Kannur Squad Telugu Review: ప్రేక్ష‌కుల‌ని మెప్పించే ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్‌

November 21, 2023

కన్నూర్‌ స్క్వాడ్‌

కన్నూర్‌ స్క్వాడ్‌

  • Cast : మమ్ముట్టి, రోనీ డేవిడ్‌ రాజ్‌, కిశోర్‌, విజయ రాఘవన్‌
  • Director : రోబీ వర్గీస్‌ రాజ్‌
  • Producer : మమ్ముట్టి కంపెనీ
  • Banner : డిస్నీ+ హాట్‌స్టార్‌
  • Music : సుశిన్‌ శ్యామ్‌

2.75 / 5

Kannur Squad Telugu Review: మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో దర్శకుడు రోబీ వర్గీస్‌ రాజ్‌ తెరకెక్కించిన మలయాళ చిత్రం ‘కన్నూర్‌ స్క్వాడ్‌’ (Kannur Squad). బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌ (Disney+Hotstar) వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగు సహా ఐదు భాషల్లో అందుబాటులో ఉంది. మరి, అక్కడ హిట్‌ టాక్‌ సొంతం చేసుకున్న ఈ సినిమా కథేంటి? తెలుగు వారిని ఈ సినిమా మెప్పించగలిగిందా? అనేది ఇప్పుడు చూద్దాం.

కన్నూర్‌ స్క్వాడ్‌ క‌థేంటి?

కేరళలోని కన్నూర్‌ జిల్లాలో సాగే కథ ఇది. అక్కడి క్రైమ్‌ రేట్‌ని తగ్గించాలనే ఉద్దేశంతో ఓ ఎస్పీ.. రెండు స్క్వాడ్‌లను ఏర్పాటు చేసి, వారికి ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తాడు. ఏఎస్సై జార్జ్‌ మార్టిన్‌ (మమ్ముట్టి) నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన బృందం అందులో ఒకటి. ఈ స్క్వాడ్‌పై ఉన్న నమ్మకంతో మరో ఎస్పీ చోళన్‌ (కిశోర్‌) రాజకీయ ప్రముఖుడి హత్య కేసును ఛేదించే బాధ్యతను అప్పగిస్తాడు. పైఅధికారుల నుంచి వస్తున్న ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని పది రోజుల్లోగా కేసును పరిష్కరించాలని ఆదేశిస్తాడు. అయితే, ఈ క్రమంలో ఆ స్క్వాడ్‌లోని ఓ సభ్యుడు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటాడు. మరి, ఆరోపణలు వచ్చినా ఆ స్క్వాడ్‌నే ఎందుకు రంగంలోకి దించారు? హత్యకు గురైన వ్యక్తి నేపథ్యమేంటి? అతడిని చంపిందెవరు? నిర్ణీత సమయంలో జార్జ్‌ టీమ్‌ హంతకులను పట్టుకుందా? ఆ దర్యాప్తులో భాగంగా వారికి ఎదురైన సవాళ్లేంటి? అనేది మిగ‌తా క‌థ‌.

ఎలా ఉందంటే?

కేరళలోని కన్నూర్‌లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. నిర్దేశించిన సమయంలో నేరస్థులను పట్టుకోవాలనే సవాలును స్వీకరించిన నలుగురు పోలీసుల కథే ఈ ‘కన్నూర్‌ స్క్వాడ్‌’ అసలు కథలోకి వెళ్లేందుకు దర్శకుడు దాదాపు 15 నిమిషాలు తీసుకున్నారు. అప్పటి వరకు ఈ టీమ్‌ ఏంటో? ఇందుకిలా ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారో? అన్న సందేహాలు ప్రేక్షకుడికి కలుగుతాయి. ఓ జర్నలిస్ట్‌ చేసే ఇంటర్వ్యూలో భాగంగా వారు ఆ స్క్వాడ్‌లో ఎలా భాగమయ్యారో జార్జ్‌ చెప్పే సన్నివేశంతో క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత, ఈ టీమ్‌ ప్రతిభ గురించి తెలుసుకున్న ఎస్పీ చోళన్‌ (కిశోర్‌) వారికి పది రోజుల టైమ్‌ ఇచ్చి కేసును ఛేదించమనడం, వెంటనే వారు రంగంలోకి దిగడం.. ఇలా అక్కడి నుంచి కథ పరుగులు పెడుతుంది.

కేరళలో మొదలైన స్క్వాడ్‌ జర్నీ ముంబయి (మహారాష్ట్ర), ఫైజాబాద్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌)సహా నేపాల్‌ బోర్డర్‌ వరకూ సాగుతుంది. అయితే, ఇలాంటి నేపథ్య కథలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీకాదు. కార్తి హీరోగా తెరకెక్కిన ‘ఖాకీ’ ఈ తరహాలో సాగేదే. ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా ఎదురైన సవాళ్లను జార్జ్‌ అధిగమించే తీరు మెప్పిస్తుంది. టీమ్‌ సభ్యులకు వ్యక్తిగతంగా మనస్పర్థలు వచ్చి.. ఇన్వెస్టిగేషన్‌ ఆపేయాలనుకున్న సమయంలో జార్జ్‌ ఇచ్చే సందేశం ప్రేక్షకుడిని ఆలోచింపజేస్తుంది.

పోలీసు డిపార్ట్‌మెంట్‌కు రాజకీయంగా ఎలాంటి ఒత్తిడి ఉంటుంది? లంచం తీసుకున్నారనే ఆరోపణలు వస్తే పోలీసులకు ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి? ఇతర రాష్ట్రాలకు ఇన్వెస్టిగేషన్‌కు వెళ్తే స్థానికంగా ఉండే పోలీసు అధికారుల నుంచి ఎలాంటి స్పందన ఉంటుంది? తదితర అంశాలను చక్కగా చూపించారు. కథ ఫైజాబాద్‌కు షిఫ్ట్‌ అయిన తర్వాత మరింత రసవత్తరంగా ఉంటుంది. సీసీ ఫుటేజ్‌లు, కాల్‌ డేటా ఆధారంగా నిందితులకు సాయం చేసిన వారిని కలిసినప్పుడు జార్జ్‌ టీమ్‌కు ఊహించని షాక్‌ ఎదురవుతుంది. అప్పుడే కథ మరో మలుపు తిరుగుతుంది. విలన్ల ఎత్తుకు పైఎత్తులు వేస్తూ జార్జ్‌ టీమ్‌ చివరకు వారిని పట్టుకోబోయే క్షణంలో.. ఊహించని ట్విస్ట్‌ ఎదురవుతుంది. క్లైమాక్స్‌ను సంతృప్తికరంగా మలిచారు.

ఎవరెలా చేశారంటే

జార్జ్‌ మార్టిన్‌గా మమ్ముట్టి సెటిల్డ్‌ పెర్ఫామెన్స్‌ ఇచ్చారు. కష్టకాలంలో సమయస్ఫూర్తితో మెలిగే ఆ పాత్ర ఆకట్టుకుంటుంది. టీమ్‌లీడ్‌ ఎలా ఉండాలో చాటి చెబుతుంది. ఎస్పీ మను చోళన్‌ పాత్రలో కిశోర్‌ ఒదిగిపోయారు. స్క్వాడ్‌ సభ్యులైన రోనీ డేవిడ్‌ రాజ్‌, అజీస్‌, షబరీశ్‌ వర్మ పాత్రల పరిధి మేరకు నటించారు. విలన్‌ రోల్స్‌ ప్లే చేసిన వారు ఓకే అనిపిస్తారు

సాంకేతికంగా.. 

టెక్నిషియన్ల పని తీరు బాగుంది. సుశిన్‌ శ్యామ్‌ అందించిన నేపథ్య సంగీతం పలు సన్నివేశాలను మరోస్థాయికి తీసుకెళ్లింది. కొన్ని సీక్వెన్సెస్‌లోని మహ్మద్‌ రహీల్‌ సినిమాటోగ్రఫీకి వావ్‌ అనాల్సిందే. ప్రారంభ సన్నివేశాలను ఎడిటర్‌ ప్రవీణ్‌ ప్రభాకర్‌ ఇంకాస్త కట్‌ చేయాల్సింది. మహ్మద్‌ షఫీ రాసిన కథ కొత్తగా లేకపోయినా కథనం ఆసక్తికరం. గతంలో మమ్ముట్టి హీరోగా వచ్చిన ‘ది గ్రేట్‌ ఫాదర్‌’ తదితర సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన రోబీ వర్గీస్‌ రాజ్‌ ఈ ‘కన్నూర్‌ స్క్వాడ్‌’తో దర్శకుడిగా మారారు. తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకులను మెప్పించగలిగారు(Kannur Squad Telugu Review).

ట్రెండింగ్ వార్తలు