May 31, 2024
యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన `గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి` ఈ రోజు విడుదలైంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో `డీజే టిల్లు` ఫేమ్ నేహా శెట్టి, అంజలి హీరోయిన్స్‌గా నటించారు. నాగవంశీ నిర్మాత. ట్రైలర్‌తోనే హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా రావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన `గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి` సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
ఎలాగైన జీవితంలో పైకి ఎదగాలని..ఎదగడం తమ హక్కు అని తన తండ్రి చెప్పిన మాటల్ని మనసులో పెట్టుకుని చిన్న చిన్న దొంగతనాలను చేస్తూ జనాల్ని బురిడీ కొట్టిస్తూ బ్రతికేస్తుంటాడు రత్నాకర్(విశ్వక్ సేన్). ఆ ఏరియాలో నానాజీ (నాజర్), దొరసామి రాజు (గోపరాజు రమణ) ఇద్దరూ రాజకీయంగా తమ ఆధిపత్యానికి పోటీ పడుతుంటారు. ఇదే అదునుగా బావించి స్థానిక ఎమ్మెల్యే దొరసామికి కుడిబుజంలా మారతాడు. ఆ గ్రామంలోనే రత్న(అంజలి)తో ఎఫైర్ ఉన్నప్పటికి నానాజీ కూతురు బుజ్జిని(నేహా శెట్టి)తో ప్రేమలో ఉంటాడు. కొన్ని పరిణామాల తర్వాత దొరసామితోనే పోటీకి దిగి ఎమ్.ఎల్.ఏ అవుతాడు రత్నాకర్. ఆ తర్వాత దొరసామి కొడుకు రత్నాకర్‌తో విభేదం పెట్టుకుంటాడు. మరి వీరిద్దరిలో అధికారం ఎవరికి దక్కింది. బుజ్జితో ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిశాక ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి..అనేది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మిగతా కథ.
గోదావరి నేపథ్యంలో సినిమా అనగానే పచ్చటి పల్లెసీమలు, ప్రశాంతమైన వాతావరణమే గుర్తొస్తుంది.దర్శకుడు కృష్ణచైతన్య మాత్రం కాస్త భిన్నంగా ఎరుపెక్కిన గోదావరిని ఈ సినిమాలో చూపించారు. అక్కడి రాజకీయాలు, ఆధిపత్య పోరు, లంక గ్రామాల్లోని పగ, ప్రతీకారాలతో ఓ యువకుడి ప్రయాణాన్ని ముడిపెడుతూ కథని మలిచారు. వేశ్య దగ్గరే డబ్బులు కాజేసి, పారిపోయే హీరో – అదే ప్రాంతానికి ఎమ్.ఎల్.ఏగా ఎలా అయ్యాడు? వందల కోట్లు ఎలా సంపాదించాడు? అనేది ఈ కథకు బీజం. అయితే ఆ ఎదిగే క్రమం అంత ఇంపాక్ట్ గా అనిపించదు.
‘పుష్ష’లో హీరో ఎదిగే క్రమం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ ప్రయాణంలో హీరో తాలుకూ ఆటిట్యూడ్, తెలివితేటలు, ధైర్యం ఇవన్నీ బయటపడతాయి. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రత్నలో అవేం ఉండవు. అది ఈ సినిమాకున్న ప్రధానమైన మైనస్. దొరస్వామి, నానాజీ.. ఇవి రెండూ ఈ కథలో బలమైన పాత్రలుగా అనిపిస్తాయి. అయితే రత్నని ఎలివేట్ చేసే క్రమంలో ఈ పాత్రల ప్రాధాన్యత తగ్గుతూ వెళ్తుంది. నానాజీ పాత్రనైతే మధ్యలోనే ముగించేశారు. నిజానికి దొరస్వామి చాలా పవర్‌ఫుల్ పాత్ర. కిడ్నాప్ డ్రామాలో ఆ పాత్రని కమెడియన్‌ని చేసి ఆడుకోవడం వల్ల.. ఆ పాత్రకున్న ఇంపాక్ట్ పూర్తిగా తగ్గిపోయింది.
హీరోకు ఛాలెంజ్ తగ్గిపోతే, కథాగమనంలో మజా ఏం వస్తుంది? ఈ విషయం దర్శకుడికీ అర్థమైంది. అందుకే చిన్నదొర పాత్రలో దొరస్వామి కొడుకుని రంగ ప్రవేశం చేయించాడు. అయితే.. ఈ పాత్రదీ ఆరంభ శూరత్వమే అనిపిస్తుంది. వచ్చిన కాసేపు ఏదో హడావుడి చేస్తాడు. ఆ తరవాత ఆ పాత్ర కూడా సైలెంట్ అయిపోతుంది. బుజ్జితో లవ్ స్టోరీ ఈ కథకు కీలకం. ఎందుకంటే ఇంత మొరటు మనిషిని, స్వార్థపరుడ్ని మార్చడానికి ప్రయత్నం చేసే పాత్ర అదొక్కటే. అలాంటప్పుడు బుజ్జి లవ్ స్టోరీ చాలా ఇంపాక్టబుల్ గా ఉండాలి. ఈ ‘గోదావరి’లో అదీ లేదు. ‘పద్ధతిగా పెళ్లి చేసుకొని, నీతో పద్ధతిగా పిల్లల్ని కనాలని వుంది’ అని చెప్పిన పద్ధతైన అమ్మాయి, ఇంత పద్ధతి లేని కుర్రాడ్ని ఎందుకు ప్రేమించింది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
అంజలి పాత్ర మాత్రం బాగానే డిజైన్ చేశాడు దర్శకుడు. ఆ పాత్రని కథకు కావల్సిన చోటల్లా వాడాడు. దాంతో బుజ్జి కంటే.. రత్నగా అంజలి పాత్రకే ఎక్కువ మైలేజీ వస్తుంది. ఇలాంటి కథలకు ముగింపు ఇవ్వడం కష్టం. ఎందుకంటే కత్తిపట్టినోడు, కత్తితోనే అంతం అవుతాడు. చేతిలో రక్తపు మరకలే మిగులుతాయి. ఈ కథలోనూ అదే చెప్పాలనుకొన్నాడు దర్శకుడు. అయితే రత్న స్వార్థం, పవర్ గేమ్ చెప్పాలనుకొన్న విషయాన్ని డైవర్ట్ చేశాయి. అందుకే క్లైమాక్స్ లో రత్న ఎమోషనల్ గా డైలాగులు చెబుతున్నా అవి ఇంజెక్ట్ కావు. ఐటెమ్ పాట కూడా అనవసరమే. కేవలం మాస్ కోసం పెట్టిన ఐటెమ్ లానే అనిపిస్తుంది.
తన వరకూ ఎవరూ వేలెత్తి చూపించనంత బాగా చేశాడు విశ్వక్ సేన్. గోదావరి యాసని బాగా పట్టాడు. విశ్వక్ వన్ మాన్ షో ఇది. దర్శకుడు కూడా విశ్వక్‌పై పెట్టిన శ్రద్ధ మిగిలిన పాత్రలపై, కథపై పెట్టలేదనిపిస్తుంది. నేహాకు ఇది డిఫరెంట్ రోల్. బాగానే చేసింది. అయితే బాగా చిక్కినట్టు అనిపిస్తుంది. అంజలి ఇంపాక్ట్ తెరపై కనిపించింది. గోపరాజు పాత్రని మరింత బాగా, పవర్‌ఫుల్ గా డిజైన్ చేయాల్సింది. హైపర్ ఆది ఉన్నా.. పెద్దగా పంచ్‌లు పేలలేదు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అన్నారు కానీ ఆ హీరో గ్యాంగ్ లో ఏ ఒక్కరి పాత్ర కూడా గుర్తు పెట్టుకొనేంత స్థాయిలో లేదు.
బాటమ్‌లైన్: ఎడారిలో గోదారి ప్రయాణం..