పది రోజుల్లో ఏపీ ప్రభుత్వం నుండి సినీ పరిశ్రమకు శుభవార్త అందుతుంది –  మెగాస్టార్ చిరంజీవి

January 13, 2022

పది రోజుల్లో ఏపీ ప్రభుత్వం నుండి సినీ పరిశ్రమకు శుభవార్త అందుతుంది –  మెగాస్టార్ చిరంజీవి
ఇండస్ట్రీ సమస్యలపై చర్చించేందుకు సీఎం జగన్‌తో చిరంజీవి గురువారం భేటీ అయ్యారు. గంటకు పైగా ఈ సమావేశం జరిగింది. భేటీ అనంతరం గన్నవరం విమానాశ్రయం వద్ద చిరంజీవి మీడియాతో మాట్లాడారు. ‘‘నేను ఒక పక్షానే ఉండను. అటు ఇటు అన్ని రకాలుగానూ అందరినీ సమదృష్టితో చూస్తాను. అందరికీ ఆమోదయోగ్యమైన విధివిధానాలను తీసుకుంటాను. కాబట్టి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు.’ అని సీఎం జగన్ భరోసా ఇచ్చారు. ఆ భరోసాతో నాకు ఎనలేని ధైర్యం వచ్చింది.’’ అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. జగన్‌ ఆహ్వానం మేరకే ఆయనతో భేటీ అయ్యానని, ఆ భేటీ సంతృఫ్తికరంగా జరిగిందని తెలిపారు. జగన్ తనకు సోదర సమానుడని, సీఎం దంపతుల ఆతిథ్యం ఎంతో బాగుందని ప్రశంసించారు. ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని విభాగాల సమస్యలను కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. సినిమా టికెట్ ధరలపై ప్రభుత్వం వేసిన కమిటీతోనూ చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని జగన్ చెప్పినట్లు చిరంజీవి తెలియజేశారు. జీవో 35 గురించి పునరాలోచిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు చిరంజీవి చెప్పారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు పరిశ్రమ వ్యక్తులు ఎవరూ మీడియాతో మాట్లాడొద్దని సూచించారు. తాను ఇండస్ట్రీ పెద్దగా రాలేదని, ఇండస్ట్రీ బిడ్డగా వచ్చానని చెప్పారు. ఇండస్ట్రీలోని అందరితో చర్చించి, మళ్లీ ఇంకోసారి సీఎం జగన్‌తో భేటీ అవుతానని చెప్పారు. ఏపీ ప్రభుత్వం నుంచి పది రోజుల్లో సినీ పరిశ్రమకు శుభవార్త వస్తుందని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు