September 8, 2021
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్‌రాజు, శిరీశ్ నిర్మిస్తోన్న భారీ పాన్ ఇండియా చిత్రం బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి, బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టగా బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. మెగాస్టార్ చిరంజీవి స్క్రిప్ట్‌ను డైరెక్టర్ శంకర్‌కు అందించారు.
రామ్‌చరణ్ హీరోగా నటిస్తోన్న 15వ చిత్రమిది. అలాగే శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీశ్ ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తున్న 50వ చిత్రం. తెలుగు, తమిళ,, హిందీ భాషల్లో పాన్ ఇండియా రేంజ్‌లో మూవీ రూపొందనుంది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో శ్రీకాంత్, జయరామ్, నవీన్ చంద్ర, సునీల్, అంజలి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ చిత్రానికి తిరుణ్ణావుక్కరసు సినిమాటోగ్రాఫర్. సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ తెలియజేశారు.