April 20, 2024
టాలీవుడ్ హీరో నిఖిల్ గురించి మనందరికీ తెలిసిందే. నిఖిల్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. దానికి తోడు నిఖిల్ నటించిన సినిమాలు ఈ మధ్య కాలంలో వరుసగా సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి. అందులో భాగంగానే నిఖిల్ నటించిన కార్తికేయ 2, 18 పేజెస్, స్పై లాంటి సినిమాలతో వరుస విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం స్వయంభు, ది ఇండియన్ హౌస్, కార్తికేయ 3 లాంటి పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు.
కాగా నిఖిల్ ఇటీవల తండ్రిగా ప్రమోషన్ ని కూడా అందుకున్న విషయం తెలిసిందే. ఆయన భార్య పండంటి మగ బిడ్డకు జన్మనివ్వగా ఇటీవలే ఆ బాబుకి బారసాల కార్యక్రమం కూడా చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా తన కుమారుడిని అందరికీ పరిచయం చేశాడు నిఖిల్. ఈ సందర్భంగా తనకు ధీర సిద్ధార్థ అని నామకరణం చేసినట్లు వెల్లడించాడు. అలాగే తండ్రి అయ్యాక కొన్ని అలవాట్లకు స్వస్తి చెప్పాను అని తెలిపారు. ఈ సందర్బంగా నిఖిల్ మాట్లాడుతూ.. మా అబ్బాయి పేరు ధీర సిద్దార్థ్. తండ్రి అయ్యాక కొన్ని అలవాట్లు పూర్తిగా మానుకున్నాను.
వీలైనంత వరకు ఎక్కువ సమయం కుటుంబం కోసం కేటాయిస్తున్నాను. తండ్రిగా బాబు బాధ్యతలను కూడా పంచుకుంటున్నాను. ఎక్కువ సమయం వాడితోనే గడపుతున్నాను. గతంలో వారంలో కనీసం ఒక్కసారి అయినా సరే నైట్ పార్టీకి వెళ్లేవాడిని. అయితే ఇప్పుడు ఆ అలవాటు పూర్తిగా మార్చుకున్నాను. పార్టీలకు వెళ్లడం మానేశాను. అమ్మా నాన్నలు అయ్యాక పిల్లల కోసం కొన్నింటినీ వదులుకోవాల్సి వస్తుంది. పిల్లలు మంచి వాతావరణంలో పెంచాలంటే కొన్నింటికి దూరంగా ఉండాలని అర్ధం చేసుకున్నాను. ఇలా నాలో వచ్చిన మార్పు తో నేనెంతో సంతోషంగా ఉన్నాను అని చెప్పుకొచ్చాడు నిఖిల్.
Read More: బీఆర్ఎస్ నేత మృతి కేసులో నటుడు రఘుబాబు అరెస్ట్.. అరెస్ట్ అయిన తర్వాత వెంటనే అలా!