September 30, 2022
చిత్రం: పొన్నియిన్ సెల్వన్ నటీనటులు: చియాన్ విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ, ఆర్ శరత్ కుమార్, ప్రభు, విక్రమ్ ప్రభు, జయరాం, ప్రకాష్ రాజ్, అశ్విన్ కాకుమాను, నాజర్, తదితరులు సంగీతం: ఏ ఆర్ రెహ్మాన్ సినిమాటోగ్రఫీ: రవి వర్మన్ నిర్మాత: మణిరత్నం, సుభస్కరన్ అల్లిరాజా దర్శకత్వం: మణి రత్నం విడుదల తేది: 30/09/2022
‘కల్కి’ కృష్ణమూర్తి తమిళంలో రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ అనే ప్రముఖ నవలను సినిమాగా తీయాలని ఎప్పటి నుంచో ఎంతో మంది ఫిల్మ్ మేకర్స్ ప్రయత్నించారు. కానీ, చివరకు మణిరత్నం ఈ గొప్ప నవలను వెండితెరపై ఆవిష్కరించారు. నిజానికి 5 సంపుటిల ఈ నవలను ఒక సినిమాగా తీయడం కత్తిమీద సామే. ఎందుకంటే, ఇందులో ఉన్న పాత్రలు వాటి తీరు.. ఆ పాత్రలను ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చూపించడం చాలా కష్టం. అయినప్పటికీ ఏస్ డైరెక్టర్ మణిరత్నం ధైర్యం చేశారు. రెండు భాగాలుగా విభజించి.. మొదటి భాగాన్ని ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ‘చోళ’ కథ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ: చోళ రాజ్య చక్రవర్తి సుందర చోళుడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. పెద్ద కుమారుడు, పట్టపు యువరాజు అయిన ఆదిత్య కరికాలుడు (విక్రమ్) పాండ్యులను జయించి ఒక్కో రాజ్యాన్ని ఆక్రమించుకుంటూ వెళ్తుంటాడు. మరోవైపు, ఆదిత్య కరికాలుడి తమ్ముడు అరుణ్‌మొలి వర్మ అలియాస్ పొన్నియిన్ సెల్వన్ (జయం రవి).. శ్రీలంకను ఆక్రమించుకోవడానికి సైన్యంతో దండెత్తుతాడు. తంజావూరు కోటలో ఉన్న చక్రవర్తి సుందర చోళుడి (ప్రకాష్ రాజ్) ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇలాంటి సమయంలో చోళ రాజ్యంలో అంతర్గత కుట్రలు జరుగుతుంటాయి. చోళ రాజ్యాధికారాన్ని చేజిక్కుంచుకోవడానికి కొందరు ప్రయత్నిస్తుంటారు. అలాగే, చోళ రాజ్యాన్ని అంతమొందించడానికి మరికొందరు కుట్ర పన్నుతుంటారు. ఈ కుట్రల సమాహారమే ‘పొన్నియిన్ సెల్వన్: 1’ కథ.
విశ్లేషణ: ఈ మొదటి భాగంలో చోళ రాజ్యంలో జరుగుతున్న కుట్రను ప్రస్తావించారు. దాన్ని చోళ చక్రవర్తి, ఆయన కుమారులు ఎలా తిప్పికొడతారు అనేది రెండో భాగంలో చూపించనున్నారు. అయితే, చోళ రాజ్యంలో కుట్రలకు, పన్నాగాలకు అసలు సూత్రధారి నందిని (ఐశ్వర్యా రాయ్) అని చూపించిన దర్శకుడు.. క్లైమాక్స్‌లో పొన్నియిన్ సెల్వన్‌ను కాపాడటానికి ఆమె రూపంలో ఉన్న ఒక మహిళ సముద్రంలో దూకినట్టు చూపించి ట్విస్ట్ ఇచ్చారు. ఈ ట్విస్ట్ రివీల్ కావాలంటే రెండో భాగం వచ్చేంత వరకు ఆగాలి.
ఈ కథకు ‘పొన్నియిన్ సెల్వన్’ అని పేరు పెట్టినా.. ఇది నందిని చుట్టూనే తిరుగుతుంటుంది. ఆదిత్య కరికాలుడు ప్రేమించిన నందిని.. అతడి తాత వయసు ఉన్న సామంత రాజు పలువేట్ట రాయుడిని ఎందుకు పెళ్లిచేసుకుంది అనేది సస్పెన్స్‌గానే ఉంది. ఈ సినిమాను మొదటిసారి చూసినప్పుడు అర్థం చేసుకోవడం కాస్త కష్టమే. ఎందుకంటే, మణిరత్నం స్క్రీన్‌ప్లే కూడా స్మూత్‌గా లేదు. కాస్త గందరగోళంగానే ఉంది. మణిరత్నం శైలిలోనే నెరేషన్ కాస్త స్లోగా సాగింది. యాక్షన్ సీక్వెన్స్‌లు చాలానే ఉన్నా మరీ అంతగా ఆకట్టుకోవు. డ్రామా చూస్తున్నట్టే ఉంటుంది. ‘బాహుబలి’ మాదిరిగా గూస్ బంప్స్ ఇచ్చే యాక్షన్ సీన్స్ కోరుకునే ప్రేక్షకులకు నిరాశ తప్పదు.
ఇక పాత్రల విషయానికి వస్తే.. సినిమాలో ఎక్కువ స్కోప్ వల్లవరాయ వందియదేవుడు పాత్రకు ఉంది. ఈ పాత్రలో కార్తి చాలా బాగా నటించారు. ఆదిత్య కరికాలుడికి నమ్మిన బంటుగా, పోరాట యోధుడిగా తనదైన శైలిలో కామెడీని పండిస్తూ అదరగొట్టారు. ప్రేయసిని కోల్పోయి, ఆమె చేసిన ద్రోహాన్ని గుర్తుచేసుకుంటూ నరకం అనుభవించే యువరాజుగా విక్రమ్ నటించారు. ఇలాంటి పాత్రలు ఆయనకు కొట్టినపిండి. ఇక జయం రవి.. పొన్నియిన్ సెల్వన్‌గా అందంగా, గంభీరంగా కనిపించారు. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాత్రలు రెండు.. ఒకటి నందిని, మరొకటి కుందవి. నందినిగా ఐశ్వర్యా రాయ్, కుందవిగా త్రిష.. సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తుంటే వహ్వా అనిపించకు మానదు. అంతలా వారిద్దరి అందం, గాంభీర్యం ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. ఇక ఈ కథలో చెప్పుకోదగిన మరో పాత్ర వైష్ణవ భక్తుడు నంబి. జయరాం ఈ పాత్రను అద్భుతంగా పోషించారు. ఈయనకు తనికెళ్ల భరణి డబ్బింగ్ కూడా చాలా బాగా సరిపోయింది.
టెక్నికల్‌గా చూసుకుంటే.. విజువల్‌గా సినిమా బాగుంది. రవివర్మన్ సినిమాటోగ్రఫీ బాగున్నా.. దానికి జోడించిన విజువల్ ఎఫెక్ట్స్ అంత గొప్పగా అనిపించలేదు. ఎ.ఆర్.రెహమాన్ పాటలు, నేపథ్య సంగీతం ఆకట్టుకున్నాయి. అయితే, కొత్తదనం ఏమీ కనిపించలేదు. ఈ సినిమాకు తనికెళ్ల భరణి మాటలు అందించారు. సినిమా తెలుగు ప్రేక్షకుడికి అర్థమయ్యింది అంటే అది కచ్చితంగా తనికెళ్ల భరణి మాటల వల్లే అని చెప్పుకోవచ్చు. అంత స్పష్టంగా, క్షుణ్ణంగా ఆయన డైలాగులు ఉన్నాయి. ఈ సినిమాను మణిరత్నం కేవలం 155 రోజుల్లో పూర్తిచేశారు. అయినప్పటికీ నిర్మాణ విలువల్లో మాత్రం కాంప్రమైజ్ కాలేదు.
బాటమ్‌లైన్: పొన్నియన్ సెల్వన్…తమిళులకి మాత్రమే..!