అందుకే ‘అఖండ’ సినిమాకు మళ్లీ రీ రికార్డింగ్ చేశాను – మ్యూజిక్ డైరెక్ట‌ర్ తమన్

November 23, 2021

అందుకే ‘అఖండ’ సినిమాకు మళ్లీ రీ రికార్డింగ్ చేశాను – మ్యూజిక్ డైరెక్ట‌ర్ తమన్

నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ` డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. అఖండ ప్రమోషన్స్‌లో భాగంగా మ్యూజిక్ డైరక్టర్ తమన్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

కరోనా కంటే ముందే రావాల్సిన సినిమాలు. ఇప్పుడు అన్నీ వరుసపెట్టి వచ్చేస్తున్నాయి. త్రివిక్రమ్ గారి ఇన్ పుట్స్ వల్లే భీమ్లా నాయక్ పాట అంత బాగా వచ్చింది. ఆ క్రెడిట్ ఆయనదే.

బోయపాటి శ్రీను బాలకృష్ణ గారి అండర్ స్టాండింగ్ చాలా గొప్పది. వారిద్దరూ కలిసి ఎన్ని వందల సినిమాలు చేసినా ఫ్లాప్ అవ్వవు.

కరోనా వల్ల సినిమాలో మార్పులు వచ్చాయి. కాలానికి తగ్గట్టుగా మార్చుకుంటూ వచ్చాను. రీ వర్క్ చేశాను. ఆర్ఆర్ రెండు నెలల క్రితమే అయిపోయింది. కానీ ఎక్స్‌పైరీ అయిన ఫుడ్ తినలేం కదా? సినిమా విడుదలయ్యే టైంకు తగ్గట్టు మ్యూజిక్ ఉండాలి. అందుకే మళ్లీ రీరికార్డింగ్ చేశాను. ఈ సినిమాలో పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు వస్తుంది. మంచి రేసుగుర్రంలా బోయపాటి గారు పరిగెత్తారు. మా అందరినీ పరిగెత్తించారు.

ఈ సినిమాలో ఫైర్ ఉంది. ఇందులో ఎమోషన్ బాగుంటుంది. ఎమోషన్ బాగుంటే సినిమాలు ఎప్పుడూ హిట్ అవుతాయి. బాలయ్య గారు అదరగొట్టేశారు. ఇది పర్ఫెక్ట్ మీల్‌లాంటి సినిమా.

అఘోర పాత్రల మీద రీసెర్చ్ చేశాను. ఆ పాత్రలకు తగ్గట్టుగానే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొట్టాం. చాలా బాగా వచ్చింది. ఈ కథ నెవ్వర్ బిఫోర్ అని.. నెవ్వర్ అగైన్ అని కూడా చెప్పొచ్చు. టైటిల్ సాంగ్ విని బాలయ్య గారు మెచ్చుకున్నారు. కమర్షియల్ సినిమాలకు త్వరగా ఏజ్ అవుతుంది. కానీ బోయపాటి గారు ఈచిత్రాన్ని అద్భుతంగా మలిచారు.

మా మ్యూజిక్‌ను జనాల్లోకి తీసుకెళ్లేదే హీరోలు. వారి వల్లే అందరికీ రీచ్ అవుతుంది. ఈ చిత్రంలో బోర్ కొట్టే సీన్స్ ఉండవు. థియేటర్లో అందరూ ఎంజాయ్ చేస్తారు. అఘోర పాత్రకు తగ్గట్టుగానే మేం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాం. ఇప్పటి వరకు నేను చేసిన పనిలో ఇదే బెస్ట్ అని అనిపిస్తుంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో చేయడం చాలా కొత్త. సపరేట్‌గా ఇద్దరికి పని చేయడం వేరే.. ఇలా ఈ ఇద్దరికి కలిపి చేయడం వేరు. ఇది వేరే ఫైర్.

తొమ్మిది నెలలు లాక్డౌన్‌లో ఇంట్లోనే కూర్చుని చేశాం. సినిమాకు అవసరం లేదని ఓ పాటను కూడా తీసేశాం. సినిమాను ఎలా గెలిపించాలని అందరం పని చేస్తాం. థియేటర్లో సినిమా చూస్తే అందరికీ నచ్చేలా ఉండేందుకు పని చేస్తాం. డైలాగ్స్‌తో నింపేస్తే ఏమీ వినపడదు. సినిమాలో మ్యూజిక్‌కు చాలా స్పేస్ ఇచ్చారు. సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది.

ఈ సినిమాకు దాదాపు ఐదారు వందల మంది పని చేశారు. చాలా ప్రయోగాలు చేశాం. కేవలం సింగర్లే 120 మంది వరకు ఉంటారు. అఘోరాల గురించి చాలా రీసెర్చ్ చేశాం. సినిమాలో అఘోర పాత్ర ఎంట్రీ ఇవ్వడంతో రేంజ్ మారిపోతోంది. వేరే జోన్‌లో ఉంటుంది.

బాలయ్య గారితో తదుపరి చిత్రాన్ని కూడా చేస్తున్నాను. ఆయన సైన్స్‌ను నమ్మే వ్యక్తి. టైంను ఎక్కువగా నమ్ముతారు. ఎంతో లవ్లీ పర్సన్.

అఘోర అంటేనే సైన్స్. వాళ్లు అలా ఎందుకు మారుతారు? అనే విషయాలపై సినిమా ద్వారా క్లారిటీ వస్తుంది. దేవుడిని ఎందుకు నమ్మాలి అనే దాన్ని క్లారిటీగా చూపిస్తారు. సినిమా చూసి మా టీం అంతా కూడా చాలా హైలో ఉన్నాం.

నిర్మాత చాలా మంచివారు. ఆయన సినిమాలకు చెందిన వ్యక్తి కాదు. ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలో తెలిసిన వారు. ద్వారక క్రియేషన్స్‌లో పని చేయడం చాలా ఆనందంగా ఉంటుంది.

సినిమాకు ఏం కావాలో అది చేస్తాను. ఎక్కువ ఖర్చు అనేది నేను అంగీకరించను. ఒక్కో పాటకు ఒక్కోలా చేయాల్సి ఉంటుంది. విచ్చలవిడిగా ఖర్చు పెట్టను. శంకర్ మహదేవన్ పాడితే బాగుంటుందని అనుకుంటే.. ఆయనతోనే పాడిస్తాం. అంతే కానీ ఖర్చు తక్కువ అవుతుందని వేరే వాళ్లతో పాడించను. శివుడి మీద ఆయన ఎక్కువ పాటలు పాడారు. శివుడి గురించి ఆయనకు ఎక్కువగా తెలుసు. అందుకే ఆయనతో టైటిల్ సాంగ్ పాడించాం. భీమ్లా నాయక్ పాటను ఇక్కడి వాళ్లతోనే పాడించాం.

సినిమాకు ఏం కావాలంటే అదే ఉంచుతాం. సినిమాకు సెట్ అవ్వడం లేదంటే పాటను తీసేస్తాం. సినిమా గెలవాలంటే ఏం చేయాలో అదే చేస్తాం. డైరెక్టర్‌లకు అన్ని క్రాఫ్ట్స్ మీద గ్రిప్ ఉంటుంది. అందుకే మ్యూజిక్ డైరెక్టర్ అని ఉంటుంది. సినిమా ఫైనల్ కాఫి వరకు నేను డైరెక్టర్‌తో ఉంటాను.

నేను కథకు మ్యూజిక్ చేస్తాను. సినిమాకు ఉపయోగపడే మ్యూజిక్ ఇస్తాను. ఫ్లాప్ సినిమా తీద్దామని ఎవ్వరూ పిలవరు కదా?. నేనేమీ ప్రైవట్ ఆల్బమ్ చేయడం లేదు. సినిమా కోసమే చేస్తాను.

ఇలాంటి జానర్‌లో ఇదే నా బెస్ట్ వర్క్ అవుతుంది. కమర్షియల్ సినిమా అంటే అన్నీ స్పైసీగా ఉండాలి. కానీ ఇలాంటి చిత్రాలకు అది కుదరదు. టైటిల్ సాంగ్‌ను కంపోజ్ చేసేందుకు దాదాపు ఓ నెల రోజులు పట్టింది. గొప్ప సన్నివేశం తరువాత ఆ పాట వస్తుంది. ఈ చిత్రంలో అనవసరంగా పాటలు రావు. వచ్చిన చోట అదిరిపోతుంది.

డైరెక్టర్ కథ చెప్పేటప్పుడే మాకు ఇన్ స్పైరింగ్‌గా ఉంటుంది. పెద్ద పెద్ద ఆర్టిస్ట్‌లుంటే మాకు కూడా ఊపు వస్తుంది. ఇందులో శ్రీకాంత్ గారు, జగపతి బాబు గారు అద్భుతంగా కనిపిస్తారు.

నేను ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేశాను. లేకపోతే ఈ సినిమా ఇంత మ్యూజిక్ అడగదు. సినిమా బాగా ఆకలిగా ఉంది.. బాగా అన్నం పెట్టమంటోంది.

మ్యూజిక్ అనేది చాలా ముందుకు వచ్చింది. పెళ్లికి ముందు గ్రీటింగ్ కార్డ్‌లా మ్యూజిక్ మారింది. ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తోంది. ఇంకో పది, ఇరవై ఏళ్లు ఉంటుంది. ఈ ట్రెండ్ మంచిది. పాట హిట్ అయితే సింగర్ల గురించి వెతుకుతారు. కానీ ఇప్పుడు సింగర్లు ఎంత కష్టపడుతున్నారో అందరికీ తెలుస్తోంది. వారి ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్స్ చూసి సంతోషిస్తారు. ఆ విషయంలో హీరోలకు ముందుగా థ్యాంక్స్ చెప్పాలి. డైరెక్టర్, హీరోలు అందరూ ఒప్పుకుని ప్రోత్సహిస్తున్నారు. ఇలా పాటలను విడుదల చేయడం వల్ల ఆడియో కంపెనీలకు రెవెన్యూ కూడా వస్తోంది.

నంబర్ గేమ్‌ను నేను నమ్మను. అది చాలా చెత్త. మైండ్‌లో అది ఉంటే పరిగెత్తలేం. నంబర్ అనేది గుర్రాలకు జంతువులకు ఉంటుంది. మనకు ఉండకూడదు. మనం రోజూ కష్టపడుతూ ముందుకు వెళ్లాలి.

ఒక్కో పాటను విడుదల చేస్తూ పోతే సినిమాకు ప్రమోషన్స్ కలిసి వస్తుంది. ఇప్పుడు జనాలంతా మారిపోయారు. వారిని ఎప్పుడూ ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. కొన్ని ఆల్బమ్స్‌లో అన్నీ ఒకే సారి విడుదల చేద్దామని అనుకుంటున్నాం. కానీ ఆడియో కంపెనీ వాళ్లు కూడా ఒక్కో పాటను విడుదల చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.

రాత్రి ఫ్లడ్ లైట్ గ్రౌండ్‌ను బుక్ చేసుకుని క్రికెట్ ఆడుతాను. చెమట బయటకు వస్తే ఉదయాన ఫ్రెష్‌గా మళ్లీ పని చేయగలుగుతాను.

సర్కారు వారి పాటకు సంబంధించిన మ్యూజిక్ పూర్తయింది. జనవరి నుంచి ప్రమోషన్స్ ప్రారంభిస్తాం. మనం ఇప్పుడు పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ సినిమాలను చేస్తున్నాం. ప్రభాస్ కోసం జపాన్ నుంచి, మహేష్ బాబు కోసం అమెరికా నుంచి, పవన్ కళ్యాణ్ సినిమా కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. సర్కారు వారి పాట చాలా పెద్ద కమర్షియల్ సినిమా.

రెబల్ సినిమా నుంచి నేనే త‌ప్పుకున్నాను. లారెన్స్ గారే మ్యూజిక్ చేసుకుంటాను అని అన్నారు. అందుకే నేను బయటకు వచ్చాను. మన హీరోలను నేను ఎందుకు వదులుకుంటాను.

పవన్ కళ్యాణ్ గారితో పాట పాడించాలని అనుకుంటున్నాను. త్వరలోనే చెబుతాను.

ట్రెండింగ్ వార్తలు