September 9, 2022
సినిమా: ఒకే ఒక జీవితం(Oke Oka Jeevitham)
నటీనటులు: శర్వానంద్, రీతు వర్మ, అమలా అక్కినేని, నాజర్, వెన్నెల కిశోర్, ప్రియదర్శి, అలీ, మధునందన్, రవి రాఘవేంద్ర, యోగ్ జేపీ, జై ఆదిత్య, హితేష్, నిత్యరాజ్తదితరులు
సంగీతం: జేక్స్ బిజాయ్
కెమెరా: సుజిత్ సారంగ్
ఎడిటింగ్: శ్రీజిత్ సారంగ్
ఆర్ట్: ఎన్.సతీష్‌కుమార్
మాటలు: తరుణ్ భాస్కర్
దర్శకత్వం: శ్రీ కార్తిక్
నిర్మాతలు: ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు
సంస్థ: డ్రీమ్ వారియర్ పిక్చర్స్
విడుదల: సెప్టెంబర్9, 2022
శర్వానంద్ నుండి హిట్ సినిమా వచ్చి చాలా కాలం అయింది. ఈ మధ్య వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. విభిన్న కథలే ఎంచుకుంటున్నప్పటికీ ఒకే రకమైన యాక్టింగ్‌తో మోనాటమీ వచ్చేసింది. దాంతో శర్వానంద్ సినిమాలకు ఆదరణ తగ్గిపోతూ వచ్చింది. ఎలాగైన మంచి హిట్ కొట్టి మళ్లీ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు శర్వానంద్. ఈ సారి ఒకే ఒక జీవితం అంటూ టైమ్ ట్రావెల్ సినిమాతో పలకరించాడు. రీతువర్మ హీరోయిన్, చాలా కాలం తర్వాత అమల అక్కినేని కీలకపాత్రలో నటించారు. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఒకే ఒక జీవితం సినిమాతో శర్వా హిట్ అందుకున్నాడొ లేదో చదవేయండి.
కథ: ఆది (శర్వానంద్) ఇంట్రోవర్ట్ క్యారెక్టర్. పెద్ద గాయకుడు కావాలన్నది అతని కల. 20 ఏళ్ల క్రితం తన తల్లి (అమల) చనిపోయినప్పటి నుంచి మరీ ఒంటరివాడిలా ఫీలవుతుంటాడు. అతన్ని ఇష్టపడుతుంది వైషు అలియాస్ వైష్ణవి (రీతువర్మ). ఎలాగైనా అతనిలోని భయాన్ని పోగొట్టి పెద్ద గాయకుడిగా చూడాలన్నది ఆమె కల. ఆది చిన్ననాటి స్నేహితులు శీను, చైతూ. చిన్నప్పటి నుంచి చక్కగా చదువుకోకపోవడంతో శీను ఇళ్ల బ్రోకర్‌గా మారుతాడు. అమ్మాయిల్లో ఎప్పుడూ ఏదో వంక వెతికే చైతూకి ఎంతకీ పెళ్లి కాదు. ఇలా సాగుతున్న వారి జీవితంలోకి సైంటిస్ట్ పాల్ (నాజర్) ఎంటర్ అవుతాడు. ట్రైమ్ ట్రావెల్ చేసి గతంలోకి వెళ్లొచ్చు అని చెబుతాడు దాంతో అతనితోపాటు శీను, చైతూ కూడా ట్రావెల్ చేస్తారు. వాళ్లు అనుకున్నది జరిగిందా? లేదా? 20 ఏళ్లు వెనక్కి వెళ్లి ఆముగ్గురూ తమ బాల్యంలో మార్చాలనుకున్న విషయాలేంటి.? వాటి వల్ల వాళ్లకు కలిగిన కన్ఫ్యూజన్ ఏంటి? వారి భవిష్యత్తు మారిందా? లేదా? వంటివన్నీ ఆసక్తికరమైన అంశాలు.
ఎలా ఉందంటే..సిల్వర్ స్క్రీన్ మీద క్రేజ్ ఉన్న సబ్జెక్టుల్లో టైమ్ ట్రావెల్ ఎప్పుడూ ఉంటుంది. ఒకే ఒక జీవితం కూడా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో డిజైన్ అయిందే. టైమ్ ట్రావెల్ సబ్జెక్ట్‌ని పూర్తిగా టెక్నికల్‌గా అర్థం కాని భాషలో డంప్ చేయకుండా, ప్రతి సన్నివేశాన్ని సరదాగా తీర్చిదిద్దారు డైరక్టర్. చిన్ననాటి తమను కలుసుకునే ముగ్గురు యువకులు, వారి జీవితాలను మార్చడానికి వీరు పడే తపన, ఆ ఫ్రస్ట్రేషన్లో అనే మాటలు ప్రేక్షకుల్ని నవ్విస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా ఎవరూ ఊహించనిదే. ఇంట్రోవర్ట్ కొడుకును తీర్చిదిద్దే తల్లి కేరక్టర్‌కి అమల సూటయ్యారు. 20 ఏళ్ల క్రితం పోగొట్టుకున్న తల్లి మళ్లీ కళ్ల ముందు కదులుతుంటే అపురూపంగా, అబ్బురపడిపోయే చూసుకునే కొడుకు కుట్లుగా శర్వానంద్ తనలోని నటుడితో మెప్పించారు. ప్రియదర్శి, వెన్నెలకిశోర్ కామెడీ టైమింగ్‌కి ప్రేక్షకులు ఫిదా కావాల్సిందే. అన్నిటికన్నా ముందు మెన్షన్ చేయాల్సింది తరుణ్ భాస్కర్ రైటింగ్. తరుణ్ డైలాగులు నేచురల్‌గా ఉన్నాయి. స్క్రీన్‌ప్లేను సింప్లిఫై చేశాయి. మరీ లాజిక్కులు వెతక్కుండా సరదాగా సినిమా చూడాలనుకుంటే నచ్చుతుంది.
చివరగా..గతాన్ని మార్చి విధిని గెలవాలనుకోవడం కన్నా ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తూ, ఆనందంగా ముందుకు సాగిపోవడమే జీవితం అని చెప్పే కథే ఒకే ఒక జీవితం.