పిల్లలు పుట్టాక ప్రపంచం మారుతుంది – శ్రియ స‌ర‌న్‌

December 7, 2021

పిల్లలు పుట్టాక ప్రపంచం మారుతుంది – శ్రియ స‌ర‌న్‌

తెలుగులో దాదాపు అంద‌రి స్టార్ హీరోల‌తో న‌టించింది శ్రియ స‌ర‌న్‌. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు కొంత గ్యాప్ ఇచ్చింది. చాలా రోజుల తరువాత గ‌మ‌ణం సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా డిసెంబర్ 10న విడుద‌ల‌కానుంది. ఈ క్రమంలో సినిమా గురించి, త‌న వ్య‌క్తిగ‌త జీవితం గురించి శ్రియా సరన్ కొన్ని విశేషాలను చెప్పుకొచ్చింది.

ఇరవై ఏళ్లు ఇలా మీ ముందు ఉన్నాను. మొదట ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇలా నేను మీ పక్కింటి అమ్మాయిలా మారిపోయాను.  ఇష్టం నా మొదటి సినిమా. ఆ రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. నాటి నుంచి నేటి వరకు నాకు ఎంతో ప్రేమ దొరికింది. ప్రేక్షకుల ప్రేమ వల్లే ఇంత దూరం వచ్చాను. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది. నేను చేసిన కొన్ని సినిమాలు వర్కవుట్ అయ్యాయి. ఇంకొన్ని వర్కవుట్ అవ్వలేదు. ఇన్నాళ్లు సినిమా ఇండస్ట్రీలో ఉన్నందుక ఎంతో గర్వంగా ఉంది. ఇంకా ఇరవై ఏళ్లు నటిస్తూ ఇలానే ఉండాలని ఉంది.

గమనం సినిమాలో మూడు కథలు ఒకే టైంలో సాగుతాయి. ప్రతీ స్టోరీ ఎంతో స్ఫూర్తివంతంగా ఉంటాయి. ప్రకృతి విపత్తులో చిక్కుకుంటారు. వారు ఎలా బయటపడ్డారు అనేదే కథ.

ఇందులో నేను దివ్యాంగురాలి పాత్రలో కనిపిస్తాను. వినిపించదు. కానీ మాట్లాడతాను. ఈ కారెక్టర్ కోసం కొన్ని క్లాసులకు కూడా వెళ్లాను. నిస్సహాయతతో ఉన్న మహిళ సాగించే ప్రయాణమే నా పాత్ర. ఊహకందని ఓ అతీంద్రియ శక్తి ఉందని నమ్మే పాత్రలో కనిపిస్తాను.

ఇది వరకు నేను మహిళ దర్శకురాళ్లతో పని చేశాను. మిడ్ నైట్ స్టోరీస్ అని ఓ సినిమా చేశాను. కన్నడలో కూడా ఓ చిత్రం చేశాను. తెలుగులో మాత్రం ఇలా మహిళా దర్శకురాలితో చేయడం మొదటిసారి. మహిళా దర్శకురాళ్లతో పని చేయడం ఎంతో కంఫర్ట్‌గా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలున్నా కూడా ఎంతో ఓపెన్‌గా చెప్పొచ్చు. ఇంతకు ముందు మహిళలు కెమెరా వెనకాల ఉండేవారు. కానీ ఇప్పుడు కెమెరా ముందు కూడా కనిపిస్తున్నారు.

మనిషిలో జరిగే అంతర్గత సంఘర్షణ, ప్రయాణం గురించి చెప్పేదే గమనం. మనల్ని మనం తెలుసుకునేలా చేసే కథ గమనం. నిస్సహాయతతో ఉండే మనిషికి ఒక్కసారిగా బలం వస్తే వాటిని మనం అధిగమించేస్తాం. నా డెలివరీ సమయంలోనూ నాకు ఇలాంటి ఓ భయం ఉండేది. కానీ ఏం కాదు అన్న ధైర్యం నేను తెచ్చుకున్నాను. అంతా సాఫీగానే సాగింది. లైఫ్‌లో అందరికీ అలాంటి ఓ పరిస్థితి వస్తుంది. దాన్నుంచి ఎలా బయటకు వస్తామని చెప్పేదే గమనం.

ప్రెగ్నెన్సీ తరువాత చాలా మార్పులు వచ్చాయి. కానీ వర్కవుట్లు చేసి, కథక్ డ్యాన్స్ చేస్తూ ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టాను. పైగా మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి యోగాను నేర్పించారు. యోగా చేయడం వల్ల ఆరోగ్యం, ఫిట్ నెస్ అంతా బాగుంటుంది.

నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పుకోలేను. హిందీలో అయితే డబ్బింగ్ చెప్పుకోగలను. కానీ అంత డేర్ మాత్రం దర్శక నిర్మాతలు చేయరేమో (నవ్వులు).

పిల్లలు పుట్టాక ప్రపంచం మారుతుంది. మనకు బాధ్యతలు పెరుగుతాయి. మనిషిలో మార్పులు వస్తాయి. ఇప్పుడు మేం ఎక్కడికి వెళ్లినా మా పాపను తీసుకుని వెళ్తున్నాం.

ట్రెండింగ్ వార్తలు