May 3, 2024
కలర్‌ఫోటో నుండి కొత్త కథలకి కేరాఫ్‌గా నిలుస్తున్నాడు సుహాస్. ఇక పూర్తిస్థాయి హీరోగా నటించిన ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్’ తర్వాత ఆయన ‘ప్రసన్న వదనం’ చిత్రంతో మరోమారు ప్రేక్షకుల ముందుకొచ్చారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్ గా పని చేసిన అర్జున్ వై కె దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటించారు. ప్రచార చిత్రాలతో కొంత ఆసక్తిని నెలకొల్పిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
సూర్య (సుహాస్) ఓ ప్రమాదంలో తల్లిదండ్రుల్ని కోల్పోతాడు. దాంతో పాటు ప్రోసోపాగ్నోసియా అనే విచిత్రమైన సమస్య వెంటాడుతుంది. తను మనుషుల ముఖాల్ని, గోంతుని గుర్తుపట్టలేడు. కేవలం కొన్ని గుర్తులతో ఆ మనిషి ఎవరన్నది గమనించ గలుగుతాడు. తన స్నేహితుడు విఘ్నేష్ (వైవా హర్ష)కి తప్ప తన సమస్య ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటూ కాలం గడుపుతుంటాడు. ఆద్య (పాయల్)తో ప్రేమలో కూడా పడతాడు. ఇంతలోనే తన కళ్ల ముందు ఓ హత్య జరుగుతుంది. తనకున్న సమస్యతో ఆ హత్య ఎవరు చేశారో తెలుసుకోలేడు. కానీ, పోలీసులకి ఈ విషయం తెలియాలని ప్రయత్నిస్తాడు. ఆ వెంటనే అతనిపై దాడి జరుగుతుంది. అయినా వెనకడుగు వేయని సూర్య.. ఏసీపీ వైదేహి (రాశిసింగ్) దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెబుతాడు. అనూహ్యంగా ఆ హత్య కేసులో సూర్యనే ఇరుక్కోవల్సి వస్తుంది. ఇంతకీ ఆ హత్య ఎవరు చేశారు?హత్యకి గురైన అమ్మాయి ఎవరు?ఆ కేసులో సూర్యని ఇరికించింది ఎవరు?అతని ప్రయాణంలో ఏసీపీ వైదేహీ (రాశీసింగ్) పాత్రేమిటి? అనే విషయాలు తెరపైనే చూడాలి.
ఏదో ఒక డిజార్డర్‌తో హీరో పాత్రకి పరిమితులు విధించి… జీవన్మరణ సమస్య తరహాలో అతని చుట్టూ పలు సవాళ్లని సృష్టించి కథని నడిపించడం చాలా సినిమాల్లో చూసిందే. అయితే ఫేస్ బ్లైండ్‌నెస్ అనేది తెలుగు సినిమా వరకూ కొత్త పాయింట్. ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయలేదు కూడా. ఇలాంటి కాన్సెప్ట్ ని ఎంచుకోవడం అభినందించదగిన విషయమే..తనకెదురైన సవాళ్లని అధిగమిస్తూ, తాను అనుకున్న పనిని పూర్తి చేసే క్రమం ఎంత ఆసక్తికరంగా, ఎంత థ్రిల్లింగ్‌గా సాగిందన్నదే సినిమా ఫలితాల్ని ప్రభావితం చేస్తుంది.
మర్డర్ సీన్ నుంచి కథలో ఆసక్తి మొదలవుతుంది. అక్కడ్నుంచి కేవలం మర్డర్ అనే పాయింట్ పై ఫోకస్ చేస్తే బాగుండేది. మధ్యలో లవ్ ట్రాక్ కూడా నడిచిపోతూ ఉంటుంది. ఇలాంటి కథల్ని చాలా స్ట్రయిట్ గా చెప్పాలి. మధ్యలో ట్రాకుల జోలికి వెళ్లకూడదు. డిజార్డర్‌తో కూడిన ఈ తరహా కథలు మనకు కొత్త కాకపోయినా, సుహాస్‌ని ఇందులో చూడటం కొత్తగా అనిపిస్తుంది. ‘కలర్’ కాన్సెప్ట్ ని వాడుకొని, క్లైమాక్స్ డిజైన్ చేసిన విధానం దగ్గర దర్శకుడికి మార్కులు పడతాయి. మొదట్లో ఓ పాప చెప్పిన కథని లింక్ చేస్తూ, క్లైమాక్స్‌లో హీరో రియాక్ట్ అవ్వడం బాగుంది. షార్ప్ గా చెప్పాల్సిన విషయాల్ని సాగదీయడం వల్ల, కొన్ని సీన్లు బాగున్నా, వాటి ఇంపాక్ట్ బలంగా కనిపించలేదు. హత్య ఎవరు చేశారనేది ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌తో ప్రేక్షకుడికి తెలిసిపోయినా, తనకున్న వ్యాధిని అధిగమించి, అసలు నిజాన్ని కథానాయకుడు ఎలా బయట పెడతాడనేది ఆసక్తికరంగా మారుతుంది. సెకండాఫ్ కీలక సమయాల్లో చోటు చేసుకునే మలుపులు, పతాక సన్నివేశాలు సినిమాని మరింత ఆసక్తికరంగా మార్చేస్తాయి. అక్కడక్కగా సన్నివేశాల్లో వేగం తగ్గినట్టు అనిపించినా, ఓ కొత్త రకమైన థ్రిల్లర్‌ని చూసిన అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుంది.
సుహాస్ తన ఇమేజ్‌కి, స్థాయికి తగిన కథల్ని ఎంచుకొంటున్నాడు. హీరోయిజం చూపించాలని తాపత్రయపడడం లేదు. కథకి ఏం కావాలో అది చేస్తున్నాడు. ఇందులోనూ తనదైన సహజ నటన ప్రదర్శించాడు. సూర్య పాత్రలో సుహాస్ నటన ఆకట్టుకుంటుంది. అతడి పాత్ర, కథా నేపథ్యంలో సూర్యగా చూడటం ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తుంది. పాత్ర అవసరమైన చోట హాస్యాన్నీ, భావోద్వేగాల్నీ పంచింది. సుహాస్‌కీ, పాయల్‌కీ మధ్య సన్నివేశాలు సరదా సరదాగా సాగుతాయి. రాశిసింగ్ పోలీస్ అధికారి వైదేహిగా అలరించింది. పాత్రకి తగ్గ ఎంపిక ఆమె. నితిన్ ప్రసన్న పాత్ర సినిమాకి కీలకం. వైవాహర్ష స్నేహితుడిగా అలవాటైన పాత్రలో సందడి చేశాడు. నందు, సాయి శ్వేత పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతికంగా సినిమాకి ఏ విభాగం లోటు చేయలేదు. థ్రిల్లర్ చిత్రాలకి భిన్నంగా కలర్‌ఫుల్‌గా సినిమా సాగుతుంది. చంద్రశేఖరన్ కెమెరా పనితనం మెప్పిస్తుంది. విజయ్ బుల్గానిన్ నేపథ్య సంగీతంతో ప్రభావం చూపించారు. ముఖ్యంగా ద్వితీయార్ధంలో అక్కడక్కడా కథాగమనంలో వేగం తగ్గినట్టు అనిపించినా, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ బాగుంది. దర్శకుడు అర్జున్‌కి ఇది తొలి చిత్రమే అయినా తన కథని ఎంతో స్పష్టంగా తెరపైకి తీసుకొచ్చారు. కొన్ని సీన్లు బాగా డీల్ చేశాడు. అయితే ఓ విజయవంతమైన చిత్రాన్ని అందించడానికి అది సరిపోదు. మంచి కాన్సెప్ట్ పట్టుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు, దాన్ని బిగుతైన స్క్రీన్ ప్లేతో మెస్మరైజ్ చేసే విషయంలో తడబడ్డాడు. ఇంట్రవెల్ బ్యాంగ్, క్లైమాక్స్ బాగున్నాయి. అయితే మధ్యలో కూడా కొన్ని మెరుపులు తోడవ్వాల్సింది.
బాటమ్‌లైన్: పూర్తిగా ప్రసన్నం కాలేదు..