August 26, 2022
Vikram Cobra Telugu Trailer: చియాన్ విక్రమ్ హీరోగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోబ్రా. ‘కేజీఎఫ్’ భామ శ్రీనిధి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈనెల 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
అపరిచితుడు’ చిత్రంలో మూడు విభిన్న పాత్రలతో సినీ అభిమానులు మనసు దోచిన నటుడు చియాన్ విక్రమ్. ఇప్పుడాయన అంతకుమించి తన నట విశ్వరూపం చూపించేందుకు సిద్ధమయ్యారు. ‘కోబ్రా’ సినిమాలో విక్రమ్ ఏడు విభిన్న గెటప్పుల్లో కనిపించనున్నారు. విలన్ గ్యాంగ్ కథానాయకుడిని హింసించే సన్నివేశంతో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. విక్రమ్ లుక్స్‌ని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అంతగా వైవిధ్యం ప్రదర్శించారు.
ఈ సినిమాలో విక్రమ్.. గణిత శాస్త్రవేత్తగా నటించారు. లెక్కల్లో మేధావి అయిన విక్రమ్ విభిన్న రూపాల్లోకి ఎందుకు మారాల్సి వచ్చింది? ఆయన్ను బంధించేందుకు కారణమేంటి?.. తదితర ప్రశ్నలు ట్రైలర్ చూస్తే ఉత్పన్నమవుతాయి, ఈ దృశ్యాలు సినిమాపై ఆసక్తిని రేకెత్తించేలా ఉన్నాయి. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి, మృణాళిని రవి, కె.ఎస్. రవికుమార్, క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఎ. ఆర్. రెహమాన్ సంగీతం అందించారు.