December 9, 2021
యంగ్‌టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్‌లో దర్శకధీరుడు రాజమౌళి 450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్- రౌద్రం రణం రుధిరం’ (RRR) ట్రైలర్ గురువారం ఉదయం విడుదలైంది. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సీక్వెన్స్‌లు, రోమాలు నిక్కబొడిచే సన్నివేశాలతో ఆద్యంతం అదరహో అనేలా సాగింది. ఇక, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్ (RamCharan), కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటన చూడటానికి రెండు కళ్లూ సరిపోవడం లేదు. ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేస్తోంది. ఇంత వరకూ బానే ఉంది. కాని ఈ ట్రైలర్ గురించి మీడియాతో అభిప్రాయం తెలుసుకోవడానికి ఈ రోజు ముంబై, హైదరాబాద్‌లలో ప్రెస్‌మీట్స్ ఏర్పాటు చేశారు. ముంబైలో బాగానే జరిగింది. ఎన్టీఆర్, రాజమౌళి, ఆలియా, అజయ్ దేవ్‌గణ్, దానయ్య ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. అయితే సాయంత్రం 7గంటల సమయంలో హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, దానయ్య, రాఘవేంద్రరావు హాజరుకావాల్సింది. కాని ఇక్కడే నిర్వాహకులు చేసిన పొరపాటు ప్రెస్‌మీట్ క్యాన్సల్ అయ్యేలా చేసింది.
అసలు టీమ్‌కు తెలియకుండానే ఫ్యాన్స్‌కు పాస్‌లు అందించింది నిర్వాహక బృందం. దాంతో అక్కడ అభిమానులు విపరీతంగా గుమికూడారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చేసేదేం లేక కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు రాజమౌళి తెలిపారు.
సాధారణంగానే పెద్దసినిమాల ప్రెస్‌మీట్లు ఆలస్యంగా జరుగుతుంటాయి. అందులో దాదాపు రెండు గంటలు వెయిట్ చేసిన తర్వాత రాజమౌళి వచ్చి ప్రెస్‌మీట్ క్యాన్సిల్ అయిందని రెండు రోజుల్లో మళ్లీ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి క్షమాపణలు చెప్పడంతో మీడియావారికి ఏం చేయాలో తెలీని పరిస్థితి నెలకొంది.
అయితే ఫ్యాన్ పాసులు అప్పటికప్పుడు అయ్యే పనికాదు ప్రింటింగ్ చేయించడం..పంచడం అనేది దాదాపు సగంరోజు పడుతుంది. నిజంగానే ఈ తతంగం అంతా రాజమౌళి అండ్ కో కు తెలియకుండానే జరిగిందా? లేదా వేరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
పాన్ ఇండియా చిత్రంగా నిర్మితమైన ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే..