Neha Shetty: తెలుగు సినీ జ‌ర్న‌లిస్టుకు కొత్త హీరోయిన్ చుర‌క‌లు

February 3, 2022

Neha Shetty: తెలుగు సినీ జ‌ర్న‌లిస్టుకు కొత్త హీరోయిన్ చుర‌క‌లు

Neha Shetty: మొన్నా మ‌ధ్య హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఆర్ఆర్ఆర్ ప్రెస్‌మీట్ లో చిత్ర యూనిట్ కు తెలుగు మీడియా నుండి వింత అనుభ‌వం ఎదురైంది. ముంబై, చెన్నై,బెంగుళూరు లో ప్రెస్‌మీట్‌లు ముగించుకుని తెలుగు మీడియా కోసం ఒక పూట స‌మ‌యాన్ని కేటాయించింది చిత్ర యూనిట్‌. అందులో మీ ప్ర‌శ్న‌ల‌న్నింటికీ స‌మాధానం చెప్పే వెళ్లాల‌ని డిసైడ్ అయ్యే వ‌చ్చాం ఇది మాకు తెలుగు జ‌ర్న‌లిజం మీద ఉన్న గౌరవం అని స్వ‌యంగా రాజ‌మౌళి చెప్పారు. అయితే స‌మావేశం మొద‌లైన కాసేప‌టికే ఒక‌రి మొహం ఒక‌రు చూసుకోవ‌డం మొద‌లు పెట్టింది చిత్ర యూనిట్‌. దానికి కార‌ణం మీడియా, వారి ప్ర‌శ్న‌లు..ఒకానొక సంద‌ర్భంలో ఇది మ‌న సినిమా కాబ‌ట్టి మ‌న ప్ర‌శ్న‌లు నార్త్ వారు కాపీ కొట్టాలి కాని వారి ప్ర‌శ్న‌లు మ‌నం కాపీ కొట్ట‌కూడ‌దు అని రాజ‌మౌళి స్వ‌యంగా చెప్పాడంటే అర్ధం చేసుకోవ‌చ్చు అక్క‌డ ఏం జ‌రిగుంటుందో..అయితే ఈ రోజు కూడా అలాంటి సంఘ‌ట‌నే మ‌రో చిత్ర యూనిట్‌కు ఎదురైంది. తెలుగు సినీ జ‌ర్న‌లిజాన్ని ఈడ్చి లెంప‌కాయ కొట్టింది ఓ కొత్త హీరోయిన్‌.

ఇప్ప‌టికే క‌రోనా పుణ్య‌మా అని ఒక‌సారి..దిల్‌రాజు పుణ్యమా అని మ‌రోసారి రిలీజ్ డేట్ వాయిదా వేసుకుని ఈ నెల 11న ప్రేక్ష‌కుల‌ముందుకు వ‌స్తున్న చిత్రం డీజే టిల్లు. హీరో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ ఇండ‌స్ట్రీలో కొద్దిగా తెలిసిన పేరు..నిర్మాత సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్ జ‌ర్నీ చిత్రంతో అంద‌రికీ సుప‌రిచిత‌మే.. ఇక కన్నడలో ఓ సినిమా చేసిన నేహాశెట్టి(Neha Shetty)కి ఇది తెలుగులో రెండో సినిమా..

బుధ‌వారం హైద‌రాబాద్‌లోని ఏఎంబీ మాల్‌లో ట్రైల‌ర్‌ రిలీజ్ ఈవెంట్‌కి మీడియాను ఆహ్వానించింది చిత్ర యూనిట్‌. ట్రైల‌ర్‌ ప్ర‌ద‌ర్శించిన త‌ర్వాత ప్రశ్నలు అడిగితే జవాబులు చెప్పడానికి నటీనటులు, ఇతర టెక్నికల్ సిబ్బంది రెడీగా ఉన్నారు.

ట్రైల‌ర్‌లో ఒక సీన్‌లో కారులో కూర్చుని హీరో హీరోయిన్‌ను నీకు ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నయ్ అనడగుతాడు…ఆమె 16 అని చెబుతుంది.

అయితే అడ‌గ‌డానికి ప్ర‌శ్న‌లే లేవ‌న్న‌ట్టు ట్రైల‌ర్‌లో హీరోయిన్ చేత 16 పుట్టుమచ్చలు ఉన్నాయని చెప్పించారు కదా, రియల్‌గా తెలుసుకున్నారా హీరోయిన్‌కు ఎన్ని పుట్టుమచ్చలున్నాయో’’ అని హీరోకు ప్రశ్న వేశాడు ఓ జ‌ర్న‌లిస్ట్‌. హీరోయిన్‌కు తెలుగు రాదు కాబ‌ట్టి ఈ ప్రశ్న ఏమిటో అర్థం కాలేదు. హీరో మాత్రం కాస్త ఇబ్బందిప‌డుతూ ‘‘ఈ ప్రశ్నను అవాయిడ్ చేద్దాం సార్’’ అని వినమ్రంగా వేడుకున్నాడు. ఇది ఇక్కడే ముగిసిపోలేదు. సదరు జర్నలిస్టు అడిగిన ప్రశ్న కాస్తా ఎప్ప‌టిలాగే సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఆ ప్రశ్న గురించి నేహాశెట్టికి ఎవరో కాస్త వివరంగా చెప్పినట్టున్నారు దాంతో ఓ ట్వీట్ పెట్టింది.

 

‘ట్రైల‌ర్‌ ఈవెంట్‌లో ఇలాంటి ప్రశ్నలు అడగడం చాాలా దురదృష్టకరం.. దీన్ని బట్టి అతను తన చుట్టూ ఉండే మహిళలు, ఇంట్లో వారికి ఎంత గౌరవ‌మిస్తున్నాడో అర్థమవుతోందంటూ డైరెక్ట్‌గానే చురకలు అంటించింది. ఈ ట్వీట్‌తో ఆమెకు నెటిజ‌న్ల నుండి సానుభూతి, భారీగా మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. అయితే హీరోయిన్‌కు కలిగిన అసౌకర్యానికి నిర్మాత నాగవంశీ కూడా `క్షమించండి.. ఇది చాలా దురదృష్టకరమే అని రిప్లే ఇచ్చాడు.

అంత‌టితో ఆగ‌కుండా ఆ జ‌ర్న‌లిస్ట్ అదొక రొమాంటిక్ సినిమా అందుకే రొమాంటిక్ క్వ‌చ‌న్ అడిగాను. నా మ‌న‌సులో ఎలాంటి దురుద్దేశ్యం లేదు..అలాగే నా మాటల్లో ఎలాంటి డ‌బుల్ మీనింగ్ కూడా లేదు ద‌య‌చేసి త‌ప్పుగా తీసుకోకండి అని క‌వ‌ర్ చేసుకునే ప్ర‌య‌త్నం చేశాడు. కాని అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందే అంటూ కొంద‌రు ఇండ‌స్ట్రీ పెద్ద‌లు కూడా నేహాశెట్టికి స‌పోర్ట్‌గా నిలుస్తుండ‌డంతో ఇక చేసేదేం లేక మిమ్మ‌ల్ని అగౌర‌ప‌ర‌చాల‌నేది నా ఉద్దేశ్యం కాదు..నా వ‌ల్ల జ‌రిగిన అసౌక‌ర్యానికి చింతిస్తున్నాను న‌న్ను క్ష‌మించండి అంటూ మ‌రో ట్వీట్ పెట్టాల్సి వ‌చ్చింది. మ‌రి చూడాలి ఈ వివాదం ఇంత‌టితో ముగిసిపోతుందో లేదా మ‌ళ్లీ రాజుకుంటుందో..

Read More: Ajith Valimai: ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో అజిత్ పోటీ త‌ప్ప‌దా?

ట్రెండింగ్ వార్తలు