తిరిగి ప్రారంభంకానున్న షూటింగ్‌..ఆందోళ‌న‌లో ప‌వ‌న్ ఫ్యాన్స్‌

June 1, 2024

తిరిగి ప్రారంభంకానున్న షూటింగ్‌..ఆందోళ‌న‌లో ప‌వ‌న్ ఫ్యాన్స్‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాబోయే సినిమాల్లో ఏ మాత్రం బ‌జ్ లేని చిత్రం `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`. మొదట్లో ఈ సినిమాకి కావాల్సిన బ‌జ్ వ‌చ్చింది..ఇంకా షూటింగ్ పూర్తి కాక‌పోవ‌డం.. ఈ సినిమా త‌ర్వాత ప్రారంభ‌మైన భీమ్లా నాయ‌క్‌, బ్రో చిత్రాలు రిలీజ‌వ‌డం ఇంత‌లో ఓజీ, భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ వంటి క్రేజీ సినిమాలు అనౌన్స్ చేయ‌డంతో హ‌రి హ‌ర వీర మ‌ల్లు చిత్రానికి బ‌జ్ త‌గ్గుతూ వ‌చ్చింది.

ఈ మూవీ ప్రారంభ‌మై ఏళ్లు గ‌డిచినా ఆర్ధిక స‌మ‌స్య‌ల వ‌ల్ల కొన్ని సార్లు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాల‌పై దృష్టి సారించ‌డంతో డేట్స్ లేక‌ మ‌రి కొన్ని సార్లు చిత్రీక‌ర‌ణ జాప్యం అవుతూ వ‌చ్చింది. ఇక ఈ సినిమా కోసం త‌న స‌మ‌యం వృదా చేసుకోవ‌డం ఇష్టం లేక ద‌ర్శ‌కుడు క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుండి హుందాగా త‌ప్పుకున్నారు. మిగ‌తా షూటింగ్‌కి సంభందించిన పూర్తి స్క్రిప్ట్ రెడీగా ఉండ‌డంతో నిర్మాత ఎ.ఎం ర‌త్నం త‌న పెద్ద‌ కుమారుడు జ్యోతికృష్ణ‌తో ఈ సినిమాని పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు.

ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది..కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమాని `ఆక్సీజ‌న్‌`, `రూల్స్ రంజ‌న్` వంటి రెండు ప్లాఫు చిత్రాల‌ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు పూర్తి చేస్తుండ‌డంతో సాధార‌ణ ప్రేక్ష‌కుల‌తో పాటు ప‌వ‌న్ అభిమానుల్లో కూడా ఈ సినిమా మీద సందేహాలు ఏర్ప‌డ్డాయి. ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌కి కొంత విరామం ఇచ్చి ప‌వ‌న్ త‌న సినిమాల్ని పూర్తి చేసేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. దాంతో ఆ బ్యాలెన్స్ షూట్ పూర్తి చేసే ప‌నిలో ఉంది చిత్ర బృందం. దానికి సంబందించి నిర్మాత ఏం రత్నం, దర్శకుడు జ్యోతి కృష్ణతో పాటు మనోజ్ పరమహంస చర్చిస్తున్న ఒక ఫోటోని విడుదల చేసింది.

అయితే ఈ సినిమాకి మొద‌ట జ్ఞాన శేఖ‌ర్ సినిమాటోగ్రాఫ‌ర్ కానీ ఇప్పుడు ఆ భాద్య‌త‌ల్ని మనోజ్ పరమహంస నిర్వ‌హిస్తార‌ని తెలుస్తోంది. షూటింగ్ త్వరితగతిన పూర్తిచేసేందుకు కొత్త లొకేషన్ల కోసం రెక్కీ కూడా పూర్తి చేస్తోంది. మరొకపక్క ఇప్పటివరకు షూట్ చేసిన సినిమాకి సంబంధించి వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి హరి హర వీర మల్లు పార్ట్-1 ‘స్వార్డ్ వర్సెస్ స్పిరిట్‌’ని విడుదల చేసేందుకు టీమ్ సిద్ధమవుతోంద‌ని తెలుస్తోంది.

Read MorePawan kalyan: ‘హరిహర వీరమల్లు’ అప్‌డేట్‌ ఇచ్చిన నిర్మాత!

ట్రెండింగ్ వార్తలు