April 17, 2024
ప్రస్తుతం మాలీవుడ్ ఫుల్ జోష్‌లో ఉంది. వరుసగా సూపర్ హిట్ సినిమాలతో మలయాళ ఇండస్ట్రీ ఉరకలు వేస్తోంది. ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా హిట్ అయిన సినిమాలలో మలయాళం సినిమాల సంఖ్య ఎక్కువగా ఉంది.
మెగాస్టార్ మమ్ముట్టి భ్రమయుగం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేని ప్రయోగాత్మక సబ్జెక్ట్ అయినప్పటికీ తన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లారు మమ్ముట్టి. ఇక మరో స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఆడుజీవితంతో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నారు.
ఇది కూడా కమర్షియల్ సినిమా కాకపోవడం విశేషం. ఇది ఇలా ఉంటే తాజాగా వీరిద్దరి కాంబోలో ఒక సినిమా వస్తున్నట్లు టాక్. మమ్ముట్టి, పృథ్వీరాజ్ సుకుమారన్ త్వరలోనే కలిసి ఒక థ్రిల్లర్‌లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో మమ్ముట్టి హీరోగా, పృథ్వీరాజ్ విలన్‌గా నటిస్తున్నట్లు టాక్. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఆంటో జోసెఫ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా మమ్ముట్టి పృథ్వీరాజ్ సుకుమారన్ చివరిసారిగా 2010లో విడుదలైన పోకిరి రాజా చిత్రంలో కలిసి నటించారు. ఈ సినిమా తర్వాత దాదాపు 14 ఏళ్ల తర్వాత ఇద్దరూ కలిసి నటిస్తున్నారు.
ప్రస్తుతం మాలీవుడ్ టైమ్ మాములుగా లేదు. ఈ ఏడాది మొదలై నాలుగు నెలలే అయిప్పటికీ ఇప్పటికే ఆరు బ్లాక్ బస్టర్లు అందుకుంది మాలీవుడ్ ఇండస్ట్రీ. ఇందులో రెండు చిత్రాలు రూ.100 కోట్లకి పైగా వసూళ్లు సాధిస్తే ఒకటి దాదాపు రూ.250 కోట్లు కలెక్షన్లు సాధించింది. ఇక ఈ ఏడాదిని భ్రమయుగంతో విజయవంతంగా ప్రారంభించిన మమ్ముట్టి ప్రస్తుతం టర్బో అనే యాక్షన్ మూవీలో నటిస్తున్నారు. వైశాక్ దర్శకత్వంలో రానున్న ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో మమ్ముట్టి డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నారు. మమ్ముట్టి సొంత నిర్మాణ సంస్థ మమ్ముట్టి కంపెనీ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో టర్బో జోస్ పాత్రలో మమ్ముట్టి కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని జూన్ 13న విడుదల కానున్నట్లు టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పోస్టర్‌లో వాహనంపై కూర్చొని, రాయల్ లుక్‌లో కనిపించారు మమ్ముట్టి. ఇక ఈ సినిమాలో తెలుగు నటుడు సునీల్, అంజనా జయప్రకాశ్, రాజ్ బీ శెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Read More: శ్రీవిష్ణు హీరోగా హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.