November 30, 2021
సిరివెన్నెల సీతారామశాస్త్రి(66) అనారోగ్యంతో హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. “ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న సీతారామశాస్త్రి గారు మంగళవారం సాయంత్రం 4.07 గంటలకు మృతి చెందారని కిమ్స్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సీతారామశాస్త్రి కన్నుమూత చిత్ర పరిశ్రమకు తీరని విషాదాన్ని మిగిల్చింది. మహోన్నత ప్రజ్ఞాశాలిని కోల్పోయామని సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు
కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సిరివెన్నెల (1986) సినిమాతో సినీ గేయరచయతగా అందరి దృష్టినీ ఆకర్షించిన చేంబోలు సీతారామశాస్త్రి ఆ చిత్రం పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్నారు. అయితే, ఆయన సినీ రంగానికి పరిచయమైంది మాత్రం అంతకు రెండేళ్ల ముందు వచ్చిన ‘జననీ జన్మభూమి’ చిత్రంతో. ఆ చిత్రానికి కూడా కె. విశ్వనాథే దర్శకుడు. తొలి సినిమాలో సీహెచ్ సీతారామశాస్త్రి (భరణి) అనే పేరుతో ఆయన ‘తడిసిన అందాలలో…’ అనే పాట రాశారు.
శ్రీ (సిరివెన్నెల) సీతారామశాస్త్రిగారు కీర్తిశేషులు శ్రీ చేంబోలు వేంకట యోగి, శ్రీమతి సుబ్బలక్ష్మి దంపతులకు ప్రథమ సంతానంగా, 1955 మే 20న మధ్యప్రదేశ్లోని, శివినిలో జన్మించారు. పూర్తి పేరు చేంబోలు సీతారామశాస్త్రి.
15 భాషల్లో ప్రవేశము, సంస్కృత, ఆంగ్ల, ఆంధ్ర, ఉర్దూ, హిందీ, పార్శీ, అరబిక్, భాషల్లో పాండిత్యము, గణితము, విజ్ఞాన శాస్త్రము, గణాంక శాస్త్రము, తర్కము, వ్యాకరణ, మీమాంస ఇత్యాది వైదిన శాస్త్రాల్లో విశేష ప్రతిభ గలిగిన శ్రీ సి.వి.యోగిగారు అరుదైన మహామేథావి.
కొద్దిపాటి సంస్కృత భాషా పరిచయం, భగవద్గీత కంఠోపాఠం, శ్రీ శంకర భగవత్పాదుల వారి శివానందలహరి, ఇత్యాది స్తోత్ర వాజ్ఞ్మయం వృద్ధతం కావడం, పోతనామాత్యుని భాగవతంలో అష్టమస్కంధం నోటికి రావడం, గణితశాస్త్ర పరిచయం, ఇత్యాది విద్యాగంధం తండ్రిగారి నుండి సీతారామశాస్త్రికి సంక్రమించింది.
1971లో కాకినాడ ఆదర్శ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, 1973లో పి.ఆర్.కాలేజీలో బి.కామ్‌లో చేరారు. 1974 సెప్టెంబరులో టెలిఫోన్స్ శాఖలో అసిస్టెంటుగా ఉద్యోగంలో ప్రవేశించడం, 1974లో రాజమండ్రి, 1975లో తాడేపల్లిగూడెంలో పనిచేసిన తర్వాత 1976లో కాకినాడకి ట్రాన్సఫర్ అయి 1983 దాకా 7 సం॥ కాకినాడలో ఉద్యోగం చేయడం జరిగింది.
సినీ గేయ రచయిత ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని మరో కోణంలో చూడగలిగిన వారికి ఆయనలో ఓ తాత్వికుడు, ఓ మేధావి కనబడతారు.
ఆయనలోని ఈ కోణాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నంగా హైదరాబాదులో 1999 సం.లో ‘సిరివెన్నెల క్రియెషన్స్ ప్రై. లిమిటెడ్’ అనే సంస్థని స్థాపించడం జరిగింది. ఈ సంస్థ మూలధనం శాస్త్రి గారి రచనలు, లలితగీతాలు, భక్తిగీతాలు, జానపద గీతాలు, ఆయన తాత్వికపరంగా రచించిన వ్యాసాయి. ఈ రచనలన్నింటినీ ప్రజల్లోకి చేర్చడమే ఈ సంస్థ ముఖ్యోద్దేశం.
శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు ఇప్పటి వరకు దాదాపు 600 చిత్రాలలో దాదాపు 3000 పాటల వరకు. రచించారు.