The Railway Men Telugu Review: హృదయ విదారక దుర్ఘటన

November 22, 2023

ది రైల్వేమెన్‌

ది రైల్వేమెన్‌

  • Cast : కేకే మేనన్‌, దివ్యేందు, మాధవన్‌, బాబిల్‌ఖాన్‌, సున్నీ హిందూజా, జుహీచావ్లా, మందిరాబేడి
  • Director : శివ్‌ రావైల్‌
  • Producer : యశ్‌రాజ్‌
  • Banner : యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌
  • Music : సామ్‌ స్లాటర్‌

3.25 / 5

The Railway Men Telugu Review: స‌స్పెన్స్ క్రైమ్ థ్రిల్ల‌ర్స్ తో పాటు వాస్త‌వ‌ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న వెబ్‌సిరీస్‌లకు ఈ మధ్య కాలంలో మంచి ప్రేక్ష‌కాద‌ర‌ణ ల‌భిస్తోంది, అందుకే అలాంటి కంటెంట్ అందివ్వ‌డానికి ఓటీటీలు పోటీ ప‌డుతున్నాయి. ఆ కోవ‌లోనే తెర‌కెక్కిన వెబ్‌సిరీస్‌ ‘ది రైల్వేమెన్‌’. భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన నాటి పరిస్థితుల ఆధారంగా ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిల్మ్స్ ఈ వెబ్‌సిరీస్‌ను ఆవిష్క‌రించింది. మరి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సిరీస్‌ ఎలా ఉంది? ఆనాటి పరిస్థితులను కళ్లకు కట్టిందా? లేదా మీరే చ‌ద‌వండి.

కథ విష‌యానికి వ‌స్తే..

ఇఫ్తికార్‌ సిద్ధిఖీ (కేకే మీనన్) భోపాల్ రైల్వే స్టేషన్‌లో స్టేషన్ మాస్టర్‌. మంచి మనసున్న మనిషి. ఆయనంటే ఆ స్టేషన్‌లో పనిచేసే ప్రతి ఒక్కరికీ గౌరవం. ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా.. ఆపద వచ్చినా ఆదుకోవడంలో సిద్ధిఖీ ముందుంటాడు. మరోవైపు భోపాల్‌ నడిబొడ్డులో యూనియన్‌ కార్బైడ్‌ ఫ్యాక్టరీని ఓ విదేశీ సంస్థ నిర్వహిస్తూ ఉంటుంది. భద్రత విషయంలో కనీస ప్రమాణాలు కూడా పాటించదు. ఫ్యాక్టరీలోని లోపాలను సీనియర్‌ వర్కర్లు ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్తే కంపెనీ నష్టాల గురించి మాట్లాడుతాడు తప్ప, మిగిలినవి ఏవీ పరిగణనలోకి తీసుకోరు.

ఆ కర్మాగారానికి ఉన్న పక్క బస్తీలోనే నివసిస్తుంటాడు ఇమద్ (బాబిల్ ఖాన్). కొన్ని రోజుల పాటు అదే ఫ్యాక్టరీలో పనిచేసిన ఇమద్‌.. తనతో పాటు పనిచేస్తున్న సోదరుడులాంటి స్నేహితుడు కన్నుమూయడంతో పని మానేసి రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీలో వర్కర్‌గా చేరతాడు. ఇమద్‌ ద్వారా యూనియన్‌ కార్బైడ్‌ ఫ్యాక్టరీలో లోపాలున్న విషయం తెలుసుకున్న రిపోర్టర్ (సన్నీ హిందూజ) అందుకు సంబంధించి ఇచ్చిన నివేదిక కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ రోజు రాత్రి యూనియన్‌ కార్బైడ్‌ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్‌ లీక్‌ అవుతుంది.

ఫ్యాక్టరీ పరిసరాలను దాటి నెమ్మదిగా భోపాల్‌ మొత్తం ఆ గ్యాస్‌ వ్యాపిస్తుంది. ఆ సమయంలో భోపాల్‌ ప్రజల పరిస్థితి ఏంటి? ఆ విష వాయువుకు ఎలా బలైపోయారు? (The Railway Men Telugu Review) భోపాల్‌ రైల్వేస్టేషన్‌లో ఉన్న ప్రయాణికులను కాపాడేందుకు ఇఫ్తికార్‌ సిద్ధిఖీ, ఇమద్‌లు చేసిన ప్రయత్నాలు ఏవి? భోపాల్‌ గ్యాస్‌లీక్ ఘటన విషయం తెలిసిన సెంట్రల్‌ రైల్వేస్‌ జీఎం రతి పాండే (మాధవన్‌) చేసిన సాహసం ఏంటి? తెలియాలంటే సిరీస్‌ చూడాల్సిందే!

ఎలా ఉందంటే..

ప్రకృతి వైపరీత్యాలైన వరదలు, భూకంపాలు, సునామీ, వంటి వాటిని నిత్యం మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ చావు నుంచి తప్పించుకుని మృత్యుంజయులుగా నిలిచిన వాళ్లు ఎందరో. కానీ, మానవ తప్పిదాలు, నిర్లక్ష్యాల కారణంగా చరిత్ర పుటల్లో నిలిచిన చీకటి అధ్యాయాలు ఎన్నో ఉన్నాయి. అందులో అత్యంత ఘోరమైన సంఘటన ‘భోపాల్‌ గ్యాస్‌ లీక్‌’. 1984 డిసెంబరులో చోటు చేసుకున్న ఈ ఘోరకలికి దాదాపు 15వేల మంది అమాయకులు బలైపోయారు. ఆ దుర్ఘటన ఇతివృత్తంగా హృదయాలను ద్రవింపజేసేలా ‘ది రైల్వేమెన్‌’ను (The Railway Men Telugu Review) తీర్చిదిద్దడంలో దర్శకుడు శివ్‌ రావైల్‌ సక్సెస్‌ అయ్యాడు. సిరీస్‌ మొదటి ఎపిసోడ్‌లో ‘మన దేశంలో పప్పు ఉప్పూ కన్నా చౌకగా లభించేది సామాన్యుడి జీవితం’ అనే డైలాగ్‌ వినిపిస్తుంది. కాలాలకు, సంవత్సరాలకు, ప్రభుత్వాలకు అతీతంగా పాలకుల నిర్లక్ష్యానికి సమిధులుగా మారుతున్న సామాన్యుడిని జీవితానికి ఇది సరైన నిర్వచనం.

భోపాల్‌ జంక్షన్‌ స్టేషన్‌ మాస్టర్‌ అయిన, ఇఫ్తికార్‌ సిద్ధిఖీ పాత్ర పరిచయంతో సిరీస్‌ను ప్రారంభించిన దర్శకుడు ఎక్కువ సమయం తీసుకోకుండా యూనియన్‌ కార్బైడ్‌ ఫ్యాక్టరీ లోపాలతో నేరుగా తర్వాత ఏం జరగబోతోందో చెప్పే ప్రయత్నం చేశాడు. గతంలో ఫ్యాక్టరీలో పనిచేసిన ఇమద్‌ పాత్ర ద్వారా అందులో ఎంతటి భయంకరమైన రసాయనాన్ని నిల్వ చేస్తున్నారో చెప్పించాడు. ఒకవేళ అది లీక్‌ అయితే, పరిస్థితి ఎలా ఉంటుందో చనిపోయిన అతడి స్నేహితుడి పోస్ట్‌మార్టం సన్నివేశం ద్వారా చూపించిన తీరు భయానకంగా ఉంటుంది.

అక్కడి నుంచి నెమ్మదిగా ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ అందరినీ భోపాల్‌ జంక్షన్‌కు తీసుకొచ్చాడు దర్శకుడు. (The Railway Men Telugu Review) కమ్యూనికేషన్‌ వ్యవస్థను పునరుద్ధరించే పనులు పర్యవేక్షించడానికి స్టేషన్‌ మాస్టర్‌ అయిన ఇఫ్తికార్‌ ముందే స్టేషన్‌కు రావడం, మరోవైపు అక్కడ పనిచేసే విజయ అనే మహిళ కుమార్తె వివాహ వేడుక అట్టహాసంగా జరుగుతుండటం, మరోవైపు కార్బైడ్‌ ఫ్యాక్టరీలో పని మానేసి భోపాల్‌ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీలో ఉద్యోగంలో చేరే ఇమద్‌.. భోపాల్‌ రైల్వేస్టేషన్‌లో ఉన్న సొత్తును కాజేయడానికి వచ్చిన దొంగ (దివ్యేందు శర్మ).. కార్బైడ్‌ ఫ్యాక్టరీ లోపాలకు సంబంధించిన ఆధారాలను సంపాదించి ప్రపంచానికి చెప్పాలనుకునే విలేకరి.. ఇలా ప్రతి పాత్రను డీటెలింగ్‌గా చూపించారు.

గ్యాస్‌ లీకైతే వీళ్ల పరిస్థితి ఏంటి? అన్న ఉత్కంఠ సిరీస్‌ చూస్తున్న ప్రేక్షకుడిని తొలిచేస్తుంటుంది. కార్బైడ్‌ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్‌ లీక్‌ కావడం మొదలైన తర్వాత కథనం పరుగులు పెడుతుంది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఎక్కడి వారు అక్కడ సొమ్మసిల్లి పడిపోతూ ఉంటారు. అసలేం జరుగుతుందో తెలియని దుస్థితిలో, తాము ఎందుకు చనిపోతున్నామో తెలియకుండా వేల మంది ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతూ ఉంటాయి.

(The Railway Men Telugu Review) పశువులు, పక్షులు, చెట్లు ఒక్కటేంటి? కార్బైడ్‌ ఫ్యాక్టరీకి చుట్టు పక్కల సజీవంగా ఉన్న ప్రతి జీవి మృత్యుకుహరంలోకి వెళ్లిపోతుంది. వందల సంఖ్యలో జనాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని, దొరికిన వాహనాన్ని పట్టుకుని పరుగులు పెడుతూ ప్రాణాలు విడిచే ఘటనలు హృదయ విదారకంగా ఉంటాయి. ఎన్నో ఆశల మధ్య తన కుమార్తె వివాహం జరుగుతోందని సంతోష పడిన విజయ, డబ్బులు సరిపోకపోవడంతో అప్పు కోసం స్టేషన్‌ మాస్టర్‌ ఇఫ్తికార్‌ వద్దకు వచ్చి, ఆయన ఇచ్చిన డబ్బులను తీసుకుని వెళ్తూ కన్నుమూసే ఘటన కన్నీళ్లు పెట్టిస్తుంది.

విష వాయువు భోపాల్‌ రైల్వేస్టేషన్‌ను కమ్మేసిన తర్వాత పరిస్థితులు మరింత క్లిష్టంగా మారిపోతాయి. ఈ విషవాయువు నుంచి స్టేషన్‌లో ఉన్న వందల మంది ఎలా బయట పడతారా? అన్న ఉత్కంఠ తొలిచేస్తుంది. ఒకవైపు కమ్యూనికేషన్‌ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం.. మరోవైపు వందల మంది ప్రయాణికులతో భోపాల్‌ జంక్షన్‌కు వస్తున్న గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రాకుండా అడ్డుకునేందుకు చేసే ప్రయత్నాలు, ఇంకోవైపు స్టేషన్‌లోనే ప్రయాణికులను కాపాడేందుకు ఇఫ్తికార్‌, ఇమద్‌లు చేసే సాహసం తదితర సన్నివేశాలతో స్క్రీన్‌ప్లే మొత్తం రేసీగా సాగుతుంది. పక్క స్టేషన్‌కు ఇన్‌స్పెక్షన్‌కు వచ్చిన సెంట్రల్‌ రైల్వేస్‌ జీఎం రతి పాండే ఎంట్రీతో కథ మరో మలుపు తిరుగుతుంది.

(The Railway men Telugu Review) భోపాల్‌ చేరుకునే గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికులను కాపాడేందుకు ఆయన తీసుకునే నిర్ణయాలు కథపై మరింత ఆసక్తిని పెంచుతాయి. ఒకవైపు రిలీఫ్ వ్యాన్‌తో రతి పాండే భోపాల్‌కు పయనమవడం, మరోవైపు భోపాల్‌ స్టేషన్‌కు గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ దూసుకు వస్తుండటం ఈ రెండు రైళ్లు ఢీకొంటాయా? అన్న ఉత్కంఠ ప్రేక్షకుడిని ఊపేస్తుంది. ఆ ప్రమాదం ఎలా తప్పిందో తెరపై చూస్తే మజా ఉంటుంది. గ్యాస్‌ లీక్‌ దుర్ఘటన తర్వాత భోపాల్‌లో ప్రజల దుస్థితి ఎలా ఉందో చూపించే సన్నివేశాలు హృదయాలను బరువెక్కిస్తాయి.

ఎవరెలా చేశారు..

మంచితనానికి మారుపైనే స్టేషన్‌ మాస్టర్‌ ఇఫ్తికార్‌ పాత్రలో కేకే మేనన్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేం. తన స్నేహితుడి మాదిరిగా స్టేషన్‌లో ఉన్న ప్రయాణికుల ప్రాణాలు పోకూడదని పాకులాడే సగటు యువకుడిగా ఇమద్‌ పాత్రలో బాబిల్‌ఖాన్‌ జీవించాడు. ఇక భోపాల్‌ జంక్షన్‌లో దొంగతనం చేయడానికి వచ్చి, మనసు మార్చుకుని, ప్రయాణికులు సాయం చేసే వ్యక్తిగా దివ్యేందు శర్మ చక్కగా నటించారు. ఉత్కంఠగా సాగే సిరీస్‌లో ఈ పాత్రే కాస్త రిలీఫ్‌. విలేకరిగా సున్నీ హిందూజా, జీఎంగా మాధవన్‌, జుహీ చావ్లా, మందిరాబేడీ ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రకు న్యాయం చేశారు.

టెక్నికల్‌గా..

ఈ సిరీస్‌ కోసం టెక్నికల్‌ టీమ్‌ పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. ట్రాజెడీ సన్నివేశాలకు సామ్‌ స్లాటర్‌ నేపథ్య సంగీతం ప్రాణం పోసింది. రూబైస్‌ సినిమాటోగ్రఫీ సిరీస్‌ను మరోస్థాయిలో నిలబెట్టింది. రాత్రి సన్నివేశాలు, లైటింగ్‌ ఎఫెక్ట్‌, 1984 నాటి పరిస్థితులను రీక్రియేట్‌ చేసి చూపించడం చాలా బాగుంది. ఎక్కడా అవుట్‌ ఆఫ్‌ ది బాక్స్‌ వెళ్లలేదు. భోపాల్‌ గ్యాస్‌ లీక్‌ ఘటన, అప్పటి వాస్తవ పరిస్థితులను ఆధారంగా తీసుకుని ఒక సర్వైవల్‌ థ్రిల్లర్‌ను ఉత్కంఠగా చూపించిన శివ్ రావైల్‌కు మంచి మార్కులే పడతాయి. సిరీస్‌ నిడివి నాలుగు గంటలు.. ప్రతి సన్నివేశాన్ని డీటెలింగ్‌గా చెప్పే క్రమంలో చాలా చోట్ల డాక్యుమెంటరీ చూసిన భావన కలుగుతుంది. దీన్నొక వెబ్‌సిరీస్‌గా కాకుండా సినిమాగా రెండున్నర, మూడు గంటల్లోపే చూపించి ఉంటే, ఎఫెక్టివ్‌గా ఉండేది. అది తప్పితే సిరీస్‌ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది.

బాట‌మ్ లైన్‌: గుండెబ‌రువెక్కించే విషాద‌సంఘ‌ట‌న‌ Read MoreKannur Squad Telugu Review: ప్రేక్ష‌కుల‌ని మెప్పించే ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్‌

ట్రెండింగ్ వార్తలు