వల్ల బతికి బయటపడ్డామని చెప్పుకొచ్చింది. అక్కడే ఉన్న వాళ్ళు బైక్ ను వెనక్కి లాగారని అలా ప్రమాదం నుండి బయటపడ్డామని తెలిపింది