May 31, 2024
టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల హనుమాన్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడంతోపాటు పాన్ ఇండియా లెవెల్లో తన పేరు మారుమోగేలా చేసుకున్నారు ప్రశాంత్ వర్మ. తేజా సజ్జా హీరోగా నటించిన ఈ మూవీ అన్ని భాషల్లో విడుదల అయ్యి మంచి సక్సెస్ ను సాధించింది. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ హనుమాన్ 2 ప్రాజెక్ట్ తెరకెక్కించబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఈ ప్రాజెక్టు కంటే ముందు ప్రశాంత్ వర్మ రూపొందించే మరో ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తో హనుమాన్ డైరెక్టర్ ఒక సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే వీరిద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయట. వీరిద్దరి కాంబోలో వచ్చే ప్రాజెక్టుకు రాక్షస్ అనే టైటిల్ కూడా ఫిక్స్ అయ్యారని సమాచారం. కానీ ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అలాగే ఫిల్మ్ వర్గాల్లో వార్తలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ రావడమే ఇందుకు కారణమని టాక్. తాజాగా ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు మూవీ మేకర్స్. కాగా ఇటీవల ఓ ప్రకటనలో రణవీర్ సింగ్ మాట్లాడుతూ.. ప్రశాంత్ వర్మ ప్రత్యేకమైన ప్రతిభ ఉన్న వ్యక్తి.
మేమిద్దరం కలిసి సినిమా చేయాలని అనుకున్నాము. భవిష్యత్తులో మేమిద్దరం కలిసి సినిమా చేస్తామనే నమ్మకం ఉంది అని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పట్లో రాక్షస్ సినిమా రావడం లేదని చెప్పకనే చెప్పేశారు రణవీర్. ఇక ఇదే విషయం పై ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. రణవీర్ సింగ్ ఎనర్జీ, టాలెంట్ దొరకడం చాలా అరుదు. భవిష్యత్తులో ఎప్పుడో ఒకసారి మేమిద్దరం కలిసి పనిచేస్తాము. క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా మేమిద్దరం వేరు అవుతున్నాము. కానీ మా ఇద్దరి నిర్ణయాలు సరైనవే. అందుకే ఇప్పుడు ఈ ప్రాజెక్టును రూపొందించడం సరైనది కాదు. రాబోయే రోజుల్లో కచ్చితంగా ఇద్దరం సహకరిస్తాము అంటూ చెప్పుకొచ్చారు. అయితే ప్రశాంత్ వర్మ రన్వీర్ సింగ్ మాటలను బట్టి చూస్తే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్స్ నిజమే అని చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది.
Read More: బాలయ్య బాబు ప్రవర్తన వీడియోపై స్పందించిన అంజలి.. వీడియో వైరల్?