Japan Movie Review: నిరాశ‌ప‌రిచే బోరింగ్ డ్రామా

November 10, 2023

జ‌పాన్‌

జ‌పాన్‌

  • Cast : కార్తి, అను ఇమ్మానుయేల్, సునీల్‌, విజ‌య్ మిల్ట‌న్‌, జిత‌న్ ర‌మేశ్ త‌దిత‌రులు
  • Director : రాజు మురుగ‌న్‌
  • Producer : ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభు
  • Banner :  డ్రీమ్‌ వారియ‌ర్ పిక్చ‌ర్స్‌
  • Music : జి.వి.ప్రకాష్

1.5 / 5

Japan Movie Review: కార్తి కెరీర్‌లో ఓ మైలురాయిలాంటి చిత్రం ‘జ‌పాన్‌’(Japan). ఆయ‌నకి ఇది 25వ సినిమా. తెలుగులో బ‌ల‌మైన మార్కెట్‌ని సొంతం చేసుకున్న కార్తి(Karthi) సినిమా అంటే తెలుగు ప్రేక్ష‌కుల్లో ప్ర‌త్యేక‌మైన ఆస‌క్తి క‌నిపిస్తుంటుంది. ఆ ఆస‌క్తిని మ‌రింత‌గా పెంచుతూ సంద‌డి చేశాయి ప్ర‌చార చిత్రాలు. డ‌బ్బు దోపిడీ నేప‌థ్యం… త‌మిళ‌నాడులోని ఓ నిజ‌మైన దొంగ క‌థ‌గా ప్ర‌చార‌మైన ఈ సినిమా ఎలా ఉంది? (Japan Movie Review)కార్తి కెరీర్‌లో మైలురాయిలా నిలిచిందా?

క‌థ‌: జపాన్ ముని (కార్తి) ఒక దొంగ‌. ఓ దోపిడీలో పోలీస్ అధికారుల‌కి చెందిన కొన్నిర‌హ‌స్య‌ వీడియోలు దొరుకుతాయి. వాటిని త‌న ద‌గ్గ‌రే ఉంచుకున్న జ‌పాన్ పోలీసుల‌కి టార్గెట్‌గా మార‌తాడు. ఇంత‌లో హైదరాబాద్ లోని రాయల్ జ్యూయలెర్స్ లో 200 కోట్ల రూపాయ‌ల విలువ‌గ‌ల బంగారం దోపిడీ జరుగుతుంది. ఈ దొంగతనానికి పాల్పడింది జపాన్ అని తెలుసుకున్న పోలీసులు ఆధారాలు లేక‌పోవ‌డంతో అతడికి బ‌దులు ఒక అమాయ‌కున్ని బందించి అత‌ని ద్వారా జ‌పాన్ నేర‌స్తుడు అని చెప్పించి జ‌పాన్‌ పట్టుకోవడానికి పోలీస్ యంత్రాంగం మొత్తాన్ని రంగంలోకి దింపుతారు. ఇంత‌కీ ఆ దొంగ‌త‌నం ఎవ‌రు చేశారు? జ‌పాన్ దొరికాడా? ఆ అమాయ‌కుడు ఈ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడా?(Japan Movie Review in Telugu) అస‌లు జపాన్ ఎలా దొంగ‌గా మారాడు? సినీ న‌టి సంజు (అను ఇమ్మానుయేల్‌)తో జ‌పాన్‌కి ఉన్న బంధం ఏమిటి? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే..

ఇక న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే సాధార‌ణంగా వేరే హీరోలు న‌టిస్తే అర‌గంట సేపు కూడా చూడ‌లేని క‌థని కూడా ఇంట‌ర్వ‌ల్ వ‌ర‌కూ చూడ‌గ‌లిగేలా చేస్తాడు. అంత‌లా త‌న న‌ట‌న‌తో మెస్మ‌రైజ్ చేస్తాడు. అందుకే కార్తి సినిమాలు త‌మిళంతో పాటు తెలుగులో కూడా బాగా ఆడ‌తాయి. ఇక జ‌పాన్ విష‌యానికి వ‌స్తే ఈ సినిమాలో కార్తీ మ‌రింత కొత్త‌గా కనపడతాడు. హెయిర్ స్టైల్ నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు అన్నింటిల్లో కొత్తదనం చూపించడానికి ప్రయత్నించాడు. యాస చాలా బాగుంది. వింతగా ఉంది. నటుడిగా స్థాయికి తగ్గ పాత్ర కాకపోయినప్పటికీ క్యారెక్టర్ లో చక్కగా ఇమిడిపోయాడు. కామెడీ టైమింగ్ తోపాటు యాక్షన్ సీక్వెన్స్ లో తన సత్తా చూపించాడు.

తెలుగులో హాస్య పాత్రలు పోషిస్తున్న సునీల్ కు తమిళంలో మంచి పాత్రలు వస్తున్నాయి. అక్కడ బిజీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాలో లుక్ పుష్ప సినిమాలో మాధిరి ఉండ‌డం కొంత చిరాకు తెప్పిస్తుంది. అను ఇమ్మాన్యుయెల్ పాత్ర నిడివి చాలా త‌క్కువ‌. కాని ఉన్నంత‌లో త‌న అందాలను ప్రదర్శించి ఆకట్టుకుంది. ఇతర పాత్రధారులంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

దర్శకుడు రాజా మురుగన్ రాసుకున్న కథ ఫిలాసాఫికల్ గా ఉంది. కథను నడిపించిన విధానం మాత్రం ఆకట్టుకోలేదు. కార్తి మార్క్ హాస్యం, విభిన్న‌మైన నేప‌థ్యం, పాత్ర ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. త‌ల్లి సెంటిమెంట్ అంశాల్నీ జోడించారు కానీ… క‌థ‌ని న‌డిపిన విధానంలోనే స‌మ‌స్య‌లున్నాయి. క్రేజీగా అనిపించే జ‌పాన్ పాత్ర‌, న‌డ‌వ‌డిక అక్క‌డ‌క్క‌డా న‌వ్వించినా చాలా స‌న్నివేశాలు నిరాస‌క్తంగా సాగుతాయి. న‌గ‌ల దుకాణంలో దోపిడీ నుంచే అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. దోపిడీ జ‌రిగిన చోట ఆధారాలు సేక‌రించ‌డం, ఆ క్ర‌మంలో న‌గ‌లు త‌యారు చేసే దుకాణాల ద‌గ్గ‌ర డ్రైనేజీలో క‌లిసే వ్య‌ర్థాల నుంచి బంగారం సేక‌రించి పొట్ట పోసుకునే జీవితాల్ని చూపించ‌డం ఆస‌క్తిక‌రంగా అనిపిస్తుంది.

జ‌పాన్ పాత్ర రాక‌తో క‌థకి మ‌రింత ఊపు వ‌స్తుంది. గోల్డెన్ స్టార్‌గా (Japan Movie Review) జ‌పాన్ సినిమాతో చేసే హంగామా న‌వ్విస్తుంది. జ‌పాన్ జ‌ల్సా జీవితం, హీరోయిన్‌తో ప్రేమ నేప‌థ్యంతో స‌న్నివేశాలు సాగుతాయి. మ‌రోవైపు స‌మాంత‌రంగా కేసులో ఇరుక్కుపోయిన ఓ అమాయ‌కుడి జీవితాన్ని చూపిస్తూ క‌థ‌ని ముందుకు న‌డిపించారు. విరామ స‌న్నివేశాలు ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. సింహం ముసుగులో న‌క్క ఉందన్న అంశ‌మే ప్ర‌ధానంగా ద్వితీయార్ధం మొద‌ల‌వుతుంది. అయితే ఆ న‌క్క ఎవ‌ర‌నే విష‌యం బ‌హిర్గ‌త‌మ‌య్యే తీరు పేల‌వంగా ఉంటుంది. ప‌తాక స‌న్నివేశాలు సినిమాకి ప్ర‌ధానబ‌లం. మ‌న‌సుల‌కి హ‌త్త‌కునేలా ఆ స‌న్నివేశాల్ని తీర్చిదిద్దారు. ఈ క‌థ‌లో హెచ్‌.ఐ.వి ప్ర‌స్తావ‌న ఎందుకో అర్థం కాదు. ఆ నేప‌థ్యం క‌థపైనా, డ్రామాపైన పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌దు. (Japan Movie Review) హెచ్‌.ఐ.వి ప్ర‌స్తావ‌న లేక‌పోయుంటే ప‌తాక స‌న్నివేశాల్లో క‌థానాయ‌కుడి పాత్ర మ‌రింత ప్ర‌భావం చూపించేదేమో. మొత్తంగా అక్క‌డ‌క్క‌డా అల‌రించే కొన్ని స‌న్నివేశాలు, క‌థానాయ‌కుడి పాత్ర చేసే హంగామా మిన‌హా సినిమా పెద్ద‌గా మెప్పించ‌దు. జి.వి.ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం పర్వాలేదనిపిస్తుంది. రవివర్మన్ సినిమాటోగ్రఫీ వర్క్ & ఆర్ట్ వర్క్ సినిమాకి ప్లస్ పాయింట్స్. ఇమేజ్ కు భిన్నంగా కార్తీ ప్రయత్నించిన సినిమా “జపాన్”. సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను విభిన్నంగా కావాలనుకునేవారు ఈ సినిమాను ఒక సారి చూడొచ్చు.

బాట‌మ్ లైన్‌: జ‌పాన్ మేడ్ ఇన్ చైనా

ట్రెండింగ్ వార్తలు