August 27, 2022
హ్యాపీడేస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు నిఖిల్. తన నటన, మరియు స్క్రిప్ట్ సెలక్షన్స్‌తో ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. స్వామిరారా, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కార్తికేయ లాంటి భిన్నమైన కథలతో ప్రేక్షకులని అలరిస్తూనే మరోవైపు కేశవ, కళావర్ కింగ్ లాంటి సినిమాతో విసిగించాడు కూడా… అయితే మిగతా హీరోల్లా ఒకటిరెండు హిట్ సినిమాలతోనే స్టార్ స్టేటస్‌వచ్చేసిందే అనే భ్రమలో మాత్రం లేడు. నైటుకి నైటే ఏదో ఒక తన పేరుముందు ఏ స్టార్ బిరుదు తగిలించుకునే ఆలోచనలో కూడా లేనట్టుంది. ఆ విషయం ప్రక్కన పెడితే తాజాగా ఈయన చందు మొండేటి దర్శకత్వంలో నటించిన చిత్రం కార్తికేయ 2. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకొని 100 కోట్ల క్లబ్ లోకి చేరింది.
ఇప్పుడంటే అందరూ స్టేజీలమీద మేం ఈ సినిమాకు సపోర్ట్ చేశాం అని చెబుతున్నారు కాని ఈ సినిమా రిలీజ్‌కి అడుగడుగునా కష్టాలే. ఈ విషయం ఇండస్ట్రీకి కాస్త దగ్గరగా ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇప్పుడు తన కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటున్నాడు. ముఖ్యంగా తనకు ఏ మాత్రం మార్కెట్ లేని హిందీలో దాదాపు 25కోట్ల మార్కెట్‌ను ఏర్పరచుకునే దిశగా వెళుతున్నాడు.
ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన సందర్భంగా చిత్ర బృందం కర్నూలులో వేడుక నిర్వహించింది. ఈవేడుకనుద్దేశించి నిఖిల్ మాట్లాడుతూ “ సినిమా అంటే బాక్సాఫీసు నంబర్లు కాదని, అదొక ఎమోషన్ అని అన్నారు. ‘కార్తికేయ 2’పై ప్రేక్షకులు చూపించిన ప్రేమే రూ.100 కోట్లతో సమానమని పేర్కొన్నారు. ‘బాహుబలి’, ‘పుష్ప’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రాలతో ప్రభాస్, అల్లు అర్జున్, రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చూపించారు. . ‘కార్తికేయ 2’ హిందీలో డబ్ అయి, ఉత్తరాదిన విడుదలవుతుందంటే నాకు భయమేసింది. ‘నిఖిల్ ఏంటి? బాలీవుడ్‌కి వెళ్లడమేంటి?’ అని నాలాగే మీరూ అనుకున్నారు కదా. కానీ, విడుదలయ్యాక పరిస్థితి మారింది. దేశవ్యాప్తంగా ఈ సినిమా 1200 స్క్రీన్స్‌లో ప్రదర్శితమవుతోంది. ఇది ‘కార్తికేయ 2’ విజయం కాదు తెలుగు సినిమా విజయం. మనం గర్వపడాల్సిన సందర్భమిది. సినిమా అంటే బాక్సాఫీసు నంబర్లు కాదు, ఓ ఎమోషన్. మీరు నాపై, సినిమాపై చూపిస్తున్న ప్రేమే నాకు రూ.100 కోట్లతో సమానం ’’ అని నిఖిల్ భావోద్వేగంతో మాట్లాడారు.
ఇంతవరకూ బాగానే ఉంది కానీ మేం సినిమాని పెద్దగా ప్రమోట్ చేయలేదు. మీ అంతట మీరే ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లారు అని కామెంట్ చేయడంపై కొందరు విభేదిస్తున్నారు. ఎందుకంటే ఈ చిత్ర నిర్మాతలు బీజేపి పార్టీ సపోర్టర్స్…(అందుకే ఈ సభకు భాజపా నేత, మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్ అతిథిగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు). బాలీవుడ్‌లో బాయ్‌కాట్ ఖాన్స్, బాయికాట్ నెపోటిజం వెనుక ఎవరిహస్తం ఉందో అందరికీ తెలుసు. ఆ బ్యానర్ నుండి వచ్చిన సినిబా కాబట్టి కాశ్మీర్ ఫైల్స్ లాగానే ఈ సినిమాకు అవసరాన్ని మించిన సపోర్ట్ లభించింది అనేది కొంతమంది వాదన. ఇందులో ఏమాత్రం నిజం ఉంది అనేది చూడాలి.