September 11, 2021
విభిన్న కథలు చేస్తోన్న హీరో నితిన్ ఇప్పుడు మరో సరికొత్త కాన్సెప్ట్‌తో రాబోతోన్నారు. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నితిన్‌ను ఫుల్ యాక్షన్ మోడ్‌లో ప్రేక్షకులు చూడబోతోన్నారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై ఈ మూవీని సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ నివ్వగా, నిర్మాత రామ్ మోహన్ కెమెరా స్విచాన్ చేశారు. మొదటి సన్నివేశానికి అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు వెంకీ కుడుముల స్క్రిప్టును మేకర్స్‌కి అందజేశారు. ఈ మూవీ టైటిల్ అండ్ మోషన్ పోస్టర్‌ను కూడా విడుదల చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కొంత మంది రౌడీలు హీరో నితిన్‌పై అటాక్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇక మంటల్లో యాక్షన్ సీక్వెన్స్, నితిన్ లుక్స్ అన్నీ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘మాచర్ల నియోజకవర్గం’ అంటూ వెరైటీ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. మోషన్ పోస్టర్, టైటిల్‌ను బట్టి చూస్తే ఈ సినిమా పక్కా మాస్ మసాల యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఇక మహతి స్వర సాగర్ అందించిన నేపథ్య సంగీతం మోషన్ పోస్టర్‌కు హైలెట్ అయింది.
ఇది వరకు ఎన్నడూ కూడా పోషించని పాత్రలో నితిన్‌ను పవర్ ఫుల్‌గా చూపించేందుకు దర్శకుడు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి అద్భుతమైన స్క్రిప్ట్‌ను రెడీ చేశారు. అదే విషయాన్ని మోషన్ పోస్టర్ ద్వారా తెలియజేశారు. మాచర్ల నియోజకవర్గం అనే టైటిల్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
ఈ చిత్రంలో నితిన్ సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో ఎంతో మంది ప్రముఖ నటీనటులున్నారు. అద్భుతమైన సాంకేతిక బృందం ఈ సినిమా కోసం పని చేస్తోంది. భీష్మ, మాస్ట్రో వంటి చిత్రాల తరువాత ముచ్చటగా మూడోసారి మహతి స్వరసాగర్‌తో కలిసి నితిన్ పని చేస్తున్నారు. ప్రసాద్ మూరెళ్ల కెమెరామెన్‌గా, మామిడాల తిరుపతి మాటల రచయితగా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్‌గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అక్టోబర్ నెలలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. మిగతా వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.