వెంక‌టేష్ `దృశ్యం 2` రివ్యూ అండ్ రేటింగ్‌

November 25, 2021

వెంక‌టేష్ `దృశ్యం 2` రివ్యూ అండ్ రేటింగ్‌

టైటిల్ : దృశ్యం 2

డేట్: 2021-11-25

నటీనటులు: వెంకటేష్, మీనా, కృతికా, ఈస్టర్ అనిల్, నదియా, నరేష్, పూర్ణ, వినయ్ వర్మ, సత్యం రాజేశ్, తనికెళ్ల భరణి, షఫీ, తాగుబోతు రమేష్, చమ్మక్ చంద్ర, టిల్లు వేణు, చలాకీ చంటి తదితరులుకథ, దర్శకత్వం: జీతు జోసెఫ్ నిర్మాతలు: డీ సురేష్ బాబు, ఆంథోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి సినిమాటోగ్రఫి: సతీష్ కురుప్ మ్యూజిక్: అనుప్ రూబెన్స్ ఎడిటింగ్: మార్తాండ్ కే వెంకటేష్ బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, రాజ్ కుమార్ థియేటర్స్ రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో

2014లో మ‌ల‌యాళం సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్‌ సూప‌ర్‌హిట్ మూవీ దృశ్యం సినిమాని తెలుగుతో రీమేక్ చేసి ఘ‌న విజ‌యం సాధించాడు విక్ట‌రి వెంక‌టేష్‌.దానికి కొన సాగింపుగా ఈ ఏడాది మ‌ల‌యాళంలో దృశ్యం 2 సినిమాని తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు జీతు జోసెఫ్‌. అది కూడా భారీ విజ‌య‌మే సాధించింది. అయితే అదే ద‌ర్శ‌కుడితో దృశ్యం 2 సినిమాని మ‌రోసారి తెలుగులో రీమేక్ చేశారు విక్ట‌రీ వెంక‌టేష్‌..అమేజాన్ ప్రైమ్‌లో విడుద‌లైన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

క‌థ‌: వరుణ్ మిస్సింగ్ కేసు నుండి బ‌య‌ట‌ప‌డిన రాంబాబు (వెంకటేశ్‌) త‌న కుటుంబంతో సంతోష‌క‌ర‌మైన జీవితాన్నిగడుపుతూ ఉంటాడు. కేబుల్‌ టీవీ ఆపరేటర్‌గా కెరీర్ ప్రారంభించిన రాంబాబు సినిమాల‌పై ప్రేమ‌తో ఓ థియేటర్ ను అలాగే ఓ సినిమాను నిర్మించే ప‌నిలో ఉంటాడు. అయితే ఆ కేసు తాలూకు భయాలు మాత్రం అతడి కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంటాయి. తీవ్ర మానసిక ఒత్తిడితో ఉన్న త‌న పెద్ద కుమ‌ర్తెకు వివాహం చేస్తే ఆరోగ్యం కుదట పడుతుందని రాంబాబు కుటుంబం భావిస్తుంది. ఆ ప‌నుల్లో సాఫీగా సాగుతున్న రాంబాబు జీవితంలోకి మళ్లీ పోలీస్ ఆఫీసర్ గీతా (నదియా), ప్రభాకర్ (నరేష్) మళ్లీ ప్రవేశిస్తారు. దాంతో మళ్లీ రాంబాబు కుటుంబం ఇబ్బందుల్లో పడుతుంది. ఆరేళ్ల క్రితం మరణించిన తన కొడుకు వరుణ్ కేసును గీతా ప్రభాకరన్ దంపతులు ఎలా తిరిగదోడారు?రాంబాబు సినిమా తీసి తన లైఫ్ టైమ్ కోరికను తీర్చుకొన్నాడా? వరుణ్ హత్య కేసు నుంచి రాంబాబు సమస్య నుంచి ఎలా గట్టెక్కాడు? ఈ కథలో ప్రఖ్యాత రచయిత విజయ్ చంద్ర పాత్ర ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే దృశ్యం 2 సినిమా కథ.

‘దృశ్యం’లో ఇద్దరు బిడ్డల తండ్రిగా కుటుంబాన్ని కాపాడుకోవటం కోసం ఎలాగైతే రాంబాబు పాత్రలో ఒదిగిపోయారో.. ‘దృశ్యం2’లో అదే స్థాయి నటన కనబరిచారు. రాంబాబు భార్య పాత్రలో మీనా, కుమార్తెలుగా కృతిక, ఏస్తర్‌లు తమ పరిధి మేర నటించారు. మొదటి భాగంలో లేని సంపత్‌రాజ్ ఐజీగా, కానిస్టేబుల్‌గా సత్యం రాజేశ్‌, రచయితగా తనికెళ్ల భరణి, లాయర్‌గా పూర్ణ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రులుగా నదియా, నరేశ్ మ‌రోసారి తమ పాత్రల్లో చక్కగా నటించారు. సతీశ్‌ కురుప్‌ సినిమాటోగ్రఫీ చక్కగా కుదిరింది. ఒరిజిన‌ల్‌ తీసిన అనుభవం ఉండటంతో సులభంగా పనిచేసుకుంటూ వెళ్లిపోయారు. తెలుగు నేటివిటీకి దగ్గరగా సన్నివేశానికి తగినట్లు ప్రతి ఫ్రేమ్‌ను అందంగా, ఉత్కంఠగా తీర్చిదిద్దాడు. అనూప్‌ రూబెన్స్‌ నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్‌. మార్తాండ్‌ కె వెంకటేశ్ ఇంకో రెండు మూడు స‌న్నివేశాల్ని ఎడిట్ చేసుంటే బాగుండు అనిపిస్తుంది.

వ‌రుణ్ హత్య కేసు వ్యవహారం ఏదో రూపంలో వెంటాడుతున్నప్పటికీ ఆ చేదు విషయాన్ని దిగమింగుతూ రాంబాబు కుటుంబం జీవితాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఊహించని విధంగా గీతా ప్రభాకరన్ (నదియా), ప్రభాకరన్ (నరేష్) అమెరికా నుంచి వచ్చి ఓ కోరిక కోరడంతో సినిమా ఆసక్తికరంగా మారుతుంది. వరుణ్ హత్య నేపథ్యాన్ని సినిమాగా తెరకెక్కించాలనే విషయంలో విజయ్ చంద్రతో చేసిన కథా మార్పులు సినిమాలో మరింత ఆసక్తిని రేపుతాయి. రాంబాబు కుటుంబ నేపథ్యం, చివర్లో వరుణ్ కేసు పున: విచారణ అంశాలతో తొలిభాగం ముగిసిపోతుంది. దృశ్యం 2 చిత్రంలో రెండో సగభాగం హత్య కేసు విచారణ, దర్యాప్తు అంశాలు కీలకంగా ఆసక్తికరంగా మారుతాయి. జైలు, కోర్టు సీన్లు కథకు మరింత బలంగా మారాయి. రాంబాబు క్యారెక్టర్‌ను బలంగా డిజైన్ చేయడంతో సినిమా మరింత ఎంగేజింగ్‌గా మారినట్టు కనిపిస్తుంది. చివర్లో ఐజీ (సంపత్ రాజ్) పాత్రతో కథకు ముగింపు పలికిన విధానం సంతృప్తికరంగా అనిపిస్తుంది. ద‌ర్శ‌కుడు జీతు జోసెఫ్ ఈ సినిమాలో ఎక్కడా ఫార్ములా జోలికి పోక‌పోవ‌డం ఆశ్య‌ర్యాన్ని క‌లిగిస్తుంది. సినిమాలో ఒక చిన్న విషాద గీతం మాత్ర‌మే ఉంటుంది. క‌థ ఎక్క‌డా ప్ర‌క్క‌దోవ ప‌ట్ట‌దు. ఒక్క సీన్ కూడా అన‌వ‌స‌రంగా ఉండ‌క‌పోవ‌డం ఈ సినిమా ప్ర‌త్యేకం. క‌థ మొత్తాన్ని రాంబాబు త‌న భుజాల‌పై మోసినా ద‌ర్శ‌కుడి ప్ర‌త్యేక‌త ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న‌ల్ని ఆశ్చ‌ర్య‌చ‌కితుల్ని చేస్తుంది.

కొన్ని స‌న్నివేశాలు లాజిక్‌కు దూరంగా ఉన్నాయి అనిపించినా చివ‌ర‌లో అన్నింటికి వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు. దృశ్యం సినిమాను ఎంత ఎఫెక్టివ్‌గా తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకొన్నాడో.. అంత‌కంటే ఎక్కువ బలంగా దృశ్యం 2 సినిమాని తెర‌కెక్కించాడు. ముఖ్యంగా థ్రిల్ల‌ర్ సినిమాల‌ను ఆద‌రించే వారు దృశ్యం 2 సినిమాకి మ‌రింత ఎక్కువ క‌నెక్ట్ అవుతారు. ఒకానొక ద‌శ‌లో కొన్ని ప‌నులు ఆచరణసాధ్యమా అని ప్రేక్ష‌కుడికి అనిపించేలోపే జ‌డ్జితో పోలీసాఫీస‌ర్ ఆఫ్‌ది రికార్డు మాట్లాడే స‌న్నివేశాన్ని పెట్టి ఇదంత సాధ్య‌మే అని చెప్పించ‌డం ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ‌కు నిద‌ర్శ‌ణం. అలాగే ఆరేళ్ల క్రితం మర్డర్ గురించి ఓ ఐజీ ఏకంగా అండర్ కవర్ ఆపరేషన్ ప్లాన్ చేయడం, ఇయర్ బగ్స్, నైబర్స్-ఓ స్వామిని ప్లాంట్ చేయడం, రెండేళ్ల నిఘా వంటి వాటికి కూడా జస్టిఫికేషన్ ఇవ్వ‌డం వంటివి క‌థ‌పై ద‌ర్శ‌కుడికి ఉండాల్సిన ప‌రిజ్ఞానానికి ఉదాహ‌ర‌ణ‌. ఒక హత్య, పోలీసు దర్యాప్తు హింస పిల్లల మీద ఎంత దీర్ఘకాలం ప్రభావాన్ని చూపిస్తాయి, వాళ్ల ఆరోగ్యం, మానసిక ప‌రిస్థితి మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయి అనే అంశాన్ని చూపిస్తూ అంత‌ర్లీనంగా మంచి సందేశాన్ని కూడా ఇచ్చాడు.

ప్ల‌స్ పాయంట్స్‌

కథ, కథనం

వెంకటేశ్ న‌ట‌న‌

దర్శకత్వ ప్ర‌తిభ‌

నేప‌థ్య సంగీతం

మెన‌స్‌లు

ఫ‌స్టాఫ్ లో కొంత నిడివి

బాట‌మ్ లైన్‌….ప‌ర్‌ఫెక్ట్ సీక్వెల్

చిత్ర‌సీమ‌ రేటింగ్: 3/5

ట్రెండింగ్ వార్తలు