September 5, 2022
పడిపడి లేచే మనసు (2018), రణరంగం, జాను, శ్రీకారం, మహాసముద్రం, ఆడవాళ్ళు మీకు జోహార్లు… ఇలా వరుస ఫ్లాప్ మూవీతో హీరో శర్వానంద్ సతమతమవుతున్నారు. దీంతో పూర్తిగా మార్కెట్ పడిపోయి ఎలాగైనా హిట్ కొట్టాల్సిన పరిస్థితి శర్వాకు వచ్చింది. ఇలాంటి సమయంలో ట్రైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ‘ఒకే ఒక జీవితం’(తమిళంలో ‘కణం) తో ఈ నెల 9న మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. రీతూ వర్మ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శి, అక్కినేని అమల ప్రధాన పాత్రలో పోషించారు. ఎస్‌ఆర్ ప్రభు, ఎస్‌ఆర్ ప్రతాప్ నిర్మించిన ఈ చిత్రంతో శ్రీ కార్తిక్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
టైమ్ ట్రావెల్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా కథ విషయానికి వస్తే… శర్వాందన్‌కు అమ్మ(అమల అక్కినేని), సంగీతం అంటే ప్రాణం. చిన్నతనంలోనే ప్రమాదవశాత్తు తన తల్లి మరణిస్తుంది. అలాగే ‘వెన్నెల’ కిశోర్‌కు చదువు రాదు. దీంతో మధ్యవర్తిగా జీవితం సాగిస్తుంటాడు. కానీ అతన్నీ అందరు బ్రోకర్ అని పిలుస్తుండటం మింగుడు పడదు. ఇక లైఫ్‌లో చాలామంది అమ్మాయిల లవ్ ప్రపోజల్స్‌ను రిజెక్ట్ చేస్తారు ప్రియదర్శి. అయితే తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న సమయంలో ప్రియదర్శిని చాలామంది అమ్మాయిలు రిజెక్ట్ చేస్తారు. దీంతో చనిపోయిన అమ్మను బతికించుకోవాలని శర్వానంద్, బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించాలని ‘వెన్నెల’ కిశోర్, తనకు ప్రపోజ్ చేసిన అమ్మాయిల్లోనే ఎవరో ఒకర్నీ పెళ్లిచేసుకోవాలని ప్రియదర్శి కాలంలో వెనక్కి వెళ్లాలనుకుంటారు. ఈ సమయంలో ఈ ముగ్గురు స్నేహితులకు సైంటిస్ట్‌గా నాజర్ పరిచయం అవుతారు. వీరి ముగ్గురిని టైమ్ ట్రావెల్ ద్వారా గడిచిన కాలానికి తీసుకెళ్తాడు. కాలం వెనక్కి వెళ్లిన ఈ ముగ్గురు స్నేహితులు కాలాన్ని ఓడించి వాళ్లు అనుకున్నది సాధించారా? లేదా? అన్నదే ఈ సినిమా కథ.
ఈ సినిమా తర్వాత శర్వానంద్ ‘చల్‌మోహనరంగ’ ఫేమ్ కృష్ణచైతన్యతో ఓ సినిమా చేయనున్నాడు. ఇందులోని పాత్ర కోసం శర్వా బరువు కూడా తగ్గారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది.