డెవిల్ మూవీ రివ్యూ

December 29, 2023

డెవిల్

డెవిల్

  • Cast : నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్, మాళవిక నాయర్, అజయ్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు
  • Director : అభిషేక్ నామా
  • Producer : అభిషేక్ నామా
  • Banner : అభిషేక్ పిక్చర్స్ & దేవాన్ష్ నామా
  • Music : హర్షవర్ధన్ రామేశ్వర్

2.5 / 5

Devil Movie Review: జయాపజయాలతో నిమిత్తం లేకుండా కొత్త కథలు, పాత్రలు చేసేందుకు ఎల్లప్పుడూ సుముఖంగా ఉండే నటుడు నందమూరి కళ్యాణ్ రామ్. డెవిల్ చిత్రం ద్వారా ఈ సారి కూడా అటువంటి ప్రయత్నాన్ని మరోమారు చేసారు. చిత్రసీమ అందించే ఈ చిత్ర సమీక్షలోకి వెళ్ళి చూస్తే..

బ్రిటిష్ ప్రభుత్వ పాలనా కాలంలో జరిగే కథ ఇది. భారత స్వతంత్ర సమర యోధుడైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను ఎలాగైనా అంతమొందించాలన్నది వారి లక్ష్యం. అయితే నేతాజీకి రక్షణ కవచంగా త్రివర్ణ అనే వ్యక్తి ఉన్నట్టు వారికి తెలుస్తుంది. అదే సమయంలో రాసపాడు అనే గ్రామంలోని ఒక జమీందారు కుటుంబంలో ఓ హత్య జరుగుతుంది. ఈ కేసు విచారణకై తమ సీక్రెట్ ఏజెంట్ అయిన డెవిల్ (నందమూరి కళ్యాణ్ రామ్)ను బ్రిటిష్ ప్రభుత్వం నియమిస్తుంది. ఈ కేసును డెవిల్ ఎలా పరిష్కరించాడు? అసలు త్రివర్ణ ఎవరు? నేతాజీ దళానికి జమీందారు కుటుంబానికి మధ్య ఏదైనా సంబంధం ఉందా? అన్నది తెరపైన చూడాల్సిందే. కథా వస్తువు ఇదే అయినప్పటికీ దీనిని మలిచిన తీరులో కొన్ని గందరగోళాలు ఉన్నాయి . అందులోని అనేకమైన పాత్రలు వాటి చుట్టూ అల్లబడిన డ్రామా ప్రేక్షకులని కథకి దూరంగా మరేదో గోళంలో తిప్పుతాయి. ముఖ్యంగా మొదటి భాగంలో. ఏజెంట్ గా హీరో ఇంట్రడక్షన్ ఫైట్, కేసు పరిశోధన పేరిట హీరోయిన్ తో రొమాన్స్, ఒక ప్రత్యేక గీతం లతో సగటు కమర్షియల్ సినిమాకి ఉండే అంశాలన్నీ ఇందులో ఉన్నాయి. మరోవైపు మర్డర్ కేసు మూలాన మిస్టరీగానూ అనిపిస్తుంది. దాంతో ఈ సినిమా ఏ జానర్ అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఇన్నిటి మధ్య అక్కడక్కడ తెరమీదికొచ్చే దేశభక్తి అన్నది చివర్లో కొంత రక్తి కట్టిస్తుంది. సినిమాని నిలబెట్టే ఏకైక విషయమిదే.

సినిమా ఆరంభమైన కాసేపటికి హీరో కేవలం హత్య కేసు కోసమే అక్కడికి రాలేదన్న విషయం బయటపడుతుంది. ఇకనైనా అసలు విషయం బయటపడుతుందేమో అనుకుంటే ఆ హత్య కేసుతో ముడిపడిన పాత్రలు ఏమైపోయాయో తెలిసేసరికే రెండోసగం సినిమా కూడా దగ్గర పడుతుంది. “మనసులో ఉన్నది మొహంలో కనపడకూడదు. మైండ్ లో ఉన్నది నోటి నుండి రాకూడదు అన్నది” హీరో పాత్రతో పలికించిన ఒకానొక సంభాషణ. తెర మీద జరిగేదానికి మాత్రం దీనితో పొంతన ఉండదు. హీరో సహా పాత్రలన్ని డైలాగుల మీద డైలాగులు చెప్తూనే ఉంటాయి. అయితే త్రివర్ణ పాత్రతో కథ మలుపు తిరగడంతో అక్కడి నుండి కథనం సాఫీగా సాగుతుంది. ఈ క్రమంలో వచ్చే పోరాట సన్నివేశాలు యాక్షన్ ప్రేమికులకు నచ్చుతాయి.

తారాగణంలో కళ్యాణ్ రామ్ తోపాటు నైశదగా సంయుక్త మీనన్, మణిమేఖలాగా మాళవిక నాయర్ పాత్రల్లోనే బలం ఉంది. మిగతావారిలో అజయ్, ఉత్తేజ్, సీత, సత్య, మహేశ్, ఎస్తేర్, చంద్రశేఖర్, షఫీ, శ్రీకాంత్ అయ్యంగార్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ బాగా పెద్దదే. పాటల్లో తెరమీద రొమాంటిక్ సాంగ్ బాగానే ఉంది. హర్షవర్ధన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాలు మినహా సుమారుగానే ఉంది. సీజీ వర్క్ చూస్తే ఈ కాలంలో సినిమాయేనా అనిపిస్తుంది.

Read More: మొత్తం కనిపించేలా వేసుకుందే.. నందినీ రాయ్ పరువాల ప్రదర్శన

ట్రెండింగ్ వార్తలు