December 31, 2021
టైటిల్: అర్జున – ఫల్గుణ
విడుదలతేది: 31-12-2021
నటీనటులు: శ్రీ విష్ణు, అమృతా అయ్యర్, నరేష్, శివాజీ రాజా, సుబ్బ రాజు, దేవీ ప్రసాద్, రంగస్థలం మహేష్, రాజ్ కుమార్ చౌదరి తదితరులు
నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
కథ-కథనం-దర్శకత్వం: తేజ మర్ని
మాటలు: సుధీర్ వర్మ. పి
సినిమాటోగ్రఫి: జగదీష్ చీకటి
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు కథల ఎంపిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది ఇప్పటికే గాలిసంపత్, రాజా రాజా చోర అనే డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో గాలిసంపత్ డిజాస్టర్ టాక్ తెచ్చుకోగా రాజా రాజా చోర పర్వాలేదనిపించుకుంది. ఇక ఈ ఏడాదిలోనే మూడవ సినిమాగా అర్జున ఫల్గుణ అనే మరో క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 30రోజుల్లో ప్రేమించడం ఎలా ఫేమ్ అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించగా… జోహార్ ఫేమ్ తేజ మార్ని దర్శకత్వం వహించారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిరంజన్ రెడ్డి మరియు అన్వేష్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ: అర్జున ఫల్గుణ సినిమా గోదావరి జిల్లాల్లోని ఒక గ్రామీణ నిరుద్యోగ యువత కథ. అర్జున్(శ్రీవిష్ణు), శ్రావణి (అమృత) ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అర్జున్ తన స్నేహితులు (తాడోడు, రాంబాబు, ఆస్కార్) తో కలిసి సొంత ఊరిలోనే సోడా తయారీ కర్మాగారాన్ని ప్రారంభించాలనుకుంటారు. అయితే.. ఆ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు వారి పోరాటమే ఈ కథ. ఈ నేపథ్యంలో శ్రీవిష్ణు, అతని స్నేహితులు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతారు. అప్పుడు అసలు కథ స్లాట్ ప్రారంభమవుతుంది. అర్జునుడు, అతని నిరుద్యోగ స్నేహితులు పోలీసుల నుండి ఎలా తప్పించుకున్నారు … వారు ఎలా విజయం సాధించారు అనేది మిగతా కథ.
ఓ హీరో తన స్నేహితుల కోసం చేసిన సాహస కృత్యం.. ఇదీ స్థూలంగా కథ. లైన్ గా చెప్పుకుంటే.. కొత్తదేం కాదు. అలాగని మరీ… తీసి పారేయాల్సింది కాదు. ఇప్పటికే ఈ లైన్‌తో చాలా సినిమాలు వచ్చి మంచి విజయాలు సాధించాయి. కాని ఈ సినిమాలో ఛేజింగులతోనే దర్శకుడు తేజ మార్ని ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు. ఒక్క సీన్ తోనే అసలు విషయాన్ని చెప్పేయగల అంశాలను సైతం చేంతాడంత లాగారు. కొన్నిచోట్ల ఫార్ములా వీడి, సహజత్వం కోసం పాకులాడారు. మరికొన్ని చోట్ల మళ్ళీ ఫార్ములాను గుర్తు చేసుకున్నారు. దీంతో ఆడియన్స్ నిరాశకు గురికాక తప్పలేదు. నిజానికి ఈ సినిమాలో ప్రేక్షకుడు థ్రిల్ ఫీలయ్యే అంశం ఒక్కటీ ఉండదు. అలాగే మొత్తం కథ ప్రిడక్టబుల్ గానే సా..గుతుంది.
ఇక పెర్ఫామెన్స్‌ల విషయానికి వస్తే అర్జున్‌గా శ్రీవిష్ణు తన పాత్రను మంచి ఈజ్‌తో పోషించారు. గోదావరి యాసని భలేగా పలికాడు. కానీ..అత్యంత కీలకమైన యాక్షన్ సీన్స్‌లో తేలిపోయాడు. సీనియర్ నటులు నరేశ్, శివాజీరాజా, దేవి ప్రసాద్ తమ పాత్రలకు తగ్గ న్యాయం చేశారు. ప్రారంభంలో పోలీస్ ఇన్ స్పెక్టర్ గా సుబ్బరాజు పాత్రని బలంగా చూపించినా చివర్లో అతన్ని కమెడియన్ చేశారు. హీరోయిన్ పాత్ర ప్రాధాన్యం ఎంటో ఎంతకీ అర్ధంకాలేదు.
చైతన్య ప్రసాద్ మంచి సాహిత్యమే అందించే ప్రయత్నం చేసినా, అప్పటికే ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించే కథనం వల్ల పాటలు ఏ మాత్రం ఆకట్టుకోవు. ఉన్నంతలో “గోదావరి వాళ్ళే సందమామ…” అనే పాట కొంత అలరిస్తుంది. ప్రియదర్శన్, బాలసుబ్రమణియన్ సంగీతం కూడా సోసోగా ఉంది. కథలో బలం లేకపోవడంతో ఎడిటింగ్ తేలిపోయింది. పి.సుధీర్ వర్మ రాసిన సంభాషణల్లో ఒకటి అర ఆకట్టుకుంటాయి. చాలా చోట్ల బూతులు ఎక్కువ వినిపించాయి. పల్లెటూరి అందాల్ని కెమెరా బాగానే పట్టుకుంది. రెండు మూడు చోట్ల కెమెరా పనితనం వావ్ అనిపిస్తుంది కాని అది సినిమాపై ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయదు. ఇక ఈ సినిమాకు ఎంతో కీలకమైన యాక్షన్ మూమెంట్స్ ని ఏమాత్రం థ్రిల్లింగ్ గా చూపించలేకపోయాడు దర్శకుడు. ఓ సాదా సీదా కథని రాసుకుని, దాన్ని మరింత సాధారణంగా తీసి చూపించాడు. బిలో యావరేజ్ కథల్నీ ఒప్పుకుని, డబ్బులు పెట్టే నిర్మాతలు ఉన్నారా? అనే డౌటు ఈ కథతో కలుగుతుంది. ఈ సినిమా వరకు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ గురించి మాట్లాడకపోవడమే మంచిది.
ప్లస్ పాయింట్స్ శ్రీ విష్ణు అక్కడక్కడా కామెడీ సీన్స్
మైనస్ పాయింట్స్ మిగతావన్ని