October 31, 2024
‘క’ లాంటి కాన్సెప్టు ఇంత వరకూ రాలేదు.. అలా వచ్చిందని నిరూపిస్తే సినిమాలు మానేస్తా’ అని కిరణ్ అబ్బవరం స్వయంగా చెప్పడంతో ప్రేక్షకుల్లో `క` సినిమా మీద ఆసక్తి పెరిగింది. దీపావళి బరిలో నిలిచిన నాలుగు చిత్రాల్లో ఇదీ ఒకటి. ఆయన చెప్పినట్లు ఈ సినిమాలో ఉన్న కొత్తదనమేంటి? పండుగ సందర్భంగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరించిందా లేదా అన్నది ఇప్పుడు చూద్దాం.
కథ: ఇది క్రిష్ణగిరి అనే గ్రామంలో 70దశకంలో జరిగే కథ. ఆ గ్రామం చుట్టూర ఎత్తైన కొండలు ఉండడంతో మధ్యాహ్నం మూడు గంటలకు వాటి నీడ పడడంతో ఆ గ్రామం అంతా చీకటి అలుముకుంటుంది. దాంతో దీపాల వెలుగులోనే ఆ గ్రామం ఉంటుంది. అలాంటి గ్రామంలో అనుకోకుండా తెల్లవారుజామున యుక్త వయసుకి వచ్చిన అమ్మాయిలు కనపడకుండా పోతుంటారు. పోలుసులు ఎంత వెతికినా కారణం తెలియదు. మరో వైపు అభినయ వాసుదేవ్(కిరణ్ అబ్బవరం) ఓ అనాథ. తనని ఎవరో ఓ అనాథ రక్షక ఆశ్రమంలో చేర్చుతారు. అతనికి ఎవరూ లేక పోవడంతో ఆ ఆశ్రమంలోని వారికి వచ్చే ఉత్తరాలు చదువుతూ అవి తాను రాస్తున్నట్టో లేక తనకోసం రాసినట్టో ఊహించుకుని సంబరపడిపోతుంటాడు. అదే అతనికి వ్యసనంలా మారుతుంది..దాంతో ఆ ఆశ్రమం నుండి బయటకు పంపేస్తారు.. చిన్నప్పటి నుంచే ఇతరుల ఉత్తరాలు చదవే అలవాటు ఉండడంలో పెద్దయ్యాక క్రిష్ణగిరి గ్రామానికి అసిస్టెంట్ పోస్ట్ మేన్‌గా చేరతాడు. ఆ ఊరికి వచ్చే అందరి ఉత్తరాలు చదివడంతో పాటు అవసరమైనవాటికి బదులు కూడా రాస్తుంటాడు. ఈ క్రమంలోనే పోస్ట్‌మాస్టర్ రంగారావు (అచ్యుత్ కుమార్) కూతురు సత్యభామ (నయన సారిక)తో ప్రేమలో పడతాడు. అయితే ఓ రోజు అరబిక్ భాషలో ఉన్న ఓ ఉత్తరం చదివి షాక్ అవుతాడు వాసుదేవ్. అసలు..ఆ ఉత్తరంలో ఏముంది? ఈ ఉత్తరం వాసుదేవ్ జీవితాన్ని ఎలా మార్చింది? క్రిష్ణగిరిలో అమ్మాయిల మిస్సింగ్ మిస్టరీకి ఈ ఉత్తరానికి ఉన్న సంబంధం ఏమిటి? తాను ఇష్టపడ్డ సత్యభామతో వాసుదేవ్ వివాహం జరుగుతుందా? మధ్యలో రాధ ఎవరు? అనేది ఈ సినిమా మిగిలిన కథాంశం.
విశ్లేషణ: దర్శకులు ఎంచుకున్న కథ.. నాన్‌లీనియర్ స్టైల్‌లో దాన్ని నడిపిన తీరు.. ఈ కథను సెట్ చేసిన కృష్ణగిరి ఊరు.. అందులోని సమస్య.. దాన్ని పరిష్కరించే క్రమంలో హీరోకి ఎదురయ్యే సవాళ్లు.. వేటికవే ఆకట్టుకుంటాయి. అయితే సినిమా అంతా ఒకెత్తైతే ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం ప్రేక్షకులకి మంచి కిక్ ఇస్తుంది. ఇక క్లైమాక్స్ ఆడియన్స్‌ని వేరే ట్రాన్స్‌లోకి తీసుకెళ్తుంది. మనిషి పుట్టుక.. కర్మ ఫలం.. రుణానుబంధం.. ఈ మూడు అంశాల్ని ముడిపెట్టి దర్శకుడు చెప్పిన సందేశం థ్రిల్‌కి గురిచేస్తుంది.
వాసుదేవ్ చిన్ననాటి సన్నివేశాలతో ‘క’ సినిమా కాస్త స్లోగానే మొదలువుతుంది. హీరోని ఒక మాస్క్ వేసుకున్న వ్యక్తి కిడ్నాప్ చేసి..చీకటి గదిలో బంధించడంతో సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. ఆ గదిలో ముసుగు వ్యక్తి ఓ మెషీన్ సాయంతో హీరోని జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లి తన ఒక్కో ప్రశ్నకు సమాధానం చెప్పించే తీరు.. ఈ క్రమంలో హీరో కథను పరిచయం చేసిన విధానం ఆకట్టుకుంటాయి. వాసు.. కృష్ణగిరికి వచ్చాకే అసలు కథ ఆరంభమవుతుంది. హీరో అమ్మాయిల మిస్సింగ్ మిస్టరీని కనిపెట్టే ప్రయత్నాలు, ఈ క్రమంలో కొత్తగా క్రిష్ణగిరిలోకి వచ్చే పాత్రలు థ్రిల్‌ని పంచుతాయి. ఇక క్లైమాక్స్ సన్నివేశం అయితే ఆడియన్స్ ఆశ్చర్యపరుస్తుంది. ఊహించని విధంగా ఉంటుంది. ఓ రకంగా కథకు ఇదే బలం. లేకపోతే ఓ సాదాసీధా మిస్టరీ డ్రామాగా ఈ చిత్రం ఉండిపోయేది. కామెడీ సీన్స్ ఫోర్స్‌డ్‌గా అనిపిస్తాయి. వాసు-సత్యల లవ్‌స్టోరీ కూడా రోటీన్‌గా ఉంటుంది.
నటీనటుల పెర్ఫార్మెన్స్: అభినయ వాసుదేవ్‌గా కిరణ్ తెరపై సహజమైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు కిరణ్ అబ్బవరం. యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు ఎమోషన్ సన్నివేశాల్లోనూ తనదైన నటనతో కట్టిపడేశారు. ఫిట్‌నెస్ విషయంలో మరింత జాగ్రత్త పడాల్సింది. సినిమాలో ఆయన పాత్రలోని మరో కోణం మాత్రం ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుంది. నయన సారిక క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంది. ఆమెకు.. కిరణ్‌కు మధ్య ఉన్న లవ్‌ట్రాక్ పర్వాలేదనిపించింది. తన్వి రామ్‌ది కథలో ప్రాధాన్యమున్న పాత్రే. అచ్యుత్ కుమార్, శరణ్య ప్రదీప్, అన్నపూర్ణమ్మ, అజయ్, బిందు చంద్రమౌళి తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి.
ఇది పూర్తిగా దర్శకులు సుజీత్- సందీప్‌ల (KA movie director) సినిమా. పూర్తిగా కాన్సెప్ట్, స్క్రీన్‌ప్లే బేస్డ్‌గా సాగింది. ప్రథమార్ధం.. ద్వితీయార్ధంలో కొన్ని లోటుపాట్లున్నా పతాక సన్నివేశాల్లో ఇచ్చిన ట్విస్ట్ దెబ్బకు అవన్నీ తెరమరుగైపోయాయి. క పదానికి వెనకున్న అర్థం బాగుంది. 70ల కాలానికి తగ్గట్లుగా ఆర్ట్ వర్క్ బాగా కుదిరింది. అది కథకు అదనపు బలాన్ని అందించింది. ప్రేక్షకులకు ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. సామ్ సిఎస్ సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణ. జాతర పాట మాస్‌ను ఊపేస్తుంది. యాక్షన్ సీక్వెన్స్‌లో సామ్ నేపథ్య సంగీతం హీరోయిజాన్ని మరింత ఎలివేట్ చేసింది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.