June 14, 2024
తమిళ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతికిమైన తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన ఎంచుకునే వైవిద్యమైన పాత్రలే దానికి కారణం. తాజాగా విజయ్ సేతుపతి కెరీర్‌లో 50వ మైల్‌స్టోన్ మూవీగా రూపొందిన చిత్రం `మహారాజ`. ఈ మూవీలో బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, అభిరామి, మమతా మోహన్ దాస్ ముఖ్య పాత్రలు పోషించారు. నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ నేడు(జూన్ 14న) విడుదలైంది. మరి ఈ సినిమాతో విజయ్ సేతుపతి ఎలాంటి మ్యాజిక్ చేశారో ఇప్పుడు చూద్దాం.
కథ: మహారాజ(విజయ్ సేతుపతి)ఒక బార్బర్ షాప్ రన్ చేస్తూ జీవితం గడుపుతుంటాడు. చిన్నప్పుడే ఒక యాక్సిడెంట్లో తన భార్య చనిపోగా తన కూతురుకి మాత్రం ఒక చెత్త డబ్బా అడ్డురావడంతో ప్రాణాలు దక్కుతాయి. అప్పటినుంచి ఆ చెత్త డబ్బాకి లక్ష్మీ అని పేరు పెట్టి జాగ్రత్తగా చూసుకుంటుంటారు. తన కూతురు స్పోర్ట్స్ క్యాంప్ లో పాల్గొనటానికి వెళ్తుంది. ఒక రోజు చెవి దగ్గర గాయంతో పోలీస్ స్టేషన్ కి వచ్చి ఇంట్లో దొంగలు పడి తన “లక్ష్మి”ని ఎత్తుకుపోయారని కంప్లైంట్ ఇస్తాడు. దాన్ని వెతికి తెస్తే ఎంత డబ్బు అయినా ఇస్తాను అనడంతో ఆ పోలీసులు అలాంటిదే ఓ డూప్లికేట్ చెత్తబుట్ట కోసం ట్రై చేస్తుంటారు. మరో పక్క సెల్వం(అనురాగ్ కశ్యప్) తన ఫ్రెండ్ తో కలిసి దొంగతనాలు చేస్తూ ఉంటాడు. సెల్వంకు, మహారాజాకు సంబంధం ఏంటి? ఆ చెత్తబుట్ట దొరికిందా? పోలీసులు ఏం చేసారు? స్పోర్ట్స్ క్యాంప్ కి వెళ్లిన కూతురు తిరిగి వచ్చిందా అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ: ఫస్ట్ హాఫ్ అంతా మహారాజ గురించి, అతని చెత్తబుట్ట కథ గురించి చూపిస్తూ కొంచెం కామెడీని పండించడం వర్కౌట్ అయింది. మరో పక్క సెల్వం దొంగతనాలు చూపిస్తూ కథని వీళ్లిద్దరికీ లింక్ చేయబోతున్నాడు అనే అనుమానం వచ్చేలా చేస్తాడు దర్శకుడు. ఇంటర్వెల్ కి ఓ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చి నెక్స్ట్ ఏం జరుగుతుందా అని ఆసక్తి పెంచారు. ప్రధామార్ధం సటిల్ హ్యూమర్ తోనూ, విజయ్ సేతుపతి పాత్ర స్వభావంలోని ప్రత్యేకతలతోనూ నడిచిపోయింది. ద్వితీయార్ధంలో మాత్రం నవ్వులు తగ్గిపోయి సీరియస్ టోన్ పెరుగుతూ వచ్చింది. కథని ఊహించడానికి అవకాశం లేకుండా ఎక్కడికక్కడ డైవర్ట్ చేస్తూ నడిపాడు దర్శకుడు. ఈ చిత్రంలో ఉన్న మైనస్ ఏదైనా చెప్పుకోలంటే…ఇది అన్ని రకాల ప్రేక్షకులకి నచ్చదు. హింస, క్రైం నచ్చనివారు దూరంగా ఉంటే మంచిది. అలాగే పాటలు, రొమాన్స్ కావాలన్నా ఇందులో దొరకదు. రొటీన్ ఫార్ములా సినిమాలు కాకుండా వెరైటీ చిత్రాలు ఇష్టపడే వారికి మాత్రం ఈ చిత్రం నచ్చే అవకాశముంది.
నటీనటుల పర్ఫార్మెన్స్.. విజయ్ సేతుపతి నటన గురించి అందరికి తెలిసిందే. తన 50వ సినిమాకి ఇలాంటి మాములు మధ్యతరగతి తండ్రి కథ ఎంచుకోవడం విశేషం అయితే ఆ పాత్రలో జీవిచడం మరో ఎత్తు. విజయ్ సేతుపతి ఎప్పటిలాగే తప పాత్రలో వైవిద్యం చూపాడు. తమిళ యువ హీరోయిన్ దివ్యభారతి గెస్ట్ పాత్రలో కనిపిస్తుంది. సెల్వంగా అనురాగ్ కాశ్యప్ కౄరత్వంతో పాటూ ఒకానొక వ్యక్తిగతమైన ఎమోషనల్ వీక్నెస్ ని క్యారీ చేస్తూ చక్కగా నటించాడు.. మరోసారి తన విలనిజం చూపించాడు. సెల్వం భార్య పాత్రలో అభిరామి మెప్పిస్తుంది. మమతా మోహన్ దాస్ స్కూల్ PT టీచర్ గా కంటికింపుగా ఉంది. ఇందులో ఆకట్టుకున్న మరొక పాత్ర ఇన్స్పెక్టర్ గా కనిపించిన నటరాజన్ సుబ్రమణియం. సీనియర్ దర్శకుడు భారతీరాజా కూడా ఒకటి రెండు సీన్స్ లో కనిపించారు.