December 17, 2021
టైటిల్: పుష్ప: ది రైజ్(పార్ట్ 1)
రిలీజ్ డేట్: 17-12-2021
నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక, ఫహాద్ ఫాజిల్, సునీల్, ధనుంజయ, అనసూయ, రావు రమేశ్, అజయ్, అజయ్ ఘోష్ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాసన్, రుబెన్
సినిమాటోగ్రఫీ: మిరోస్లా కూబా బ్రొజెక్
నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్
రచన, దర్శకత్వం: సుకుమార్
‘ఆర్య’, ‘ఆర్య 2’ వంటి ఫీల్ గుడ్ మూవీస్ తర్వాత అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ పుష్ప. ఈ సినిమాలో ఇంత ముందు సినిమాలకు భిన్నంగా అల్లు అర్జున్ ను ఊర మాస్ లుక్‌లో చూపించారు దర్శకుడు సుకుమార్. దాంతో పాటు ఈ సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కించ నున్నాం అని ప్రకటించడంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఇక రష్మిక మందన్న కూడా ఫస్ట్ టైమ్ డీగ్లామర్ పాత్ర చేసింది, సునీల్, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్, ధనుంజయ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ప్రేక్షకుల్లో అభిమానుల్లో భారీ అంచనా లతో డిసెంబర్ 17 న థియేటర్స్‌లో విడుదలైన పుష్ప మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
రాయలసీమలోని శేషాచలం కొండల్లో ఎర్ర చందనం మొక్కలను కొట్టే కూలీగా జీవితాన్ని ప్రారంభించిన పుష్ప అలియాస్ పుష్పరాజ్ (అల్లు అర్జున్), అతి తక్కువ సమయంలో తన తెలివి, తెగువతో కొండా రెడ్డి (అజయ్ ఘోష్) అతని సోదరులకి స్మగ్లింగ్‌లో ఉపాయాలు చెప్పే స్థాయి నుండి ఏకంగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే సిండికేట్‌నే శాసించే స్థాయికి చేరుకుంటాడు. అప్పటివరకు ఆ స్థాయిలో ఉన్న మంగళం శ్రీను (సునీల్)కి అది నచ్చదు. దాంతో పుష్పరాజ్‌ని అలాగే కొండా రెడ్డిని చంపడానికి మనుషులని పంపిస్తాడు. వారి నుండి తప్పించుకుని మంగళం శ్రీనుకు ఎలా బుద్ది చెప్పాడు. శ్రీవల్లి(రష్మిక) ఎవరు? అమెతో ఎలా ప్రేమలో పడ్డాడు? అతడి ప్రేమను ఆమె అంగీకరించిందా లేదా…ఆ ఏరియాకి కొత్తగా వచ్చిన ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్ (ఫహద్ ఫాసిల్) తో పుష్షకి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి అనేది కథ.
అడవులను అడ్డంగా నరికేస్తూ, అక్కడి వృక్ష సంపదను, ఖనిజ సంపదను కొల్లగొడుతున్న అంశాలతో ఇటీవల చాలా సినిమాలు వచ్చాయి. అందుకు భిన్నమైన కథను ‘పుష్ప – ది రైజ్’ కోసం రచయిత, దర్శకుడు సుకుమార్ రాసుకున్నాడు. ఎర్రచందనం ఎంత విలువైందో, అది మన శేషాచలం అడవుల నుంచి జపాన్ వరకు ఎలా ప్రయాణం చేస్తుందో చెబుతూ సినిమాను ప్రారంభించాడు సుకుమార్. మధ్యలో కూలీ నుండి నుండి సిండికేట్ ను నడిపించే నాయకుడిగా ఎదిగిన సీన్స్‌ను ఆసక్తికరంగా మలిచాడు. విరామం ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి. దీంతో ‘పుష్ప’ పాత్ర పతాక స్థాయికి వెళ్లిపోతుంది. సినిమా ప్రారంభమైన మరుక్షణం నుండి ఆడియెన్స్ కు పుష్ప రాజ్ తప్ప అల్లు అర్జున్ కనిపించడు. ఎవరి కిందా పనిచేయడానికి ఇష్టపడని వ్యక్తిగా, తన మాటే నెగ్గాలనే తత్త్వమున్న మొరటోడిగా బన్నీ అదరగొట్టాడు. ‘తగ్గేదే లే’ అనే మేనరిజాన్ని ఒక్కో చోటా ఒక్కోలా పలికి ఆకట్టుకున్నాడు.
శ్రీవల్లితో ప్రేమ ప్రయాణం, పాటలు బాగున్నా, ఒక సీరియస్ మోడ్‌లో సాగుతున్న కథకు చిన్న చిన్న బ్రేక్‌లు వేసిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ క్రమంలోనే ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్‌గా ఫహద్ ఫాజిల్ పాత్ర పరిచయంతో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. ఇక్కడి నుంచి పుష్పరాజ్- భన్వర్ సింగ్‌ల మధ్య పోటాపోటీ ఉంటుందని, ఒక బలమైన ముగింపుతో తొలి పార్ట్ ముగుస్తుందని ఆశించిన ప్రేక్షకుడు పూర్తి తృప్తి చెందడు. సాంకేతికంగా ‘పుష్ప’ మరో లెవల్లో ఉంది. సినిమాటోగ్రాఫర్ కూబా విజువల్స్ బాగున్నాయి. ప్రతి సన్నివేశాన్ని రిచ్ లుక్‌లో చూపిస్తూనే, వాస్తవాన్ని ప్రతిబింబించేలా చూపించారు. యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఇక ఈ సినిమాకు ఇద్దరు ఎడిటర్లు పనిచేశారు. అయితే నిడివి మాత్రం పెరిగిందేమోననిపిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు బాగున్నాయి. ముఖ్యంగా ఊ అంటావా పాటలో సమంత, రారా నా సామి పాటలో రష్మిక మాస్ స్టెప్పులతో కుర్రకారు గుండెల్లో వేడి సెగలు పుట్టించారు. నిడివి విషయంలో సుకుమార్ ఇంకాస్త ఆలోచించి ఉంటే బాగుండేది. ప్రథమార్ధం పరుగులు పెట్టగా, ద్వితీయార్ధం నెమ్మదిగా సాగుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదనేది తెర మీద చూస్తే అర్థమౌతుంది.
బన్నీ ఫ్యాన్స్ కు, యాక్షన్ మూవీస్ ను ఇష్టపడే వారికి ‘పుష్ప’ సూపర్ కిక్ ఇస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. క్లైమాక్స్‌కు వచ్చేసరికి మూవీ గ్రాఫ్ కొద్దిగా డౌన్ అయిన భావన సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది. అసలు ఫైర్…సెకండ్ పార్టులో ఉంటుందని తెలిసినా ఏదో అసంతృప్తితోనే ప్రేక్షకులు బయటకు వస్తారు.
బాటమ్ లైన్: ఫైర్ సరిపోలేదు పుష్ప
రేటింగ్: 2.5 / 5