April 13, 2022
చిత్రం: బీస్ట్(2022)
నటీనటులు: విజయ్, పూజ హెగ్డే, సెల్వ రాఘవన్, యోగి బాబు, అపర్ణ దాస్.. తదితరులు
దర్శకత్వం: నెల్సన్ దిలీప్ కుమార్
నిర్మాత: సన్ పిక్చర్స్
సంగీతం: అనిరుద్ రవిచంద్రన్
సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస
విడుదలతేది: 13-04-2022
తమిళంలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో విజయ్ ఒకరు. ఆయన సినిమా రిలీజవుతుంది అంటే అక్కడ పండుగ వాతావరణం నెలకొంటుంది. అయితే తెలుగులో కూడా విజయ్ సినిమాలు డబ్ అయ్యి మంచి ప్రేక్షకాదరణ పొందుతాయి. ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన విజయ్ తుపాకి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ భారీ కలెక్షన్లు సాధించడమే దానికి నిదర్శణం. అయితే ఇటీవల విడుదలైన మాస్టర్ సినిమా మాత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఎంత మాత్రం అలరించలేకపోయింది. విజయ్, విజయ్ సేతుపతి పోటాపోటీగా నటించిన ఈ సినిమా కమర్షియల్ అంశాల మైకంలో అసలు కథ పూర్తిగా డీవియేట్ అయింది. ఇప్పుడు విజయ్ హీరోగా డాక్టర్ సినిమాతో తెలుగులోనూ కొంత పాపులారిటీ సంపాదించుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం బీస్ట్…అనిరుద్ రవిచంద్రన్ సంగీత దర్శకత్వం వహించగా పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ఇప్పటికే అరబిక్ కుత్తు పాటలో సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేని ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ దక్కించుకున్న ఈ సినిమా ఈ రోజు (ఏప్రిల్ 13న) విడుదలైంది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఎంతవరకు నచ్చిందో ఇప్పుడు చూద్దాం.
కథ: వీర రాఘవ(విజయ్) ఒక రా ఏజెంట్. డిపార్ట్మెంట్ లో అందరూ అతన్ని ఇండియన్ జేమ్స్ బాండ్ అని పిలుస్తారు. ఒక ఆపరేషన్ లో భాగంగా తనకు తెలీకుండా ఒక చిన్నారి ప్రాణం పోవడానికి కారణం అవుతాడు. దాంతో మనో వేదనకు గురై తన ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. 11 నెలల తర్వాత హీరోయిన్ కారణంగా చెన్నై లో ఈస్ట్ కోస్ట్ మాల్ లో సెక్యూరిటీ ఇంఛార్జి గా వస్తాడు. అప్పుడే అనుకోకుండా ఆ షాపింగ్ మాల్ ని టెర్రరిస్టులు హైజాక్ చేస్తారు. టెర్రరిస్టులు తమ డిమాండ్స్ తీర్చాలని ప్రభుత్వంతో చర్చలు మొదలుపెడతారు. ఈలోగ ఇంటిలీజెన్స్ వర్గానికి షాపింగ్ మాల్ లో ఒక సీక్రెట్ రా ఏజెంట్ ఉన్నాడని తెలియడంతో వెంటనే ఒక సీక్రెట్ రెస్క్యూ ఆపరేషన్ ని మొదలుపెడతారు. ఆ ఆపరేషన్ ఏంటి..వీర రాఘవ ఆ షాపింగ్ మాల్లో ఉన్న వాళ్లందరినీ టెర్రరిస్టుల చెరనుండి ఎలా విడుదల చేశారు అనేది మిగతా కథ.
బీస్ట్ కథ పరంగా సింపుల్ లైన్ అని చెప్పొచ్చు..ఈ తరహా కాన్సెప్ట్‌తో తెలుగులో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. నాగార్జున నటించిన గగణం, విజయ్ నటించిన తుపాకి సినిమాలు కూడా దాదాపుగా ఈ కాన్సెప్ట్‌తోనే వచ్చాయి. అయితే ఇలాంటి కథని నడింపించడంతో దర్శకుడి ప్రతిభ, స్క్రీన్ ప్లే కీలక పాత్ర పోషిస్తాయి. ఆ విషయంలో మాత్రం నెల్సన్ ఫెయిల్ అయ్యాడనే చెప్పొచ్చు. కథ పరంగా బీస్ట్ సినిమా పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో మొదలవుతుంది. రా ఏజెంట్ గా విజయ్ సింపుల్ అండ్ స్టైలిష్ ఎంట్రీ ఆయన అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా కథ పూర్తిగా ప్రారంభం కాక ముందే బ్లాక్ బస్టర్ సాంగ్ అరబిక్ కుత్తు వచ్చేస్తుంది. ఈ సాంగ్ విజువల్స్.. విజయ్, పూజా హెగ్డే డ్యాన్స్ ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ లాగా ఉంటాయి. ముఖ్యంగా పూజా హెగ్డే తన అందంతో పాటు డ్యాన్స్‌తో కూడా ఆకట్టుకుంటుంది. అయితే లిరిక్స్ మాత్రం ప్రేక్షకులకి పెద్దగా రుచించవు. నెల్సన్ దిలీప్ కుమార్ తన గత చిత్రాల మాదిరిగానే సీరియస్ కథని తీస్కొని తన మార్క్ కామెడీతో సినిమాని నడిపించే ప్రయత్నం చేశాడు. ఈ సారి కామెడీ వర్క్‌వుట్ కాలేదు. ఇది ఒక మోడ్రన్ కమర్షియల్ ఫిలిం అనే ఫీలింగ్ తీసుకురావడంలో మాత్రం నెల్సన్ సక్సెస్ అయ్యారు ఫస్ట్ అరగంట సినిమా నెమ్మదిగా సాగినా హైజాక్ సన్నివేశం ప్రారంభం అయ్యాక సినిమా వేరే టర్న్ తీసుకుంటుంది. అక్కడినుండి స్క్రీన్ ప్లే పరుగులు పెడుతుంది. అయితే సెకండాఫ్ కథ పూర్తిగా గాడి తప్పుతుంది. నటీనటుల ఎంపిక కారణంగా సినిమా ఎక్కడ సీరియస్ మూడ్‌ను కొనసాగించదు. ఇక విజయ్ చొక్కా నలగకుండా అంతమంది టెర్రరిస్టులను మట్టికరిపించడం ఆయన అభిమానులను మాత్రమే నచ్చే అంశం. సినిమాకు అతి కీలకమైన ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ పూర్తిగా తేలిపోవడంతో బీస్ట్ పాత చింతకాయ పచ్చడి కథే అనిపిస్తుంది. ఇక లాస్ట్ ట్విస్ట్‌కు ఆడియన్స్ థ్రిల్ అవ్వాల్సింది పోయి మరింత నీరసపడాల్సి వస్తుంది. అక్కడక్కడా యాక్షన్ సన్నివేశాలు, జబర్దస్థ్ తరహా కుల్లు జోకుల తప్ప సినిమాలో ఏమీ ఉండదు.
ఇక రా ఏజెంట్ వీర రాఘవ పాత్రకు విజయ్ పూర్తి న్యాయం చేశాడు. తనదైన మార్క్ నటనతో ప్రేక్షకుల్ని అలరించాడు. యాక్షన్ సన్నివేశాల్లో విజయ్ పెర్ఫామెన్స్ అదిరిపోయిందనే చెప్పాలి. పూజ హెగ్డే పాత్ర కేవలం గ్లామర్ కోసమే అన్నట్లు ఉంటుంది. నటనకు ఎలాంటి స్కోప్ లేదు… ఇక యోగి బాబు, అపర్ణ దాస్ ఇతర ఆర్టిస్ట్ లు వాళ్ళ పాత్రలకి న్యాయం చేసే ప్రయత్నం చేశారు. సెల్వరాఘవన్ పాత్ర సీరియస్ మోడ్‌లో ఉన్నా ఆడియన్స్‌కు కామెడీగానే అనిపిస్తుంది.
ఇక మనోజ్ పరమహంస కొన్నిచోట్ల అద్భుతమైన విజువల్స్ అందించాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో అతని ప్రతిభ ప్రశంసనీయం. అనిరుద్ ఎప్పటిలాగే తన బీజీఎమ్‌తో సినిమాను నడిపించాడు. చాలా సన్నివేశాలకి అనిరుద్ నేపేథ్య సంగీతం బలాన్ని చేకూరుస్తుంది. విజయ్ తర్వాత ఈ సినిమాకి అనిరుధ్ సెకండ్ హీరో అని చెప్పొచ్చు. అందుకే టైటిల్ కార్డ్ లో కూడా విజయ్ తర్వాత అనిరుద్ పేరే వస్తుంది. ఎడిటింగ్ ప్రేక్షకులు ఓపికకు పరీక్షపెడతాయి. ఓవరాల్‌గా బీస్ట్ విజయ్ అభిమానులకి విపరీతంగా నచ్చినా సాదారణ ప్రేక్షకులు మాత్రం ఓకె అనిపిస్తాడు. విజయ్ లాంటి పెద్ద పేరున్న హీరో, డబ్బులు నీళ్లలా ఖర్చుపెట్టే ప్రొడక్షన్ హౌస్ ఉన్నప్పటికీ వాటిని వాడుకోవడంలో నెల్సన్ తప్పటడుగు వేశాడు. ఈ సినిమాను టేకిట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకున్నట్లు అనిపిస్తుంది. దాంతో విజయ్ మరో డిజాస్టర్‌ను చవిచూడాల్సి వచ్చింది.
బాటమ్‌లైన్: బీస్ట్…పాత చింతకాయ పచ్చడి
చిత్రసీమ రేటింగ్: 2/5