తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని థియేట‌ర్స్‌లో అఖండ సినిమా విడుద‌ల‌వుతుంది – నిర్మాత మిర్యాల రవిందర్‌ రెడ్డి

November 24, 2021

తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని థియేట‌ర్స్‌లో అఖండ సినిమా విడుద‌ల‌వుతుంది – నిర్మాత మిర్యాల రవిందర్‌ రెడ్డి

సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల త‌ర్వాత న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీనుల మ్యాసివ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కాంబినేష‌న్లో వ‌స్తోన్న‌ హ్యాట్రిక్‌ మూవీ `అఖండ`. ద్వారక క్రియేషన్స్ ప‌తాకంపై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ సినిమాను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. డిసెంబర్ 2న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్య‌ధిక థియేట‌ర్స్‌లో విడుదల కాబోతోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత, ద్వారక క్రియేషన్స్ అధినేత మిర్యాల ర‌వింద‌ర్ రెడ్డితో ఇంట‌ర్వ్యూ…

కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత పెద్ద స్పాన్‌లో రిలీజవుతున్న సినిమా ఇదే కదా..ఎలా అన్పిస్తోంది? – 2019డిసెంబరు6 అంటే కరోనా మన భారతదేశానికి రాక ముందు ఈ సినిమా స్టార్టయ్యింది. కరోనా సమయంలో ఒక చిన్న టీజర్‌ విడుదల చేశాం. ఫస్ట్‌ లాక్డౌన్‌ అయిపోగానే షూటింగ్‌ చేశాం..కాని మళ్లీ సెకండ్‌ లాక్‌డౌన్‌ వచ్చింది. దాంతో సెకండ్‌ లాక్డౌన్‌లో కూడా మరో టీజర్‌ విడుదల చేశాం. అది అయిపోగానే క్లైమాక్స్‌ పార్ట్‌ షూట్‌ చేశాం. అన్ని కరోనాల తరువాత ఇప్పుడు సినిమాను విడుదల చేస్తున్నాం. అయితే రాబోయే పెద్ద సినిమాల ప్రయాణం ఎలా ఉండబోతోందనేది అఖండతో తెలుస్తుంది.

ప్రపంచ వ్యాప్తంగా అఖండ ఎలా గర్జించబోతుంది? `అన్‌స్టాపబుల్‌ అంతే..

బాలకృష్ణగారితో మీ జర్నీ గురించి చెప్పండి? `బాలకృష్ణగారితో జర్నీని మాటల్లో చెప్పలేను. బయట మాట్లాడుకునే బాలకృష్ణగారు వేరు. ఆయనతో కలిసి ట్రావెల్‌ చేశాక కనిపించే బాలకృష్ణగారు వేరు. స్క్రీన్‌ మీద బాలకృష్ణ వేరు.

పెద్ద సినిమాల ట్రెండ్‌ ఇంకా పూర్తిగా స్టార్ట్‌ అవ్వలేదు..కొంత మంది నిర్మాతలు వచ్చే ఏడాదికి వెళ్లారు…ఈ సమయంలో విడుదలచేయడం కరెక్ట్‌ అని అనుకుంటున్నారా? ` ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చింది. సెకండ్‌ లాక్డౌన్‌ కంటే ముందే సినిమా అంతా పూర్తయింది. కానీ క్లైమాక్స్‌, ఒక్క సాంగ్‌ మాత్రమే బ్యాలెన్స్‌ ఉంది. సినిమా పూర్తయ్యాక ఇక ఎన్ని రోజులు అని ఎదురుచూస్తాం…కరెక్ట్‌గా చెప్పాలంటే ఓటీటీ నుంచి కూడా చాలా ఆఫర్లు వచ్చాయి. కాని ఇలాంటి స్కేల్‌ ఉన్న సినిమాను థియేటర్లలో రిలీజ్‌చేయడమే కరెక్ట్‌ అని భావించాం. అదే విధంగా ఒక పెద్ద సినిమాను థియేటర్లో రిలీజ్‌ చేస్తే రెవెన్యూ, రెస్పాన్స్‌ ఎలా ఉంటుందని అందరికీ అనుమానాలున్నాయి. ఎవరో ఒకరు అడుగు ముందుకు వేయాలి కదా? అందుకే మేం ముందడుగు వేశాం. ఫస్ట్‌ లాక్డౌన్‌ తరువాత క్రాక్‌ సూపర్‌ హిట్‌ అయింది. ఇప్పుడు సెకండ్‌ లాక్డౌన్‌ తరువాత మనం వస్తున్నాం. కచ్చితంగా ఈ సినిమాకు వచ్చే రెస్పాన్స్‌ చూస్తే తెలుగు సినిమాకు మళ్లీ పూర్వ వైభవం వచ్చింది అని అనిపిస్తుంది.

కరోనా సమయంలో డిస్ట్రిబ్యూటర్లు ఎంత వరకు ముందుకు వస్తున్నారు? ` డిస్ట్రిబ్యూటర్లందరూ కలిసే విడుదల తేదీని నిర్ణయించారు. వాళ్లు ముందుకు రాకుంటే సినిమా ఎలా రిలీజ్‌ చేస్తాం చెప్పండి? మేం డిసెంబర్‌ 24న రావాలని అనుకున్నాం. కానీ వాళ్లందరూ కలిసి లేదు సార్‌ ఫస్ట్‌ మన సినిమా రావడమే కరెక్ట్‌. ఈ సినిమాకు డిసెంబర్‌ 2 అనేది సరైన తేదీ అని అంతా అన్నారు. వాళ్లందరి నిర్ణయం మేరకే డిసెంబరు 2న వస్తున్నాం.

అఖండ సినిమా ఎలా ఉండబోతుంది? `సినిమాప్రారంభమైన 20 నిమిషాల నుండి చివరి వరకు అలా చూస్తుండిపోతారు. విజువల్‌ వండర్‌ అంటారు చూడండి అలా ఉంటుంది.

నిర్మాతగా కథను నమ్ముతారా? లేక కాంబినేషన్‌నా? ` ఏ సినిమాకైనా కథే ముందు ఆ తరువాతే స్టార్‌ హీరో అయినా స్టార్‌ డైరెక్టర్‌ అయినా అని నేను నమ్ముతా.. అయితే ఒక స్టార్‌డమ్‌ ఉన్న హీరోలకు కథ అనేది ఒక లైన్‌గా ఉన్నా పర్లేదు. మిగతా సినిమాను ఆ హీరో, అతని ఫ్యాన్స్‌ క్యారీ చేస్తారు.

ఈ కాంబినేషన్‌ ఎలా సెట్టయ్యింది? ` బాలకృష్ణ గారి వందో సినిమాను బోయపాటిగారు చేయాల్సింది.. కాని కుదరలేదు. నాకు తెలిసి లెజెండ్‌ సినిమా సమయంలోనే బోయపాటిగారు మహజ్జాతకుడు అనేవర్కింగ్‌ టైటిల్‌తో ఈకథను బాలకృష్ణగారికి వినిపించారు. ఆ తర్వాత అన్నీ కుదిరాక.. ద్వారకా క్రియేషన్స్‌, రవీందర్‌ రెడ్డిగారితో చేద్దాం అని బాలకృష్ణగారితో బోయపాటి గారు అన్నారు. ఆయన ఓకే చెప్పడంతో ఈ కాంబినేషన్‌ సెట్టయ్యింది.

టైటిల్‌ మహజ్జాతకుడు అని కాకుండా అఖండ అని మార్చడానికి రీజనేంటి? ` అఖండ అంటే అనంతం.. కాదనలేని సత్యం. సినిమా చూశాక..ఆ టైటిల్‌ ఎందుకు పెట్టారా? అని తెలుస్తుంది. కథకు అఖండ అనే టైటిల్‌ పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది.

బాలకృష్ణ`బోయపాటి కాంబినేషన్‌ అనగానే ఫ్యామిలీ ఎమోషన్స్‌ ఎక్కువగా చూపిస్తారు..ఈ కథలో మాత్రం అఘోరగా చూపించారు? ` అఘోరాలు అంటే సమాజానికి సంబంధం లేని వ్యక్తులు కాదు. వారు వ్యక్తిగతం కన్నా.. దైవం, ప్రకృతి వాటిపై రియాక్ట్‌ అవుతుంటారు. అలాంటి కారెక్టర్‌ సమాజంలోకి రావడం… సమస్యలను పరిష్కరించడమనేది కథ.

వరల్డ్‌ వైడ్‌గా అఖండ ఎన్ని థియేటర్స్‌లో రిలీజవుతుంది? ` నెంబర్‌ కరెక్ట్‌గా చెప్పలేను.. కాని బాలకృష్ణగారు, బోయపాటి గారి కెరీర్లలో ఇన్ని స్క్రీన్‌లో విడుదలైన సినిమా మరొక్కటి లేదేమో. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని థియేటర్లో అఖండ రావొచ్చు. ఓవర్సీస్‌లోనూ ఫస్ట్‌టైమ్‌ భారీ స్థాయిలో విడుదలవుతోంది. మెల్‌బోర్న్‌లో అయితే బుకింగ్స్‌ ఓపెన్‌ చేసిన గంటకే ఫుల్‌ అయిపోయాయి.

ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల రేట్ల విషయంలో గవర్నమెంట్‌ ఇంకా ఒక కొలిక్కి రాలేదు..ఈ టైమ్‌లో రిలీజ్‌ చేయడం…? ` దాన్ని కొంత వరకు కన్సిడర్‌ చేసి డిస్ట్రిబ్యూటర్లకు కొంత మేర రేట్లు తగ్గించి ఇచ్చాం.

ప్రభుత్వాన్ని రిక్వెస్ట్‌ చేసే ఆలోచన ఉందా? ` ప్రభుత్వాన్ని రిక్వెస్ట్‌ చేయడం అయితే జరిగింది. నాని గారిని కలిసి మాట్లాడాం. సినిమా అంటే వ్యక్తిగతం లేదంటే మన నలుగురికి సంబంధించింది. కాని ప్రభుత్వం అంటే అన్ని శాఖలు ఉంటాయి. వాళ్లు తీసుకునే నిర్ణయాలు మనకు ఇబ్బందిగా ఉండొచ్చు. కానీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మనం గౌరవించాల్సిందే.

సినిమా ఏ ఏ లొకేషన్స్‌లో షూట్‌ చేశారు? ` కరోనా వల్ల బయటకు వెళ్లి షూటింగ్‌ చేయలేని పరిస్థితి ఏర్పడిరది. అందుకే ఎక్కువ భాగం ఇక్కడే సెట్స్‌ వేసి చేశాం. అయితే ముఖ్యమైన సన్నివేశాల్ని చాలా రిస్కీ ప్లేస్‌లలో చేయడం జరిగింది. ఉదాహరణకు దందేలిలో ఒక రివర్‌ ఉంటుంది అక్కడ షూట్‌ చేశాం. ఆ విజువల్స్‌ సినిమాలో చూస్తే అర్ధం అయిపోతుంది. ఇక క్లైమాక్స్‌ను అరుణాచలంలోని ఓ గుడిలో షూట్‌ చేశాం. ఆ టెంపుల్‌ సింగిల్‌ స్టోన్‌తో కట్టారు. అద్భుతంగా ఉంటుంది.

రెండు పాత్రల్లో బాలకృష్ణగారి పెర్‌ఫామెన్స్‌ ఎలా ఉండబోతుంది? ` అసలు ఈ సినిమాలో బాలకృష్ణగారివి రెండు పాత్రలు అని చూడకూడదు. ఆ రెండో పాత్ర సూపర్‌ హీరో పాత్ర. మనిషికి ఎక్కువ దేవుడికి తక్కువ అనేలా ఉంటుంది.

ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను భారీగా చేస్తున్నారు కదా? ` ముందు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను భారీగా చేధ్దాం అనుకున్న మాట వాస్తవమే.. కోదాడలాంటి ఓపెన్‌ గ్రౌండ్‌లో చేద్దాం అనుకున్నాం. కానీ బాలకృష్ణగారి చేతికి రీసెంట్‌గా సర్జరీ జరగడంతో సింపుల్‌గా చేయాలని అనుకున్నాం. అందుకే శిల్పా కళా వేదికలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ప్లాన్‌ చేశాం.

శ్రీకాంత్‌గారి పాత్ర గురించి చెప్పండి? ` లెజెండ్‌ సినిమాతో జగపతిబాబుగారి కెరీర్‌ ఎలా టర్న్‌ తీసుకుందో.. అఖండ సినిమాతో శ్రీకాంత్‌గారి కెరీర్‌ అలా టర్న్‌ అవుతుంది. ఈ చిత్రంలో జగపతి బాబు గారు కూడా ఉన్నారు. సినిమాను గైడ్‌ చేసే ఇంపార్టెంట్‌ రోల్‌ పోషించారు.

తమన్‌ మ్యూజిక్‌ గురించి? ` హానెస్ట్‌గా చెప్పాలంటే తమన్‌ మేం అందరం నమ్మినదాని కంటే.. ఎక్కువగా నమ్మాడు. అనుకున్న దాని కంటే మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు. సినిమా రిలీజ్‌ తరువాత తమన్‌ సంగీతం, నేపేథ్య సంగీతం గురించే ఎక్కువ మాట్లాడుతారు.

హీరోయిన్‌ రోల్‌ ఎలా ఉంటుంది? ` ప్రగ్యా జైస్వాల్‌ ఇంతకు ముందు జయ జానకి నాయకలో ఒక ఇంపార్టెంట్‌ రోల్‌ చేసింది. ఈ సినిమాలో ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌.. హీరోయిన్‌ అంటే అలా వచ్చి ఇలా వెళ్లే పాత్ర కాదు. ఆమె పాత్రకు చాలా ఇంపార్టెన్స్‌ ఉంటుంది.

భారీ చిత్రాల నిర్మాతగా పేరు పడుతుంది కదా ఇక మీదట ఎలాంటి సినిమాలు నిర్మిస్తారు? ` అలా ఏం లేదండి! అనుకోకుండానే ఇలాంటి భారీ సినిమాని తీయడం జరిగింది. ఇక ముందు జర్నీ ఎలా ఉంటుందో చూడాలి. వ్యక్తిగతంగా అయితే నాకు కాన్సెప్ట్‌ బేస్డ్‌ సినిమాలంటేనే ఇష్టం. భవిష్యత్తులో అలాంటి సినిమాలు తీస్తాను.

నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ గురించి చెప్పండి? ` ప్రస్తుతం రెండు సినిమాల గురించిన చర్చలు జరుగుతున్నాయి. ఒక సినిమాకు హీరో కూడా ఫైనల్‌ అయ్యారు త్వరలోనే ఆ వివరాలు చెప్తాను. నిర్మాణ పరంగా మాత్రం ఎలాంటి కాంప్రమైజ్‌లు ఉండవు.

పెద్ద సినిమాలన్ని సంక్రాంతికి విడుదలవుతుంటాయి కదా మీరు ముందే రావడానికి రీజనేంటి? ` అలా అనేం లేదు..కొంత మంది సంక్రాంతికి రావాలి అనుకుంటారు కొందరు దసరాకి రావాలి అనుకుంటారు. ఇండస్ట్రీ అంటే మనం ఒక్కరం కాదు కదా మనతో పాటు చాలా సినిమాలు ఉంటాయి. దిల్‌రాజుగారు సహా అందరు ఇండస్ట్రీ పెద్దలు కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. ఆ ప్రణాలికలో భాగంగానే డిసెంబరు 2న రావడం జరుగుతుంది. ఇక్కడ మనం అప్రిషియేట్‌ చేయాల్సిన మరో విషయం ఏంటంటే సంక్రాంతికి రాజుగారి ఎఫ్‌ 3 సినిమా ఉంది. కాని ఇన్ని సినిమాల చార్ట్‌ చూసిన తర్వాత తనే ఫిబ్రవరికి వాలెంటరీగా వెళ్లారు. ఆ విషయంలో రాజన్నను చాలా అప్రిషియేట్‌ చేయాలి.

ట్రెండింగ్ వార్తలు