బబుల్ గమ్ రివ్యూ

December 29, 2023

బబుల్ గమ్

బబుల్ గమ్

  • Cast : రోషన్ కనకాల, మానస చౌదరి, చైతూ జొన్నలగడ్డ, అను హాసన్, హర్షవర్ధన్, బిందు చంద్రమౌళి, వైవా హర్ష తదితరులు
  • Director : రవికాంత్ పేరేపు
  • Producer : మహేశ్వరి మూవీస్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
  • Banner : మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
  • Music : శ్రీచరణ్ పాకాల

2 / 5

Bubblegum Movie Review: స్టార్ హీరోల వారసుల సినీరంగ ప్రవేశంలో ఎంతటి ఆసక్తి ఉంటుందో ఈ సినిమాకి కూడా దాదాపు అంతే అనడం అతిశయోక్తి కాదేమో. కారణం స్టార్ హీరోలకి తీసిపోని విధంగా ప్రేక్షకులకు చేరువైన సుమ తనయుడు, కనకాల వారి నట వారసత్వం అందిపుచ్చుకున్న రోషన్ కనకాల(Roshan Kanakala) కథానాయకుడిగా పరిచయమవుతుండటం. చిత్రం వివరాల్లోకి వెళ్తే…

హైదరాబాద్ లాంటి మహానగరంలో ఒక దిగువ మధ్య తరగతికి చెందిన యువకుడు ఆది (రోషన్ కనకాల) డీజేగా రాణించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని కలలు కంటుంటాడు. దానికోసం కొన్ని అవమానాలను సైతం భరించే ఆది, బాగా స్థితిమంతురాలైన జాహ్నవి (మానస చౌదరి)తో ప్రేమలో పడతాడు. అది అతడి జీవితంలో ఎలాంటి పరిస్థితులకి దారితీసింది. ఆది తన కలని ఎంతవరకు సాకారం చేసుకున్నాడన్నది క్లుప్తంగా బబుల్ గమ్ చిత్ర కథ.

ఈ కథ ఒక అమ్మాయి అబ్బాయి మధ్య 20 ఏళ్ళ ప్రాయంలో జరిగేదిగా అనుకుందామంటే, సాధారణంగా ప్రేమ చిగురించి మధ్యలో ఎడబాటుకి గురై చివరికి సుఖాంతం అయ్యే రకం కాదు. ఎదిగే క్రమంలో యువత తమని తాము తెలుసుకోవటం మరో ప్రధానాంశం.

పాత్రల తీరుతెన్నుల విషయానికొస్తే.. ఫిజికల్ గా ఉంటూ క్యాజువల్ రిలేషన్షిప్స్ కలిగి ఉండే నాగరికత నాయికది. కలిసి మెలగుతూ అమ్మాయిని ముట్టుకున్నా, పట్టుకున్నా సొంతం అనుకునేది నాయకుడి పాత్ర. పరిచయంలోనే తాను సీరియస్ రిలేషన్షిప్ కి దూరం అన్న ముందస్తు హెచ్చరిక జారీ చేసిన అమ్మాయితో సీరియస్ గా ప్రేమలో పడతాడు హీరో. హీరోయిన్ కూడా తర్వాత హీరోని గాఢంగా ప్రేమించేసి చనువుగా మెలుగుతుంది. దాంతో హీరో “తనలో ఏం నచ్చింది?” అని పదేపదే అడుగుతుంటాడు. (ఈ ప్రశ్న ప్రేక్షకులకి కూడా వస్తే అది వారి తప్పు కానేకాదు). ఇలా కొన్ని సాగదీత సన్నివేశాలతో ప్రథమార్థం గడుస్తుంది.

అంత ప్రేమించిన హీరోయిన్, హీరోని అనుకోని ఓ సందర్భంలో చూసి అతగాడిని అందరి ముందర ఘోరంగా అవమానిస్తే, ఈ అవమానం హీరోకి తన యొక్క ఇజ్జత్ (గౌరవం), ఔకత్ (స్థాయి) లను ప్రశ్నించేదిగా మారుతుంది. ఆ ఆవేశాన్ని హీరో తన ఆశయానికి ఆజ్యంగా వాడుకుని కల నెరవేర్చుకోవడం, హీరోయిన్ తన తప్పిదాన్ని తెలుసుకుని తిరిగి అతని ప్రేమని పొందాలనుకోవడంతో వంటి వాటితో ద్వితీయార్థం ముగుస్తుంది.

ఆర్థిక మరియు సామాజిక పరంగా రెండు విభిన్న నేపథ్యాలకు చెందిన పాత్రల నడుమ జరిగే కథగా డ్రామాకి చక్కని చోటు ఉంది. అయితే హీరోయిన్ అంత క్లియర్ గా చెప్పినప్పటికీ హీరో ఆశలు పెంచుకోవడం, వివాహ సంబంధం లేకుండా ఉన్న తల్లిదండ్రుల మధ్య పెరిగి రిలేషన్షిప్స్ ని పెద్దగా పట్టించుకోని హీరోయిన్ ఒకానొక సమయానికి కాళ్ళ వేళ్ళా పడి మరీ హీరోని ప్రేమించి పెళ్ళి వరకు వెళ్ళిపోవడం, అన్నేళ్ళుగా లివిన్ లో ఉన్న హీరోయిన్ తల్లిదండ్రులు ఉన్నట్టుండి పెళ్ళికి సిద్ధమవ్వడం (అదీ పీస్ ఆఫ్ పేపర్ అన్న క్లారిటీతో) వంటివి దర్శకుడు సమాధానం చెప్పని ప్రశ్నల్లా అనిపిస్తాయి.

నటీనటుల పరంగా చూస్తే కథానాయకుడిగా రోషన్ కి మంచి మార్కులే పడతాయి. సినిమా మొత్తంలో బాగా పండిన పాత్ర ఏదైనా ఉందంటే అది హీరో తండ్రి పాత్ర. అందులో చైతూ జొన్నలగడ్డ అభినయం ప్రేక్షకులను మెప్పిస్తుంది. కథానాయిక ఆ ప్రయత్నమేదో చేసినా, రూపకల్పన పేలవంగా ఉంది. అనుహాసన్, హర్షవర్ధన్, బిందు చంద్రమౌళి పరిధిమేర పర్వాలేదనిపించారు. బ్రహ్మానందం మరియు హీరో అమ్మమ్మ (తెలియనివారు గుర్తుపట్టే అవకాశం లేదు) రోషన్ ని ఆశీర్వదించడానికి అన్నట్టు తెరపై తళుక్కుమన్నారు.

కామెడీ కొన్ని సన్నివేశాల్లోనే పండటం మూలంగా సినిమాలోని చూపినట్టు వీగన్ అయిన కథానాయిక మాంసం దుకాణం దగ్గర ఎదురుచూస్తూ ఎంత అసహనానికి గురవుతుందో ఈ సినిమా చూసే ప్రేక్షకులు సైతం కొంతమేర అదే భావనకు గురవుతారు. హీరో జోష్, హీరోయిన్ తో రొమాన్స్ టార్గెట్ ఆడియన్స్ అయిన యువతను ఆకట్టుకునే అవకాశం ఉన్నా, కథానాయకుడు సడెన్ గా ఎదగటం లాంటివి కృతకంగా అనిపిస్తాయి. శ్రీచరణ్ పాకాల పాటల్లో రెండు చూసేంతసేపూ కాస్త ఎనర్జిటిక్ గా ఉన్నా గుర్తుండిపోయేవి ఏవీ లేవు. నేపథ్య సంగీతం ఓకే. పోరాట సన్నివేశాలు హీరోగా రోషన్ చేయగలడు అనిపించుకోడానికి అన్నట్టే ఉన్నాయి.

బాటమ్ లైన్ : ఈ బబుల్ గమ్ లో తియ్యదనం తక్కువ – సాగే గుణం ఎక్కువ

Read More: కుర్చీ మడతపెట్టి అంటోన్న మహేష్ బాబు.. ఫ్యాన్స్‌కు ట్రీట్

ట్రెండింగ్ వార్తలు