`అఖండ` మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌

December 2, 2021

`అఖండ` మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌

చిత్రం: అఖండ‌ రిలీజ్ డేట్: 2021-12-02 నటీనటులు: నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్, పూర్ణ, సుబ్బరాజు, సాయికుమార్, ప్రభాకర్, తదితరులు దర్శకత్వం: బోయపాటి శ్రీను నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి డైలాగ్స్: బోయపాటి శ్రీను, ఎం రత్నం మ్యూజిక్: ఎస్ థమన్ సనిమాటోగ్రఫి: సీ రాంప్రసాద్ ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు ప్రొడక్షన్స్ కంపెనీ: ద్వారక క్రియేషన్స్

కరోనా సెకండ్ వేవ్ తర్వాత ధియేటర్లలో రిలీజైన పెద్ద సినిమా, సింహా, లెజెండ్ వంటి మాస్ కమర్షియల్ హిట్స్ తర్వాత బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్లో రూపొందిన హాట్రిక్ మూవీ అఖండ‌. టీజ‌ర్‌, ట్రైల‌ర్స్ ఫ్యాన్స్‌ని విప‌రీతంగా ఆక‌ట్టుకోవ‌డంతో ఈ సినిమాపై భారీ అంఛ‌నాలు ఏర్ప‌డ్డాయి. వాటికి త‌గ్గ‌ట్టుగానే తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్‌సిస్‌లోనూ భారీగా అడ్వాన్స్ బుకింగ్ జ‌రిగాయి. నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి చెప్పిన‌ట్టు బాల‌కృష్ణ కెరీర్‌లోనే అత్య‌ధిక థియేట‌ర్స్‌లో ఈ సినిమా ఈ రోజు విడుద‌లైంది. బెనిఫిట్ షోల నుండే అభిమానులు భారీగా సంబ‌రాలు చేసుకుంటున్నారు. అయితే సినిమా బాల‌కృష్ణ అభిమానుల‌నేనా లేక ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ను ఆక‌ట్టుకుందా అనే లాంటి త‌దిత‌ర అంశాల‌ను ఇప్పుడు చూద్దాం.

క‌థ: రాయలసీమలోని అనంత‌పురం జిల్లాలో ఫ్యాక్షన్‌ వ్యవహారాలకు ముగింపు పలికేందుకు కంకణం కట్టుకొని, శాంతి స్థాపన కోసం ప్రయత్నించే అనంతపురం జిల్లాకు చెందిన రైతు మురళీ కృష్ణ (బాలకృష్ణ). వ్య‌వసాయం చేసుకుంటూ ఫ్యాక్షనిజం వైపు ప‌రుగెడుతున్న జ‌నాల్లో మార్పు తీసుకొస్తుంటాడు. ఆ ప్రాంత రైతులకి ఎలాంటి క‌ష్టం వ‌చ్చినా ప్రాణాలకు లెక్క చేయకుండా ఆదుకొంటాడు. అది చూసి ఆ జిల్లాకి కొత్తగా వ‌చ్చిన క‌లెక్టర్ శ‌ర‌ణ్య బాచుప‌ల్లి (ప్రగ్యాజైస్వాల్) ముర‌ళీకృష్ణపై మ‌న‌సు ప‌డుతుంది. ఇద్ద‌రు ఇష్ట‌ప‌డి పెళ్లి చేసుకుంటారు. వారికి ఒక కూతురు పుడుతుంది. మ‌రోవైపు ఆ ప్రాంతంలో వ‌ర‌ద రాజులు (శ్రీకాంత్) మైనింగ్ మాఫియాని న‌డుపుతుంటాడు. దాని నుండి వెలుబ‌డే విష‌ప‌దార్ధాలు నీటిలో క‌ల‌వ‌డంతో ఆ ఊర్లోని చిన్నారుల ప్రాణాల‌కి ముప్పు ఏర్పడుతుంది. దాంతో నిజం తెలుసుకున్న ముర‌ళీ కృష్ణ వ‌ర‌ద‌రాజుతో గొడ‌వ‌ప‌డతాడు. ఆ ప్రాంతంలో రాజకీయ పలుకుబడి ప్రభావంతో మురళీకృష్ణను అరెస్ట్ చేస్తారు. శ‌ర‌ణ్యపై సస్పెన్షన్ వేటు వేస్తారు. ఇక మురళీకృష్ణ కూతురును చంపడానికి ప్రయత్నిస్తారు. అంత‌లో అఖండ అలియాస్ శివుడు ఆ చిన్నారికి కాపాడుతాడు. అసలు అఖండ ఎవరు.? వరదరాజులను, అతని వెనుకున్న వారిని ఎందుకు అడ్డుకుంటాడు? మురళీకృష్ణ కుటుంబానికి అఖండకు సంబంధం ఏంటనేది మిగతా కథ.

శివుడు అలియాస్ అఖండగా, మురళీకృష్ణ రెండు విభిన్న‌ పాత్రల్లో బాలకృష్ణ పర్ఫెక్ట్ గా చేశారు. ముఖ్యంగా అఖండ పాత్రలోనైతే ఆయన రౌద్రం నంద‌మూరి అభిమానుల్ని మాస్ ఆడియ‌న్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. గెటప్ తో పాటు ఆహార్యం, డైలాగ్ డెలివరీ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. హీరోల క్యారెక్టర్స్ ఎంట్రీ నుంచి క్లైమాక్స్ వరకూ బాలయ్య మాస్ ఇమేజ్ ని ఎలివేట్ చేస్తూ చేసిన బోయపాటి టేకింగ్ ఓ రేంజ్ లో ఉంది. ప్రతి యాక్షన్ ఎపిసోడ్ లోనూ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఎలివేషన్స్ ఇచ్చాడు బోయపాటి. అఖండ ఎంట్రీ టైమ్‌లో వచ్చే ఫైట్ సినిమాకే హైలైట్. సెకండ్ హాఫ్ మొత్తం అఖండ క్యారెక్టర్ మీదే ఫోకస్ అవుతుంది. సెకండ్ హాఫ్ లో యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ ఓ రేంజ్ లో ఉంటాయి. ప్రతి ఫైట్ ఓ క్లైమాక్స్ లా ఉంటుంది. అలాగే మురళీకృష్ణ పాత్రతో ప్రకృతి గురించి చెప్పించిన డైలాగ్స్…అఖండ పాత్రతో ధర్మం గురించి, దేవాలయాల గురించి చెప్పించిన డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. జిల్లా కలెక్టర్ పాత్రలో ప్రగ్యా జైస్వాల్ అందం, అభినయాన్ని ప్రదర్శించింది. ముర‌ళి కృష్ణ‌కు త‌గ్గ విల‌న్ వరద రాజులుగా శ్రీకాంత్ లుక్, పెర్ఫార్మెన్స్ ఆకట్టుకున్నాయి. కంప్లీట్‌గా మాస్ లుక్‌లో క‌నిపించ‌డంతో పాటు త‌న న‌ట‌న‌తోనూ మెప్పించారు. స్వామీజీగా జ‌గ‌ప‌తిబాబు త‌న‌దైన శైలిలో న‌టించారు. పూర్ణ క్యారెక్ట‌ర్ కి మంచి స్కోప్ ఉంది. మిగ‌తా న‌టీన‌టుటు త‌మ ప‌రిధిమేర న‌టించారు.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే..అఖండ సినిమాకు అత్యంత బలం తమన్ మ్యూజిక్. బాల‌కృష్ణ యాక్షన్ ఎపిసోడ్స్ కి తమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ మరింత ఊపు నిచ్చింది. పాటల కంటే ప్రతీ సీన్‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్‌. సీ రాం ప్రసాద్ సినిమాటోగ్రఫి సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. యాక్షన్ సీన్లు రోమాలు నిక్కబొడిచేలా షూట్ చేశారు. అఖండగా బాలయ్య పాత్ర ఎమోషన్స్‌ను చక్కగా కెమెరాలో బంధించాడు. ముఖ్యంగా ఏం రత్నం డైలాగ్స్ బాంబుల్లా పేలాయి. కోటిగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ ప‌ర్వాలేదు. ద్వారక క్రియేషన్స్ ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్ ప్రతీ సన్నివేశంలోనూ తెలుస్తాయి. క‌థ‌కు త‌గ్గ‌ట్టుగా భారీగా ఖ‌ర్చు చేశారు. నందమూరి అభిమానులకే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్‌ కూడా నచ్చే అంశాలతో రూపొందిన చిత్రం అఖండ. మ మొత్తంగా అఖండ మాస్ ప్రేక్షకుల్ని ఎక్కువగా మెప్పించినా, ఫ్యామిలి ఆడియన్స్‌ని కూడా థియేటర్‌కి రప్పించే ఎలిమెంట్స్ కూడా ఈ చిత్రంలో ఉన్నాయి.

బాట‌మ్ లైన్: మాస్ కాదు ఊర మాస్ జాతర ‘అఖండ`చిత్ర‌సీమ రేటింగ్: 2.75/ 5

ట్రెండింగ్ వార్తలు