April 24, 2024
ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. దేశ, విదేశాల్లో బాగా ఆడింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ మూడు వందల కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఓవర్సీస్ లో ఆరేడు మిలియన్ల డాలర్లను రాబట్టింది. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చినా, టీవీల్లో వచ్చినా కూడా థియేటర్లలో ఆడేస్తోంది. వంద రోజుల పాటుగా హనుమాన్ సక్సెస్ ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఓ సినిమా వంద రోజులు ఆడటం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు.
అందుకే హనుమాన్ చిత్రయూనిట్ వంద రోజుల ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక సినిమా వంద రోజులు ఆడటం చూసి చాలా ఏళ్లు అయింది. ఓటీటీ, ఐబొమ్మ ఉండి కూడా వంద రోజులు ఆడటం అంటే మామూలు విషయం కాదు. థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తామని మాటిచ్చాను.. నెరవేర్చాను. ఈ సినిమా రిలీజ్ అయిన క్షణం నుంచి ఇప్పటి వరకు ప్రతీ రోజూ నాకు ప్రశంసలు వస్తూనే ఉన్నాయి. ఇంత అదృష్టం ఇచ్చిన హనుమంతులవారు, శ్రీరాముల వారికి ఎప్పటికీ రుణపడి ఉంటా.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అని కనిపిస్తే నాకు స్క్రీన్ షాట్ తీసి పంపుతున్నారు.. ఇంత ప్రేమను చూపిస్తున్నారు. యూనివర్స్‌లో భాగంగా హనుమాన్ మాత్రమే తీశాను. ఒక్క సినిమాకే ఇంత ప్రేమను చూపిస్తున్నారు. సినిమాటిక్ యూనివర్స్‌లో 20 ఏళ్లు పని చేయబోతోన్నాను.. ఈ యూనివర్స్‌లో హనుమాన్ పాత్రలన్నీ ఉంటాయ్.. సముద్రఖని గారు విభీషణుడిగా కనిపిస్తారు. తేజ హను మ్యాన్‌గా కనిపిస్తాడు, సత్య అతని బర్డ్ కూడా ఉంటుంది అని తెలిపారు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం నాలుగు ప్రాజెక్టులు ఒకే సారి జరుగుతున్నాయి. యూనివర్స్‌లో కొత్త ఆర్టిస్టులు కూడా కనిపిస్తారు. అలాగే ప్రస్తుతం మీరు వింటున్న రూమర్లు అన్నీ నిజమే.. మీరు పెట్టుకునే అంచనాలకు తగ్గట్టుగానే ఉంటాయి.. అన్ని ఎమోషన్స్, ఎలివేషన్స్ ఉంటాయి.. మీరు పెట్టే అన్ని కామెంట్లను చూస్తూనే ఉన్నాను.. ట్రోలింగ్ చేస్తూ పెట్టే నెగెటివ్ కామెంట్లను కూడా చూస్తున్నాను. నాకు పెద్ద లక్ష్యం ఉంది.. సాధించేందుకు ట్రై చేస్తాను.. అందరినీ గర్వపడేలా చేస్తాను అని తెలిపారు ప్రశాంత్ వర్మ.
Read More: మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ కలిసి నటించబోతున్న చిరంజీవి, విజయశాంతి.. ఏ సినిమాలో అంటే!