James Movie Review: పునీత్ రాజ్ కుమార్ జేమ్స్ మూవీ రివ్యూ

March 17, 2022

James Movie Review: పునీత్ రాజ్ కుమార్ జేమ్స్ మూవీ రివ్యూ

పునీత్ రాజ్ కుమార్ జేమ్స్ మూవీ రివ్యూ నటీనటులు: పునీత్ రాజ్ కుమార్, ప్రియా ఆనంద్, శ్రీకాంత్, ఆదిత్య మీనన్, శరత్ కుమార్, అను ప్రభాకర్ తదితరులతో పాటు అతిథి పాత్రలో శివ రాజ్ కుమార్, సినిమాటోగ్రఫీ: స్వామి జె. గౌడ సంగీతం: చరణ్ రాజ్ నిర్మాత: కిషోర్ పత్తికొండ దర్శకత్వం: చేతన్ కుమార్ విడుదల తేదీ: మార్చి 17, 2022

దక్షిణాది చిత్ర పరిశ్రమలో కోట్లాది అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించుకొన్న క‌న్న‌డ ప‌వ‌ర్‌స్టార్‌ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణం తీవ్ర విషాదంలోకి నెట్టింది. పునీత్ రాజ్ కుమార్ మరణంతో అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. అయితే ఆయన నటించిన చివరి చిత్రం జేమ్స్. పునీత్ రాజ్ కుమార్ మ‌రణించే సమయానికి ‘జేమ్స్’ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్ ద‌శ‌లో ఉంది. దివంగత కథానాయకుడికి నివాళిగా సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కన్నడలో తమ్ముడి పాత్రకు అన్నయ్య శివ రాజ్ కుమార్ డబ్బింగ్ చెప్పారు. నేడు పునీత్ జయంతి సందర్భంగా విడుదల చేశారు. కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్స్ విడుదల చేశారు. ప్రియా ఆనంద్ కథానాయికగా, టాలీవుడ్ హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

జేమ్స్ క‌థేంటంటే? సంతోష్ కుమార్ అలియాస్ జేమ్స్ (పునీత్ రాజ్‌కుమార్) దేశం కోసం ప్రాణాలను కూడా లెక్క చేయని ఆర్మీ ఆఫీస‌న‌ర్‌. అయితే దేశంలో డ్రగ్స్ కార్యకలాపాలను నిర్వహించే మాఫియా డాన్స్ జోసెఫ్ ఆంటోని (శరత్ కుమార్), విజయ్ గైక్వాడ్ (శ్రీకాంత్), కుప్పుస్వామి నాయుడు (ముఖేష్ రుషి), ఆదిత్య మీనన్‌ను సంతోష్ కుమార్ వెంటాడుతుంటాడు. ఆర్మీలో పని చేసే సంతోష్ బోర్డర్ వదిలి హైదరాబాద్ ఎందుకు వచ్చాడు? డ్రగ్ మాఫియాకు, విజయ్ ఫ్యామిలీకి, సంతోష్ కుమార్‌కు లింక్ ఏంటి? అసలు, జేమ్స్ ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూసి తెలుసుకోవాలి.

‘జేమ్స్’… కమర్షియల్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకూ… కన్నడ ప్రేక్షకుల్లో, కర్ణాటకలో పునీత్ స్టార్‌డ‌మ్‌ను దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా. హీరోయిజం ఎలివేట్ చేసే సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాల్లో హీరో ఎలివేషన్ షాట్స్ చాలా ఉన్నాయి. పునీత్ అభిమానులకు అవన్నీఫుల్‌మీల్స్‌లా ఉంటాయి. మాఫియా డాన్‌కు ముప్పు ఉందనే కారణంగా సంతోష్ కుమార్ అతడికి సెక్యూరిటీగా బాధ్యతలు చేపడుతాడు. డ్రగ్స్ మాఫియా కార్యకలాపాలను కొనసాగించే ముఠాను ఏరిపారేస్తూ ఫస్టాఫ్ పూర్తిగా ఊరమాస్ యాక్షన్ సీన్లతో సాగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌ ఓ ట్విస్టుతో ముగుస్తుంది.

పునీత్ ఇమేజ్‌కు తగ్గట్టు దర్శకుడు చేతన్ కుమార్ సినిమా తీశారు. ఆయ‌న రాసుకొన్న పాయింట్ హై ఎమోషనల్‌గా ఉంటుంది. అనాధలైన ఐదుగురు స్నేహితులకు సంబంధించిన కథకు ఆర్మీ బ్యాక్ డ్రాప్‌ను జత చేసి మరింత ఇంటెన్స్‌గా మార్చాడు. హై ఓల్టేజ్ యాక్షన్ సీన్లను డిజైన్ చేసిన విధానం మాస్ ఆడియెన్స్‌కు మంచి కిక్ అందిస్తుంది. అలాగే సెకండాఫ్‌లో ఎమోషనల్ సీన్లు సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్తాయి. ఓవరాల్‌గా వెండితెర మీద పునీత్ రాజ్‌కుమార్‌ వన్ మ్యాన్ షోను దర్శకుడు నడిపించిన తీరు అందర్ని ఆకట్టుకొంటుంది.సినిమాటోగ్రఫీ, సంగీతం కమర్షియల్ సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. నిర్మాణంలో రాజీ పడలేదని ప్రతి ఫ్రేమ్‌లో తెలుస్తోంది.

నటీనటుల విషయానికి వస్తే… సంతోష్ కుమార్‌ పాత్రకు పునీత్ రాజ్ కుమార్ వందకు వంద‌ శాతం న్యాయం చేశారు. స్టైలిష్‌గా కనిపించారు. యాక్టింగ్ పరంగా పర్ఫెక్షన్ చూపించారు. ముఖ్యంగా ఫైట్స్ అద‌ర‌గొట్టారు. ప్రియా ఆనంద్ పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో ఆమె బాగా చేశారు. శ్రీకాంత్, ఆదిత్య మీనన్, శరత్ కుమార్, ముఖేష్ రుషి తదితరులకు ఇటువంటి పాత్రలు చేయడం కొత్త కాదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో క్యారెక్టర్స్ కావడంతో అలవోకగా నటించారు. శివ రాజ్ కుమార్ అతిథి పాత్రలో కనిపించారు. ఇంట్రడక్షన్ సాంగ్‌లో హీరోయిన్లు రచితా రామ్, శ్రీలీల సహా కొంతమంది కన్నడ సంగీత దర్శకుడు తళుక్కున మెరిశారు.

కన్నడ ప్రేక్షకులకు ‘జేమ్స్’ సినిమా కాదు, ఒక ఎమోషన్. పునీత్‌కు నివాళిగా అక్కడి ప్రేక్షకులు చూస్తున్నారు. కన్నడ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు సినిమాలో చాలా ఉన్నాయి. యాక్షన్, మానవ సంబంధాలు, భావోద్వేగమైన అంశాలతో కూడిన చిత్రంగా జేమ్స్ రూపొందింది. సినిమా భారాన్నంత తన భుజాలపై వేసుకొని వన్ మ్యాన్ ఆర్మీ అనే విధంగా పునీత్ పెర్‌ఫార్మెన్స్ ఉంటుంది. పునీత్ అభిమానులకు, యాక్షన్ సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చుతుంది. థియేటర్‌కు వెళ్లిన ప్రతీ ప్రేక్షకుడు భారమైన హృదయంతో బయటకు వస్తాడు.

ఈ సినిమా ఎమోషనల్ పరిస్థితుల్లో రిలీజ్ అయినందున్న జేమ్స్ చిత్రానికి రేటింగ్ ఇవ్వడం లేదు.

Related News

ట్రెండింగ్ వార్తలు