Mangalavaaram Review: విలేజ్ రివెంజ్ సస్పెన్స్ డ్రామా

November 17, 2023

మంగ‌ళ‌వారం

మంగ‌ళ‌వారం

  • Cast : పాయల్ రాజ్‌పుత్, అజ్మల్ అమీర్, శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్, లక్ష్మణ్ తదితరులు
  • Director : అజయ్ భూపతి
  • Producer : స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం
  • Banner : ముద్ర మీడియా వర్క్స్
  • Music : అజనీష్ లోక్‌నాథ్

2.25 / 5

ఆర్ ఎక్స్ 100(RX100)..కార్తికేయ‌(Karthikeya), పాయ‌ల్‌రాజ్‌పూత్‌(Payal Rajput), అజ‌య్ భూప‌తి(Ajay Bhupathi) వీరి ముగ్గురి కెరీర్స్‌రి సెట్ చేసిన చిత్రం. ఆ మూవీ త‌ర్వాత ఈ ముగ్గురు మ‌రోహిట్ కోసం చాలానే క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింది. ఐదారు ప్లాఫులు వ‌చ్చాయికాని హిట్ మాత్రం రాలేదు ఏ ఒక్క‌రికీ.. ఈ సంవత్స‌రంలో కార్తికేయ బెదురులంక‌(Bedurulanka)తో ప‌ర్వాలేద‌నిపించుకున్నాడు.. కానీ అజ‌య్ భూప‌తి, పాయ‌ల్ మాత్రం హిట్ కోసం త‌పిస్తూనే ఉన్నారు. ఇలాంటి స‌మ‌యంలో పాయ‌ల్ రాజ్‌పూత్ హీరోయిన్‌గా అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మే మంగ‌ళ‌వారం(Mangalavaaram). ఈ మధ్య కాలంలో సినిమాపై కావల్సినంత బజ్ క్రియేట్ చేసిన ట్రైలర్… ప్రచార చిత్రాలన్నీ హైప్ ని పెంచడంతో మంగ‌ళ‌వారం అందరి ద్రుష్టిని ఆకర్షించింది. మరీ  మంగళవారం(Mangalavaaram Telugu Review)లోని మలుపులు ప్రేక్షకులని అలరించాయా ?  లేదా అన్న‌ది ఇప్పుడు చూద్దాం.

క‌థ‌: అది 90వ దశకంలోని మాలక్ష్మీపురం అనే ఊరు. ఆ ఊర్లో రెండు జంట హత్యలు కలకలం రేపుతాయి. ఎవరో గుర్తుతెలియని వ్యక్తి అక్రమ సంబంధాలు పెట్టుకున్న ఆడ, మగ పేర్లు గోడలపై రాస్తారు. ఆ త‌ర్వాత‌ మంగళవారం రోజున ఆ జంట అనుమానస్పదంగా చనిపోతుంది. ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్ఐ మీనా (నందితా శ్వేత) ఆ జంటది హత్యని అనుమానపడుతుంది. పోస్ట్ మార్టంకు బాడీలని తరలించడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంటాడు ఊరి జమీందారు ప్రకాశం బాబు (చైతన్య కృష్ణ). ఇది పరువు ఆత్మహత్యని, పోలీసుల జోక్యం అవసరం లేదని చెబుతాడు. మళ్ళీ అదే తరహాలో మరో జంట పేరు గోడపై రాయడం.. ఆ జంట మంగళవారం రోజున ఉరి వేసుకుని చనిపోవడంతో మ‌రోసారి ఊర్లో క‌ల‌క‌లం రేగుతుంది. దీంతో ఊరి వాళ్ల‌కు భయం పట్టుకుంటుంది. అసలు ఈ పేర్లు ఎవరు రాస్తున్నారు ? ఎవరు చంపుతున్నారో తెలీక‌ ఊర్లో జనం అర్ధరాత్రులు గాలించడం మొదలుపెడతారు. ఆ స‌మ‌యంలో ఎలాంటి నిజాలు వెలుగులోకి వచ్చాయి? ఈ కథలో శైలజ (పాయల్) ఎవరు? ఆమెకు రెండు జంటలు చనిపోవానికి కారణం ఏమిటి? ఇవన్నీ తెరపై చూడాలి.

ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టినప్పటి నుంచి ఈ సినిమా ద్వారా ఇండియన్ సినీ హిస్టరీ లోనే టచ్ చేయని ఒక పాయింట్ను టచ్ చేస్తున్నామని అజయ్ భూపతి అండ్ టీం పెద్ద ఎత్తున చెబుతూ వచ్చింది. అసలు ఇంతలా ఎవరు టచ్ చేయని పాయింట్ ఏముంటుంది అనేది సినిమా చూసిన తర్వాత క్లారిటీ వచ్చేసింది. సినిమా మొదటి భాగం అంతా పాత్రల పరిచయం చేయడం కోసమే తీసుకున్నాడు అజయ్ భూపతి.. అందుకే కథనం చాలా నెమ్మదిగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది.  కాక‌పోతే మనం నిజంగానే ఆ ఊరిలో ఉన్నామేమో మన కళ్ళ ముందుకు ఏదో పరిగెత్తుకుని వస్తుందేమో అని భయపెట్టేలా తెరకెక్కించడంలో కొంత వ‌ర‌కూ సఫలం అయ్యాడు. శైలు ఎంట్రీతో సినిమా మొదలుపెట్టిన అజయ్ భూపతి ఇంటర్వెల్ కి వచ్చేసరికి అదే శైలు పెద్దయి కాలేజీకి వెళుతున్నట్లు చూపించాడు. అక్కడి నుంచి ఆమె కాలేజీకి వెళ్లడం, ఒకరితో ప్రేమలో పడటం, ఆ తర్వాత అతని చేతిలో మోసపోవడం ఎవరూ ఊహించని ఒక రకమైన జబ్బుకి గురి కావడం లాంటి విషయాలన్నీ ఆసక్తికరంగా తెరకెక్కించాడు. అయితే ఎందుకో ఇవన్నీ కొంత రియాలిటీకి దగ్గరగా అనిపించవు. కానీ పాయల్ పాత్రతో చెప్పించిన పాయింట్ నిజంగానే ఎక్కడా డిస్కస్ చేయని పాయింట్ అనే చెప్పాలి. నిజానికి ఈ సినిమా అంతా 1986- 1996 మధ్య జరుగుతున్నట్లు చూపించారు కానీ ఎందుకో కొన్ని సన్నివేశాలు రియాలిటీకి దగ్గరగా అనిపించలేదు. సినిమాటిక్ లిబర్టీ గట్టిగా వాడినట్లు అనిపించింది. చివరి ఇరవై నిమిషాల్లో వచ్చే మలపుల్ని బాగానే తీర్చిదిద్దారు. అందులో కొన్ని మలుపులు థ్రిల్ చేస్తే.. ఇంకొన్ని మాత్రం అవసరానికి మించి వున్నట్లు అనిపిస్తాయి. పైగా ఇందులో చాలా సన్నివేశాలని ప్రేక్షకులని ఏమార్చడానికి, ట్రైలర్ కట్ కోసం పెట్టుకున్నట్లు అనిపిస్తాయి. కొన్ని ప్ర‌శ్న‌ల‌కు కూడా ద‌ర్శ‌కుడు స‌మాధానం ఇవ్వ‌లేదు. ఈ హ‌త్య‌ల‌న్నీ మంగ‌ళ‌వార‌మే ఎందుకు జ‌ర‌గాలి? అస‌లు శైల‌జని ద‌య్యంగా ఎందుకు చూపించాడు? అస‌లు అక్ర‌మ సంబంధాల‌కూ, ఈ క‌థ‌కు లింకు ఇవ్వాల్సిన అవ‌స‌రం ఏమిటి? అనేది అంతు చిక్క‌దు.

ఈ సినిమా సంగీత దర్శకుడు అజ‌నీష్‌ తెరవెనుక హీరో అనుకోవాలి. త‌న సౌండ్ డిజైనింగ్ అదిరిపోయింది. కొన్ని సౌండ్ ట్రాకులు టెర్రిఫిక్ గా రిజిస్టర్ అవుతాయి. ఊర్లో ర‌క‌ర‌కాల పాత్ర‌లు, వాటి నేప‌థ్యాలు, అమ్మ‌వారి ఆల‌యం, ఊరి పెద్ద‌, డాక్ట‌రు, ఓ చెప్పుకోలేని స‌మ‌స్య‌తో బాధ ప‌డుతున్న అమ్మాయి.. ఇలా చాలా పార్శ్వాలు, లెక్క‌లేన‌న్ని పాత్ర‌లూ సెట్ చేసుకొన్నాడు. థ్రిల్ల‌ర్‌, హార‌ర్‌, ఎమోష‌న‌ల్‌… ఇలా చాలా యాంగిల్స్ లో ఈ క‌థ‌ని చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. ఇన్ని పాత్ర‌లూ, ఇన్ని కోణాలూ ఉండేస‌రికి.. దేనికీ స‌రైన న్యాయం చేయ‌లేదేమో అనిపిస్తోంది. అక్క‌డ‌క్క‌డ ద‌ర్శ‌కుడి ప‌నిత‌నం క‌నిపిస్తుంది. కొన్ని చోట్ల సాంకేతిక నిపుణుల నైపుణ్యం ద‌ర్శ‌న‌మిస్తుంది. ద‌ర్శ‌కుడి ప్రయత్నం చివరి ఇరవై నిముషాలు కుదిరినంతగా సినిమా మొత్తం కుదరలేదు. చాలా విషయాల్లో కావాల్సిన దానికంటే ఎక్కువ లిబర్టీ తీసుకున్నాడు. శైలు క్యారెక్టర్ ని ఉద్దేశించి డాక్టర్ ‘అసలు ఆ అమ్మాయి సమస్య ఈ వూర్లో ఎవరికైనా అర్ధమౌతుందా’ అంటాడు. నిజమే ఆ పాత్ర పెయిన్ ని తెలియజేసే బాధ్య‌త దర్శకుడిపై వుంది. కానీ దీనిపై సరైన కసరత్తు చేయలేదు. ఆ పాత్ర మూలాల్ని పట్టుకోలేదనిపించింది. ఆ పాత్రని సస్పెన్స్ థ్రిల్లర్ కి జోడించడంలో మరింత నేర్పు చూపించాల్సింది. డైలాగ్స్ కనెక్ట్ అయ్యేలా, గుచ్చుకునేలా రాశారు తాజుద్దీన్, రాఘవ్ పసుపుల. నిర్మాతలకు ఇది మొదటి సినిమా అనిపించదు ఎందుకంటే నిర్మాణ విలువలు విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు.

పాయల్ కే కాదు తెలుగు ప్రేక్షకులకు ఇది కొత్త పాత్ర. ఆ పాత్ర చేయడానికి కాస్త సాహసం కావాలి. దర్శకుడిపై నమ్మకంతో ఆ పాత్ర చేయడానికి ముందుకు వచ్చింది పాయల్. తన వరకూ చక్కగా చేసింది. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ఆకట్టుకుంది. అయితే కొన్ని చోట్ల శృతి మించిన ఎమోషన్ అనిపిస్తుంది. అంతే కాకుండా.. శైలు పాత్రని పూర్తిగా సెకండ్ హాఫ్ కే పరిమితం చేశాడు దర్శకుడు. దీంతో ఆ పాత్రతో ప్రేక్షకుడి అంత కనెక్షన్ ఏర్పడదు. పైగా ఫస్ట్ హాఫ్ అంతా టూమచ్ బిల్డప్ తో కాంతార తరహాలో ఏదో డివైన్ ఎలిమెంట్ వుందని భ్రమ కలిగించాడు దర్శకుడు. అయితే చివరిలో ఇచ్చిన మెసేజ్ మాత్రం అభినందనీయం. ఎస్ఐ పాత్రలో చేసిన నందిత రగ్గడ్ గా కనిపించింది అంతే ఆ క్యారెక్ట‌ర్‌ని మాత్రం స‌రిగ్గా పోట్రే చేయ‌లేక‌పోయింది. ఈ విలేజ్ రివెంజ్ సస్పెన్స్ డ్రామాకి అజయ్ ఘోష్ పాత్ర కాస్త రిలీఫ్. ఆయన మాటలు, గెటప్. నటన భలే కుదిరాయి. జమిందారు ప్రకాశంగా చైత‌న్యతో పాటు మిగతా పాత్రల్నీ పరిధిమేర వున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో ప్రియదర్శి నటించాడనే విషయాన్ని ఇప్పటి వరకు దాచి ఉంచి సినిమాలో ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ గా ఉంచారు. ప్రియదర్శి కనిపించింది చాలా తక్కువ సేపు అయినా నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు, కానీ ఆయన కన్నా మంచి క్రేజ్ ఉన్న హీరోతో చేయిస్తే సినిమాకి బాగా బూస్ట్ అయ్యేది.

ఫైన‌ల్‌గా మంగ‌ళ‌వారం మీ అంచ‌నాల‌కు అందుకుందా?  లేదా అనేది కామెంట్ రూపంలో తెలియ‌జేయండి.

Read More: Japan Movie Review: నిరాశ‌ప‌రిచే బోరింగ్ డ్రామా

ట్రెండింగ్ వార్తలు