Ambajipeta Marriage Band Review: రీసౌండ్ లేదుకాని..బ్యాండ్ బాగానే మ్రోగింది

February 2, 2024

అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్

అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్

  • Cast : సుహాస్, శివాని నగరం, నితిన్ ప్రసన్న. శరణ్య ప్రదీప్, జగదీశ్
  • Director : దుష్యంత్ కటికనేని
  • Producer : ధీరజ్ మొగిలినేని, వెంకట్ రెడ్డి, బన్నీ వాస్
  • Banner : GA2Pictures,DheerajMogilineni
  • Music : శేఖర్ చంద్ర

2.25 / 5

మ‌జిలి సినిమాలో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుహాస్..ఆ త‌ర్వాత ఓటీటీలో వ‌చ్చిన క‌ల‌ర్ ఫోటో సినిమాతో హీరోగా స‌క్సెస్ అందుకున్నారు. ఆ త‌ర్వాత రైట‌ర్ ప‌ద్మ‌భూష‌న్ సినిమాతో గ్యారెంటీ హీరో అనే గుర్తింపు తెచ్చుకోగ‌లిగాడు. తాజాగా అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ అనే సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దుష్యంత్ ఈ సినిమా ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యారు. గీతా ఆర్ట్స్ నుండి వ‌స్తోన్న సినిమా కావ‌డంతో రిలీజ్‌కు ముందు హైప్ అనేది కామన్‌..కానీ ఈ సినిమా కోసం గుండు చేయించుకుని సుహాస్‌ నిజంగా పెద్ద ధైర్యం చేశాడ‌నే చెప్పాలి. ఎందుకంటే కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి సాహ‌సోపేత నిర్ణ‌యాల ప‌ర్యావ‌సానం ముందే అంచ‌నా వేయ‌లేం.. మ‌రి ఈ సినిమా సుహాస్‌కి మినిమం గ్యారెంటీ హీరో ట్యాగ్‌ని కంటిన్యూ చేసిందా? లేదా అనేది చూద్దాం..

కథ: ఉమ్మ‌డి ఆంధ్ర ప్ర‌దేశ్‌లో అంబాజీపేట‌ అనే ఓ చిన్న ప‌ల్లెటూరు. అక్కడ మల్లి (సుహాస్), పద్మ (శరణ్య ప్రదీప్) క‌వ‌ల పిల్ల‌లు. ప‌ద్మ ఒక ఐదు నిమిషాలు ముందు పుడుతుంది. ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి కావ‌డంతో క‌ష్ట‌ప‌డి చ‌దివి ఆ ఊరులో టీచ‌ర్‌గా ప‌నిచేస్తుంటుంది. ఇదే గ్రామంలో సంప‌న్న కులానికి చెందిన వెంకట్(నితిన్ ప్ర‌స‌న్న‌)..ఊరిలో అందరికీ అప్పులు ఇచ్చి..అధిక వ‌డ్డీలు వ‌సూలు చేస్తూ ఆ గ్రామ‌స్థుల‌ను త‌న కంట్రోల్‌లో ఉంచుకుంటాడు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లో పని చేస్తుంటాడు మ‌ల్లి. అదే ఊరిలో కాలేజి చ‌దువుతున్న వెంకట్ చెల్లులు లక్ష్మీ ( శివానీ నాగారం) తో ప్రేమలో పడతారు. వీరి ప్రేమ ఒకవైపు సాగుతుండగానే.. వెంకట్, పద్మల ఈగో క్లాషెస్‌తో వారిద్ద‌రికి కోల్డ్ వార్ నడుస్తూ ఉంటుంది. అయితే.. ఒకరోజు వెంకట్.. తన చెల్లులు మల్లితో ప్రేమలో ఉందని తెలుసుకుని పగతో రగిలిపోతాడు. ఇదే అదునుగా భావించి పద్మని దారుణంగా అవమానిస్తాడు. అక్కడ నుండి ఆ ఊరి కథ ఎలాంటి మలుపులు తిరిగింది? అక్క‌కు జ‌రిగిన అవ‌మానానికి మ‌ల్లి ప‌గ‌ తీర్చుకున్నాడా? మ‌ల్లీ, ల‌క్ష్మీల ప్రేమ‌క‌థ సుఖాంతం అయిందా లేదా అన్నదే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కథ.

విశ్లేషణ: ఈ కథ 2007 నేపథ్యంలో సాగుతుంది. అప్పటి పరిస్థితులను సరిగ్గా.. ఎస్టాబ్లిష్ చేస్తూ దర్శకుడు నేరేషన్ స్టార్ట్ చేసిన విధానం బాగుంది. ఇక క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ మెంట్ కోసం, స్టోరీ ప్రోగ్రెస్ కోసం కాస్త సమయం తీసుకున్నా.. హీరో హీరోయిన్ల మ‌ధ్య లవ్ ట్రాక్ నేటి యువ‌త‌కు న‌చ్చేలా ఉండ‌డం పెద్ద ప్లస్ అయ్యింది. అయితే.. ప్రీ ఇంటర్వెల్ నుండి.. ఇంటర్వెల్ వరకు దర్శకుడు కథని నడిపించిన తీరు, ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌ బాగుంది అయితే కాన్ఫ్లిక్ట్ పాయింట్ ను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయ‌డంలో అక్క‌డ‌క్క‌డా త‌డ‌బ‌డ్డాడు.. ఇక ప్రీ క్లైమాక్స్‌ లో కావల్సినంత ఎమోషన్ క్యారీ కాలేదు..కానీ క్లైమాక్స్‌లో ఇచ్చిన‌ జ‌స్టిఫికేష‌న్ బాగుంది. చాలా స‌న్నివేశాలు చూసిన‌ట్టే అనిపించ‌డం మెయిన్ డ్రాబ్యాక్ అయింది.

ఇక న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే టాలీవుడ్ లో ఉన్న మంచి నటుల్లో సుహాస్ ఒకడు. అతను చేసిన తక్కువ చిత్రాలే అయినా పెర్‌ఫామెన్స్ ప‌రంగా హండ్రెడ్ ప‌ర్సెంట్ ఇచ్చాడు. ఈ సినిమాలో ఫస్ట్ ఆఫ్ లో ఈజీ గోయింగ్ క్యారెక్టర్ లో ఆకట్టుకున్న సుహాస్.. ఇక ఎమోషనల్ సీన్స్ లో చాలా ప‌రిణితి చూపించాడు. మ‌రీ ముఖ్యంగా డ్యాన్సులు చాలా ఈజ్‌తో చేశాడు. సుహాస్ త‌ర్వాత మ‌రో బ‌ల‌మైన పాత్ర‌లో శరణ్య ప్రదీప్ న‌ట‌న బాగుంది. ఫిదా త‌ర్వాత మ‌రో చెప్పుకోద‌గ్గ పాత్ర‌..కొన్ని స‌న్నివేశాల్లో ఇంటెన్సిటి కొంచెం త‌గ్గింది అనిపించింది. ఇక పుష్ప ఫేమ్ జగదీశ్.. సంజయ్ పాత్రలో ఒదిగిపోయాడు. కొత్త హీరోయిన్ శివాని నాగారం త‌న అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుంది. అయితే ఎక్కువ ఎమోష‌న్స్ పండించే అవ‌కాశం రాక‌పోవ‌డం కొద్దిగా మైన‌స్ అని చెప్పొచ్చు. నటులు అంతా తమ పాత్ర పరిధి మేర బాగానే నటించారు.

టెక్నిక‌ల్ విభాగానికి వ‌స్తే ఈ సినిమాకి శేఖ‌ర్ చంద్ర మ్యూజిక్ పెద్ద బలంగా మారింది. ముఖ్యంగా సీన్ మూడ్ చెడిపోకుండా ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా ప్లస్ అయ్యింది. ఇక కెమెరా, ఆర్ట్ వర్క్ ప‌ర్వాలేద‌నిపించుకున్నాయి. నిర్మాణ విలువలు గీతా ఆర్ట్స్ రేంజిలో లేవు..దర్శకుడు దుష్యంత్ కటికనేని ఒక మంచి పాయింట్ తీసుకున్నా ప్ర‌జెంట్ ట్రెండ్ త‌గ్గ‌ట్టుగా బ‌లంగా చెప్ప‌డంలో త‌డ‌బ‌డ్డాడు. బ‌ల‌మైన డైలాగ్స్ లేక‌పోవ‌డం, త‌దుప‌రి స‌న్నివేశంలో ఏం జ‌ర‌గ‌బోతుంది ముందే ఆడియ‌న్స్ ఊహించ‌గ‌ల‌గ‌డం ఈ సినిమాకి అతి పెద్ద మైన‌స్‌..

చివ‌ర‌గా.. అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్ మ‌రీ అంత కాక‌పోయినా బాగానే మ్రోగింది.

ట్రెండింగ్ వార్తలు