Gaalodu Review: సుధీర్ ఫ్యాన్స్‌కి పండ‌గే

November 18, 2022

Gaalodu Review: సుధీర్ ఫ్యాన్స్‌కి పండ‌గే

టైటిల్‌: గాలోడు న‌టీన‌టులు: సుడిగాలి సుధీర్, గెహ్నా సిప్పి, స‌ప్త‌గిరి, పృథ్విరాజ్, శ‌క‌ల‌క శంక‌ర్‌, స‌త్య క్రిష్ణ‌ త‌దిత‌రులు సినిమాటోగ్ర‌ఫి: సి రాం ప్ర‌సాద్‌ సంగీతం: భీమ్స్ సిసిరోలియో ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: బిక్ష‌ప‌తి తుమ్మ‌ల‌ స‌మ‌ర్ప‌ణ‌: ప్రకృతి బేన‌ర్‌: సంస్కృతి ఫిలింస్‌, ర‌చ‌న – ద‌ర్శ‌క‌త్వం: రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల‌.

బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు సుడిగాలి సుధీర్. స్మాల్ స్క్రీన్ మీద ఓ రేంజ్ క్రేజ్ ఉన్న అతి కొద్దిమందిలో సుధీర్ ఒకడు. సుధీర్ హీరోగా నటించిన ‘గాలోడు’ సినిమా ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల అయింది మ‌రి సినిమా ఎలా ఉందో చూద్దాం.

క‌థ‌: రాజు (సుడిగాలి సుధీర్) పల్లెటూరి కుర్రాడు. ఊరిలో అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. ఓ రోజు పేకాటలో సర్పంచ్ కొడుకుపై చేయి చేసుకోవడంతో అతను చనిపోతాడు. దాంతో ఊరు వదిలి పెట్టి రాజు హైదరాబాద్ పారిపోతాడు. అక్కడ కాలేజీ స్టూడెంట్ శుక్లా (గెహనా సిప్పి)తో పరిచయం అవుతుంది. ఆకతాయిల నుండి తనను కాపాడిన రాజును తన తండ్రికి పరిచయం చేసి, డ్రైవర్ గా ఉద్యోగంలో పెట్టిస్తుంది శుక్లా. అలా మొదలైన వారి పరిచయం ప్రేమకు దారితీస్తుంది. ఇదే సమయంలో పల్లెటూరిలో హత్య చేసి సిటీకి వచ్చిన రాజును వెతుక్కుంటూ పోలీసులు వస్తారు. హత్య కేసులో శిక్ష పడిన రాజు.. జైలు నుండి ఎలా బయటపడ్డాడు? తన నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకున్నాడు? ఈ విషయంలో లాయర్ విజయ భాస్కర్ (సప్తగిరి) అతనికి ఎలాంటి సాయం చేశాడు? అన్నదే మిగతా కథ.

హీరో జైలుకు వెళ్ళటంతో మొదలైన ఈ సినిమా అక్కడ నుండి ఫ్లాష్ బ్యాక్ లో సాగుతుంది. దర్శకుడు రాజశేఖర్ రెడ్డి సినిమాను కాస్త ఆసక్తికరంగానే ప్రారంభించాడు. జైల్లో సుడిగాలి సుధీర్ ఇంట్రడక్షన్, తన పాత్రకు ఇచ్చే బిల్డప్ ఆసక్తిని కలిగిస్తుంది. ఎప్పుడైతే సినిమా ఫ్లాష్ బ్యాక్ దారి పట్టిందో అప్పుడే దారి తప్పింది. ఏ లక్ష్యం లేకుండా గాలికి తిరిగే హీరోకి, కోటీశ్వరుల ఇంటికి ఏకైక వారసురాలు అయిన హీరోయిన్ అట్రాక్ట్ అవ్వడం, వీరి మధ్య వచ్చే సన్నివేశాలు నీరసంగా సాగుతాయి. హీరోయిన్ ఎందుకు హీరోని ప్రేమించిందో తెలిపే ఒక్క సన్నివేశం కూడా సినిమాలో లేదు. డబ్బున్న అమ్మాయిని ఆవారాగా తిరిగే కుర్రాడు ప్రేమించడం, ప్రేమ గుడ్డిదనే మాటను నిరూపిస్తూ, ఆమె ఇతనితో ప్రేమలో పడిపోవడం, వారి ప్రేమను చూసి తట్టుకోలేక హీరోయిన్ తండ్రి విలన్ గా మారడం, వారిని విడగొట్టాలని రకరకాలుగా ప్రయత్నించడం, చివరకు హీరో తన మంచితనంతో అందరి మనసులను గెలుచుకోవడం…ఇలా సింపుల్ పాయింట్ తో మూవీని తీసేశారు.

న‌టీనటుల విషయానికి వస్తే… సుధీర్ డ్యాన్స్‌లు, ఫైట్లు బాగా చేయగలడు. తన కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది. కానీ చిన్నతెరకు, సిల్వర్ స్క్రీన్‌కు చాలా తేడా ఉంటుంది. కమెడియన్ ఇమేజ్ ఉన్న సుడిగాలి సుధీర్ కు ఇది నప్పే పాత్ర కాదు. సెకండ్ హాఫ్‌ లో ఆ పాత్రలో రియలైజేషన్ ను చూపించినా, అదేమంత ఆకట్టుకునే విధంగా లేదు. ‘చోర్ బజార్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన గెహనా సిప్పి తెర మీద చూడటానికి బాగానే ఉంది. దాంతో పాటలు, వాటి లొకేషన్స్ కాస్తంత చూడదగ్గవిగా అనిపిస్తాయి. ఇతర ప్రధాన పాత్రలను సప్తగిరి, రవిరెడ్డి, ఆధ్య, అజయ్, శరత్, పృధ్వీరాజ్, సత్యకృష్ణన్ తదితరులు పోషించారు. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ జడ్జి పాత్రలో కనిపించారు. మొత్తం సినిమాలో షకలక శంకర్ పాత్రే కాస్తంత వినోదాన్ని పంచేది.

టెక్నీషియన్స్ విషయానికి వస్తే…. యాక్షన్ సీన్స్ మూవీకి హైలైట్ గా నిలిచాయి. అలానే రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ కూడా చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. అంతేకాదు… జైలర్ గానూ రాంప్రసాద్ ఓ సీన్ లో తళుక్కున మెరిశాడు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఇచ్చిన ట్యూన్స్ బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప‌ర్వాలేద‌నిపిస్తుంది.

చివ‌ర‌గా సుడిగాలి సుధీర్ వీరాభిమానులకు సినిమా నచ్చుతుంది. కథ అవసరం లేకపోయినా సాంగ్స్, మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలను ఆదరించే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లవచ్చు.

Chitraseema Rating: 3/5

ట్రెండింగ్ వార్తలు