చరిత్రకు, వ‌ర్త‌మానానికి ముడిపెడుతూ అల్లుకున్న క‌థే `బింబిసార‌`

November 29, 2021

చరిత్రకు, వ‌ర్త‌మానానికి ముడిపెడుతూ అల్లుకున్న క‌థే `బింబిసార‌`
ప‌టాస్ త‌ర్వాత స‌రైన హిట్ ప‌డ‌లేదు క‌ల్యాణ్‌రామ్‌కి..ఎలాగైనా హిట్ కొట్టాల‌నే క‌సితో త‌న మార్కెట్ ప‌రిధికి దాదాపు రెండింత‌లు ఎక్కువ‌ ఖ‌ర్చుతో కెరీర్‌లోనే బిగ్ బడ్జెట్ మూవీ `బింబిసార`ను త‌న సొంత బ్యాన‌ర్లోనే రూపొందించాడు క‌ళ్యాణ్ రామ్‌. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్స్ ఆక‌ట్టుకోగా..ఈ రోజు టీజ‌ర్‌ను విడుద‌ల‌చేశారు. ఈ టీజ‌ర్ చాలా గ్రాండ్‌గా ఉంది. ఖర్చుకు ఏమాత్రం వెన‌కాడ‌లేద‌ని తెలుస్తోంది.‘‘ఓ సమూహం తాలూకు ధైర్యాన్ని ఓ ఖడ్గం శాసిస్తే.. కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తలవంచి బానిసులైతే.. ఇందరి భయాన్ని చూస్తూ పొగరుతో ఓ రాజ్యం మీసం మెలేసింది’’ అనే సంభాషణలతో సాగిన ఈ టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. “త్రిగర్తల సామ్రాజ్యపు నెత్తుటి సంతకం, బింబిసారుడి ఏకఛత్రాధిపత్యం” అనే ఒక్క డైలాగ్ తో ఈ సినిమా స్టోరీలైన్ ఏంటి అనేది చెప్పేశారు. తన సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు బింబిసారుడు ఎంత దూరమైనా వెళ్తాడని, నెత్తుటి ఏరులు పారించాడనే విషయాన్ని టీజర్ లో చెప్పారు. ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది అయితే చివ‌ర‌లో స్టైలిష్‌ లుక్‌లో క‌నిపించి సందడి చేశాడు క‌ళ్యాణ్ రామ్‌. దీంతో అస‌లు ఈ సినిమా క‌థ ఏంటి అనే విష‌యం ప్ర‌స్తుతం చాలా ఆస‌క్తిగా మ‌రింది.రెండు జన్మల క‌థాంశంతో చాలా సినిమాలు వచ్చాయి. మ‌గ‌ధీర కూడా ఆ కోవ‌కే చెందుతుంది. ఇప్పుడు క‌ళ్యాణ్‌రామ్ కూడా ఇలాంటి క‌థ‌తోనే మ‌న ముందుకు రానున్నాడా అనిపిస్తోంది. చరిత్రకు, వ‌ర్త‌మానానికి ముడిపెడుతూ అల్లుకున్న క‌థ‌లా అనిపిస్తోంది. త‌న మార్కెట్ ప‌రిధి క‌న్నా ఎక్కువ ఖ‌ర్చుతో తీసిన‌ ఈ సినిమాతోనైనా క‌ళ్యాణ్ రామ్ హిట్ సాధిస్తాడో లేదో..చూడాలిక్యాథరీన్ థ్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు వశిష్ట్ దర్శకత్వం వహించాడు.

ట్రెండింగ్ వార్తలు