ఖుషి మూవీ రివ్యూ

September 1, 2023

ఖుషి

ఖుషి

  • Cast : విజయ్ దేవరకొండ, సమంత, జయరామ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, శరణ్య పొన్ వన్నన్, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ
  • Director : శివ నిర్వాణ
  • Producer : నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి
  • Banner : మైత్రి మూవీ మేకర్స్
  • Music : హేశం అబ్దుల్ వహాబ్

2.25 / 5

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Dewara Konda), సమంత(Samantha) జంటగా నటించిన చిత్రం ఖుషి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సూప‌ర్‌హిట్ టైటిల్, మ‌హాన‌టి త‌ర్వాత స‌మంత‌,విజ‌య్ దేవ‌ర‌కొండ‌ క‌లిసి న‌టించ‌డం, ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి చిత్రాలను తెర‌కెక్కించిన శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో ఈ సినిమాపై భారీ అంఛ‌నాలే నెల‌కొన్నాయి. అయితే ‘లైగర్’ వంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత‌ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, శాకుంత‌లం లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత స‌మంత‌, ట‌క్ జ‌గ‌దీష్ త‌ర్వాత శివ నిర్వాణ‌కు ఈ సినిమా విజ‌యం త‌ప్ప‌నిస‌రైంది. సెప్టెంబర్ 1న థియేటర్లోకి వచ్చిన‌ ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ: విప్లవ్(విజయ్ దేవరకొండ)కి బీఎస్ఎన్ఎల్ లో ఉద్యోగం రావ‌డంతో కాశ్మీర్‌కు వెళతాడు. అక్కడ ఆరా బేగం (స‌మంత‌)ను చూసి తొలిచూపులోనే ఆమె తన భాగస్వామి అని ఫిక్స్ అయిపోతాడు. కాసేప‌టి త‌ర్వాత తాను బేగం కాదు ఒక బ్రహ్మణ్ అని తన పేరు ఆరాధ్య అని, ఆమె తండ్రి చదరంగం శ్రీనివాసరావు (మురళి శర్మ) ప్రముఖ ప్రవచనకర్త అని చెబుతుంది. ఆ త‌ర్వాత విప్ల‌వ్‌ కాకినాడ‌కు చెందిన నాస్తికుడు లెనిన్ సత్యం(స‌చిన్ ఖేడ్‌క‌ర్‌) కొడుక‌ని తెలుస్తుంది. భిన్నమైన కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చిన ఈ ఇద్దరి ప్రేమ పెళ్లికెలా దారితీస్తుంది, ఆ తర్వాత ఏమౌతుందనేది కథ.

ఎలా ఉంది: చాలా సినిమాల్లో చూసిన ప్రేమ‌క‌థే అయినా ఈ క‌థ కోసం కొత్తర‌క‌మైన నేప‌థ్యాన్ని ఎంచుకున్నాడు ద‌ర్శ‌కుడు. ఆస్తికులు, నాస్తికులైన రెండు కుటుంబాల న‌మ్మ‌కాల నుంచి సంఘ‌ర్ష‌ణ‌ని సృష్టించి ఈ క‌థ‌ని న‌డిపించాడు. ఫ‌స్ట్ హాఫ్‌లో అంద‌మైన ప్రేమ‌క‌థ‌ని చూపిస్తే సెకండాఫ్ లో పెళ్లి త‌ర్వాత వ‌చ్చే మ‌న‌స్ప‌ర్ధ‌ల‌ను చూపించాడు. సినిమాలోని ప్ర‌ధాన పాత్ర‌లు ప‌రిచ‌యం కాగానే… క‌థ క‌శ్మీర్‌కి చేరుతుంది. అక్క‌డ హీరో-హీరోయిన్లు ఒక‌రికొక‌రు తార‌స‌ప‌డ‌టం… ఆ త‌ర్వాత ప్రేమ, విన‌సొంపైన పాట‌లు, క‌నువిందు చేసే క‌శ్మీర్ అందాల‌తో సినిమా హాయిగా సాగిపోతుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ-వెన్నెల కిశోర్ నేప‌థ్యంలో వ‌చ్చిన హాస్య స‌న్నివేశాలు ఫ‌స్ట్‌హాఫ్‌ని న‌డిపించాయి. ద్వితీయార్ధంలోనే అస‌లు సంఘ‌ర్ష‌ణ ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట మ‌ధ్య ఎలాంటి విష‌యాలు అపార్థాల‌కి కార‌ణ‌మ‌వుతుంటాయి? ఇక ఆ జంట భిన్న సంప్ర‌దాయాలు, క‌ట్టుబాట్లతో మెలిగే కుటుంబాల నుంచి వ‌చ్చిన‌ప్పుడు ఆ అపార్థాలు ఇంకెంత‌గా ప్ర‌భావం చూపిస్తాయో సెకండాఫ్‌లో చూపించారు. సెకండాఫ్లో చాలా చోట్ల స‌న్నివేశాలు సాగ‌దీత‌లా అనిపిస్తాయి. హీరోయిన్‌కి మిస్ క్యారేజ్ అయ్యాక కూడా హీరోకి టెస్టుల పేరుతో తెర‌పై హ‌డావుడిని చూపించ‌డం, ఫెర్టిలిటీ సెంట‌ర్‌లో హ‌డావుడి, కేర‌ళలో స‌న్నివేశాలు వృథా అనిపిస్తాయి. హీరో-హీరోయిన్ల మ‌ధ్య అపార్థాలు కూడా ఎఫెక్టివ్‌గా అనిపించ‌వు.

ఎవరెలా చేశారు: విజయ్ దేవర కొండకు ఒక సపరేట్ ఆడియెన్స్ ఉన్నారు. ఈ సినిమాలో విజయ్ కొత్తగా కనిపిస్తారు. లుక్ వైజ్‌గా చాలా డీసెంట్‌గా ఉన్నారు. సమంతకు మైయోసైటీస్ వచ్చినప్పటి నుంచి తన లుక్స్‌లో ఓల్డ్ బ్యూటీ కనిపించడం లేదు. నటన విషయానికి వస్తే చాలా బాగా చేసింది. హీరోహీరోయిన్ల నడుమ కెమిస్ట్రీ తెరపై బాగ పండింది. మురళి శర్మ, వెన్నెల కిశోర్, సచిన్ ఖేడెకర్ తదితరులు వారి ఉన్నంతలో మెప్పించారు. హేషామ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ సినిమాకి ప్రాణం పోసింది. పాటలన్నీ బాగున్నాయి. పెయిన్ ఫుల్ లవ్ స్టోరీకి ప్రాణం పోసేది నేపథ్య సంగీతమే. ఈ సినిమాలో హేషామ్ అబ్దుల్ వహాబ్ బ్యాగ్రౌండ్ స్కోర్‌తో సన్నివేశాలను మరోస్థాయిలో నిలబెట్టింది. పాటలన్నింటికీ సాహిత్యం అందించి సింగిల్ కార్డ్ రైటర్‌గా మల్టీ టాలెంట్ చూపించారు దర్శకుడు శివ నిర్వాణ. అయితే ఈ సినిమాకి ఖుషి అనే టైటిల్ ఎందుకు పెట్టారనేదానికి క్లారిఫికేషన్.. క్లైమాక్స్‌లో సగంమంది కుర్చీలలో నుంచి లేచి వెళ్లిపోయిన తరువాత చూపించారు. కాబట్టి.. ఎండింగ్ టైటిల్ కార్డ్స్ పడుతున్నాయని లేచిపోకుండా.. చివర్లో వచ్చే బ్రహ్మానందం ఎపిసోడ్‌ని కూడా మిస్ కాకుండా చూడాల్సిందే.

‘ఖుషి’.. ప్రేక్షకుల్ని ఫుల్ ఖుషీ చేయకపోవచ్చు కానీ.. ఫీల్ గుడ్ మూవీ అనే ఫీల్ అయితే కలుగజేస్తుంది.

ప్లస్ పాయింట్స్:

  • విజయ్ దేవరకొండ, సమంత
  • మ్యూజిక్
  • సినిమాటోగ్రఫి
  • లోకేషన్లు

మైనస్ పాయింట్స్:

  • ఎడిటింగ్
  • కథనం

బాట‌మ్‌లైన్‌: ఖుషి….చేయ‌లేక‌పోయారు.

Read More: శివకార్తికేయన్ #SK21 కాశ్మీర్‌ షెడ్యూల్‌ పూర్తి

ట్రెండింగ్ వార్తలు