April 3, 2024
అలనాటి నటి సావిత్రి సినీ ప్రస్థానాన్ని ఆధారంగా చేసుకుని రచయిత సంజయ్ కిషోర్ సావిత్రి క్లాసిక్స్ అనే పుస్తకాన్ని రచించారు. మెగాస్టార్ చిరంజీవి దంపతుల చేతిలో మీదుగా ఆవిష్కరింప చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి దంపతులతో పాటు బ్రహ్మానందం, మురళి మోహన్, జయసుధ, తనికెళ్ల భరణి, మహానటి సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి, కొడుకు సతీష్ కూడా పాల్గొన్నారు.
మహానటితో వాళ్లకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే చిరంజీవి కూడా మహానటితో అనుబంధాన్ని గురించి మాట్లాడారు. తన తండ్రికి సావిత్రి అంటే ఎంతో అభిమానం, ఆయనతో కలిసి మహానటి సినిమాలో చూస్తూ ఉండేవాడిని. అలాగే నా మొదటి సినిమా పునాది రాళ్లు ఆవిడతో కలిసి చేయడం నా అదృష్టం ఆవిడని నేరుగా తొలిసారి చూడటం అదే మొదటిసారి.
రాజమండ్రిలోని పంచవటి హోటల్ లో ఉన్న సావిత్రి గారిని పరిచయం చేసేందుకు నన్ను తీసుకువెళ్లారు. ఆమెను చూడగానే నాకు నోట మాట రాలేదు. నీ పేరేంటి బాబు అని అడిగారు సావిత్రి గారు చిరంజీవి అన్నాను శుభం బాగుంది అన్నారు.షూటింగ్ విరామ సమయంలో డాన్స్ చేయమని, నేను డాన్స్ చేస్తుంటే ఆమె చప్పట్లు కొడుతూ ఉంటే గర్వంగా అనిపించేది. ప్రేమ తరంగాలు సినిమాలో ఆమెకి కొడుకుగా నటించాను. భవిష్యత్తులో మంచి నటుడు అవుతావు అని ఆమె నాతో చెప్పినపుడు నాకు వెయ్యి ఏనుగుల బలం అనిపించింది.
ఆమెతో నేను రెండు సినిమాలు చేశాను. నటనపరంగా ఆమె నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. కేవలం కళ్ళతోనే నటించగల, హావభావాలు పలికించగల అలాంటి గొప్ప నటి ప్రపంచంలో మరొకరు లేరు.ఆమె ఆశీస్సులు ఈరోజు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి అందుకే రోజూ నిద్ర లేవగానే ఆమె ఫోటోనే చూస్తాను. అలాంటి నటి మీద రాసిన పుస్తకం నా చేతుల మీదుగా ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉంది అన్నారు.
Read More: వార్ 2 మూవీ నుంచి బిగ్ అప్డేట్.. త్వరలోనే వార్ టు షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్!