అఖండ ప్యాన్ వ‌ర‌ల్డ్‌ సినిమా –  థ్యాంక్స్ మీట్‌లో నటసింహం

January 12, 2022

అఖండ ప్యాన్ వ‌ర‌ల్డ్‌ సినిమా –  థ్యాంక్స్ మీట్‌లో నటసింహం

నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ `అఖండ` డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.  ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై  మిర్యాల రవిందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతుండటంతో చిత్ర యూనిట్ థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో..

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘డిసెంబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేశాం. అది సీజన్ కాదు. ఎవరు ముందు వస్తే వారి వెనక వద్దామని అనుకున్నారు. అందరిలోనూ ఆ భయం ఉంది. మా నిర్మాత ధైర్యంతో రిలీజ్ చేశారు. తెలుగు ప్రేక్షకులు ఈ విజయాన్ని అందించారు. ధైర్యం చేసి రిలీజ్ చేసిన నిర్మాతకు నా అభినందనలు. ఇది పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ అయింది. ఈ సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుతోంది. పాకిస్థాన్‌లో సైతం మన అఖండ గురించి మాట్లాడుకుంటున్నారు. మేం అఖండ సినిమా చేసేటప్పుడు సింహ, లెజెండ్ గురించి ఆలోచించలేదు. నమ్మకంతో పని చేస్తే ఫలితం దేవుడు చూసుకుంటాడు. ఈ అఖండ ఫలితం ఆ దేవుడు ఇచ్చిందే. సినిమా ఇప్పుడు అందరికీ నిత్యావసర వస్తువులా మారింది. కొత్త సినిమాలను అందించాలనే తపన నిర్మాత, దర్శకులకు ఉండాలి. జగపతి బాబు, శ్రీకాంత్‌లకు మంచి పాత్రలు వచ్చాయి. ఈ సినిమాలో వినోదం, విజ్ఞానం రెండూ ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించారు. కొత్త రకం సినిమాలను ఆదరించేవారిలో తెలుగు ప్రేక్షకులు ముందుంటారని గర్వంగా చెబుతున్నాను. మా వెన్నుతట్టి ఇంకా మంచి సినిమాలు ఇవ్వండని ప్రేక్షకులు ప్రోత్సహించారని మేం అనుకుంటాం. చిన్నా పెద్దా అనే సినిమాలు ఉండవు. పెద్ద సినిమా పోతే.. చిన్న సినిమా అని కూడా అనరు .చిన్న సినిమా హిట్ అయితే పెద్ద సినిమా అంటారు. అన్నీ సినిమాలు ఒకటే. అందరికీ ఉపాధి దొరకాలి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందించాలి. మా కెమెరామెన్ రెండు పాత్రలను ఎంతో అద్బుతంగా చూపించారు. థమన్ కోసం ఇంటర్ పోల్ అధికారులు వెతుకుతున్నారు. ఆయన దెబ్బకు బాక్సులు బద్దలయ్యాయి. అద్బుతమైన సంగీతాన్ని అందించారు. మా ఫైట్ మాస్టర్లు అధ్భుతంగా కంపోజ్ చేశారు. ఎవరేం చేసినా కూడా వారందరితో చేయించింది మాత్రం బోయపాటి గారే. అందరి నుంచి నటనను రాబట్టుకునే సత్తా ఉన్న దర్శకుడు బోయపాటి గారు. ఆయన దేశం గర్వించదగ్గ దర్శకుడు. మా నిర్మాత ఎప్పుడూ అదే చిరునవ్వుతో ఉన్నారు. సినిమా ప్రారంభించినప్పుడు అలానే ఉన్నారు. సినిమా హిట్ అయినా అలానే ఉన్నారు. అలాంటి నిర్మాతలే కావాలి. ఇటువంటి సినిమాలు ఇంకా వస్తాయి. చలనచిత్ర రంగం ఉన్నంత వరకు ఇలాంటి సినిమాలు నిలిచిపోతాయి. అందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండండి’ అని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు