July 23, 2023
‘బేబీ’…ప్రజెంట్ ఈ సినిమా టాలీవుడ్‌లో ప్రధాన చర్చనీయాంశమైంది. చిన్న సినిమాగా విడుదలై, తక్కువ రోజుల్లోనే యాభైకోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. జూలై14న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మారథం పడుతున్నారు. అయితే ఈ సినిమాకు కథ ఎంత ఫ్లస్ అయ్యిందో సంగీతం, పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇంకా ఆకర్షణగా నిలిచాయి. చెప్పాలంటే..రష్మికా మందన్నా చేతులు మీదుగా విడుదలైన ఆ రెండు మేఘాలు పాట ‘బేబీ’ సినిమాను ప్రేక్షకులకు చాలా దగ్గర చేసింది. ఈ పాటకే కాదు ‘బేబీ’ సినిమాకు ప్రాణంగా నిలిచిన సంగీతాన్ని సమకూర్చినది విజయ్ బుల్గానిన్.
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, వజ్రకవచధర గోవిందా, రెండు రెళ్ల ఆరు వంటి సినిమాలకు గతంలో విజయ్ బుల్గానిన్ సంగీతం అందించాడు. అయితే ఇలా చిన్న సినిమాలు, కామెడీ సినిమాలకు విజయ్ సంగీతం ఇస్తుండటంతో అతనికి పెద్ద అవకాశాలు రాలేదు. అయితే ‘బేబీ’ సినిమా విజయ్‌కు బ్రేక్ ఇచ్చింది. ఈ విషయం గురించివిజయ్ మాట్లాడాడు.
‘‘మా నాన్న ట్రాక్టర్ డ్రైవర్. ఆ తర్వాత లైన్‌మెన్‌గా ఉద్యోగం వచ్చింది. నాకు చిన్నతనం నుంచే మ్యూజిక్ ఇష్టం. ఇంట్లో చెబితో ఏమనుకుంటారో అని చెప్పలేకపోయాను. ఓ సందర్భంలో చెప్పినప్పుడు సినిమా ఇండస్ట్రీ అనగానే భయపడ్డారు. కానీ తర్వాత ప్రోత్సహించారు. మా పెదనాన్న సత్యమూర్తిగారి ప్రేరణతో నేను ఇండస్ట్రీకి వచ్చాను. అయినా పెద్దగా అవకాశాలు రాలేదు. కాస్త ఇండిపెండెంట్ మ్యూజిక్ చేశాను. అలా సప్తగారిగారు చేసిన సప్తగిరి ఎక్స్‌ప్రెస్, వజ్రకవచధర గోవిందా సినిమాలకు సంగీతం అందించాను. ఇలా చిన్న సినిమాలు, కామెడీ సినిమాలకు మ్యూజిక్ చేస్తాననే ముద్రనాపై వేసి నాకు పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు.
బింబిసార దర్శకుడు వశిష్ట వల్ల నాకుసాయిరాజేష్‌తో పరిచయం ఏర్పడింది. అలా ‘బేబీ’కి మ్యూజిక్ డైరెక్టర్‌గా స్టార్ట్ అయ్యాను. సాయిరాజేష్ ఏదైనా చిన్న సాంగ్‌తో స్టార్ట్ అవుదామంటే లేదు..తొలుత కష్టంగా ఉన్న పాటే చేద్దామని చెప్పి, ప్రేమిస్తేనే పాట చేశాను. మెలోడి కంపోజ్ చేయగలిగితే ఏ పాటైనా కంపోజ్ చేయగలమని నా నమ్మకం. ఇక దర్శకుడు రాజేష్, ఎస్‌కేఎన్, ఆనంద్‌ల తర్వాత ‘బేబీ’ సినిమా ఇంత పెద్ద విజయం సాధిస్తుందని నమ్మిన వ్యక్తిని నేనే. అందుకే రెండున్నర సంవత్సరాలుగా నేను ఏ ప్రాజెక్ట్‌ను ఒప్పుకో లేదు. బేబీ తర్వాత నాకు చాలా ఆఫర్స్ వస్తున్నాయి. నిర్మాత అల్లు అరవింద్‌గారు గీతాఆర్ట్స్ సినిమాలో సినిమా చేస్తావా? అని అడిగారు. అలాగే తనకు ఏఆర్ రెహమాన్, కీరవాణి, ఇళయరాజాగార్ల సంగీతం అంటే ఎంతో ఇష్టమని, వారే తనకు స్ఫూర్తి ’’ అని చెప్పుకొచ్చారు విజయ్ బుల్గానిన్
ఇంకా చదవండి: రీమేక్ అంటే రవితేజ పేరే వినిపిస్తోందిగా..